గ్రేటర్​ రోడ్లపై కనిపించని అధికారుల పర్యవేక్షణ

గ్రేటర్​ రోడ్లపై కనిపించని అధికారుల పర్యవేక్షణ
  • కుంగిన చోట బారికేడ్లు పెట్టి మేనేజ్ చేస్తున్న బల్దియా
  • ఇబ్బంది పడుతున్న వాహనదారులు

హైదరాబాద్, వెలుగు: సిటీలోని రోడ్లు అధ్వానంగా మారుతున్నాయి. కొన్ని చోట్ల కుంగిపోగా, అనేక ప్రాంతాల్లో గుంతలు పడి దారుణంగా ఉన్నాయి. దీంతో వాహనదారులు అవస్థ పడుతున్నారు. అయినప్పటికీ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవడం లేదు. రోడ్లు కుంగుతుండటం, గుంతలు, డ్రైనేజీ లీకేజ్, మట్టి కొట్టుకుపోయి, ఇసుక, కంకర పైకి తేలిన రహదారులు నగరవాసులకు నరకం చూపిస్తున్నాయి. రద్దీ రోడ్లపై వెహికల్స్ నడపడమే పెద్ద టాస్క్​అయితే, దానికితోడు రోడ్లు సరిగాలేక ప్రమాదాలు బారిన పడకుండా బయటపడటం పెద్ద సవాల్​గా మారింది. బయటకు వెళ్లి తిరిగి ఇంటికి సురక్షితంగా వచ్చేవరకు భయంగానే ఉంటోందని సిటిజన్లు పేర్కొంటున్నారు. రోడ్లు సరిగాలేక బైక్​ నడిపేవారు పట్టుతప్పి ప్రమాదాల బారిన పడుతున్నారు. అయినప్పటికీ అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కుంగుతుండటంతో కంగారు..

ఈ మధ్య సిటీలో ఎక్కడపడితే అక్కడ రోడ్లు కుంగుతున్నాయి. దీంతో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని జనం భయంభయంగానే ప్రయాణిస్తున్నారు. వారం రోజుల కిందట హిమాయత్​నగర్‌‌ స్ట్రీట్​ నం.5లో వెళ్తున్న టిప్పర్ బరువుకు రోడ్డు 10 అడుగుల వరకు కుంగిపోయి వెహికల్ ఇరుక్కుపోయింది. టిప్పర్​లో ఉన్న ముగ్గురికి గాయాలయ్యాయి. గోషామహల్​లోని చాక్నవాడిలో కూడా ఆ మధ్య ఉన్నట్టుండి రోడ్డు కుంగిపోవడంతో కిందపడిపోయి పలువురికి గాయాలయ్యాయి. అక్కడ పార్క్ చేసి ఉన్న కార్లు, ఆటోలు, బైక్‌లు, కూరగాయల బండ్లు ధ్వంసమయ్యాయి. 

పాడైన రోడ్లపై.. 

సిటీవ్యాప్తంగా రోడ్ల మీద సుమారు ఐదువేలకు పైగా గుంతలున్నట్లు సమాచారం. ఈ గుంతలతోపాటు పైకి ఉన్న మ్యాన్‌హోల్స్ మూతలు, క్యాచ్‌పిట్‌ల కారణంగా రోడ్ల మీద రైడ్ చేయాలంటేనే వాహనదారులు జంకుతున్నారు. రోడ్లపై నీరు నిలిచిపోవడం, గుంతలు, మ్యాన్‌హోల్స్ ఎక్కడ ఉన్నాయో తెలియక చాలామంది వాటిలో పడి గాయపడుతున్నారు. రోడ్లను సరిగా క్లీన్ చేయక పోవడం వల్ల చాలా చోట్ల ఇసుక, మట్టి పేరుకుపోతోంది. అక్కడ టూ వీలర్లు స్కిడ్​అయిన సంద
ర్భాలు కూడా ఉన్నాయి.

ప్రమాదాలు జరిగినప్పుడే హడావుడి

అయితే, ఇలా ప్రమాదాలు జరిగిన సమయంలోనే హడావుడి చేస్తున్న అధికారులు అక్కడ బారికేడ్లు మాత్రమే ఏర్పాటు చేసి చేతులు దులుపుకుంటున్నారు. ఆ తర్వాత పట్టించుకోవడం లేదు. భారీగా గుంతలు పడిన, తవ్వి వదిలేసిన రోడ్ల చుట్టూ కూడా బారికేడ్లనే పెట్టి సమస్యను వదిలేస్తున్నారు. ఆ బారికేడ్ల వల్ల సగం రోడ్డు ఆక్రమణకు గురవుతున్నాయి. దీంతో ఆ మార్గాల్లో ప్రయాణించేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించి, చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. 

సరైన సిస్టమ్ లేక.. 

రోడ్లపై గుంతలు పడితే తాత్కాలికంగా రిపేర్​చేస్తుండటంతో మళ్లీ సమస్య అవుతోంది. నిజామ్​ కాలంలో వేసిన సబ్ గ్రేడ్ లెవెల్స్​ను ఇప్పటివరకు మార్చలేదు. వాటిని రీస్ట్రక్చరింగ్ చేయలేదు. డెన్సిటీని పెంచే వ్యవస్థ బల్దియాలో లేకపోవడంతో కింద నీటి ప్రవాహం వల్ల బరువు పడినప్పుడు రోడ్డు కుంగిపోతోంది. సైంటిఫిక్​గా ఎక్కడ ఎలాంటి మెటీరియల్ వాడాలో అక్కడ అలా చేయడం లేదు. దీంతో రోడ్లు పాడై కుంగిపోతున్నాయి. 

- లక్ష్మణ్ రావు, 
ఫ్రొఫెసర్, జేఎన్టీయూ

రోడ్లు కొట్టుకుపోయినయ్..

సిటీ రోడ్ల మీద వెహికల్​ నడపడం చాలా రిస్కీగా ఉంటోంది. చాలా చోట్ల గుంతలు ఉంటున్నాయి.  పెద్ద గుంతలు పడిన దగ్గర పనులు జరుగుతున్నాయని బారికేడ్లు పెడుతున్నారు. వీటి వల్ల సగం రోడ్డు పోతోంది. పనులు కూడా చాలా నెమ్మదిగా చేస్తున్నారు. రోడ్లపై గుంతలను పూడ్చాలి.

- కల్పన, ప్రైవేటు ఎంప్లాయ్, సికింద్రాబాద్