కశ్మీర్: భారత్ చర్యలకు ఈయూ బృందం మద్దతు

కశ్మీర్: భారత్ చర్యలకు ఈయూ బృందం మద్దతు

శ్రీనగర్: ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్లో పరిస్థితులను చూస్తామంటూ పర్యటనకు వెళ్లిన ఈయూ ఎంపీల బృందం భారత్ కు మద్దతుగా నిలిచింది. లోయలో శాంతి నెలకొల్పేందుకు తీసుకుంటున్న చర్యలను మెచ్చుకుంది. ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు ఆర్మీ చేస్తున్న కృషికి తమ పూర్తి మద్దతు ఉంటుందని చెప్పారు యూరోపియన్ యూనియన్ పార్లమెంటేరియన్లు.

భారత్ అంతర్గత వ్యవహారమే

కశ్మీర్ విషయం పూర్తిగా భారత్ అంతర్గత వ్యవహారమేనని ఈయూ ఎంపీలు అన్నారు. ఈ విషయంలోగానీ, ఇండియా రాజకీయాల్లోగానీ వేలుపెట్టడం తమ పర్యటన ఉద్దేశం కాదని చెప్పారు. కేవలం కశ్మీర్లో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకే వచ్చామన్నారు. అయితే కశ్మీర్ పర్యటనకు ఈయూ టీమ్ ను అనుమతించిన భారత ప్రభుత్వం ఇక్కడి విపక్షాలకు కూడా పర్మిషన్ ఇస్తే బావుంటుందని నికోలస్ ఫెస్ట్ అనే ఎంపీ కామెంట్ చేశారు. దీన్ని ప్రభుత్వం బ్యాలెన్స్ చేస్తే మేలని అన్నారు.

ఇండియన్స్ గా ఉంటామన్న కశ్మీరీలు..

ఆగస్టు 5న కేంద్రం ఆర్టికల్ 370ని రద్దు చేసి జమ్ము కశ్మీర్ ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత అక్కడ పర్యటించిన తొలి విదేశీ బృందం ఇది. కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందంటూ విదేశీ మీడియా నుంచి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ బృందం భారత్ కు మద్దతు పలకడం విశేషం. ఈ బృందం నిన్న ఆర్మీ అధికారులతో భేటీ అయింది. వీరు తమ పర్యటనలో భాగంగా జమ్ము కశ్మీర్లోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. అక్కడి పంచాయతీ సర్పంచ్ లను కలిసి మాట్లాడి స్థానిక పరిస్థితులను తెలుసుకున్నారు. తాము భారతీయులమేనని, దేశంలోని అందరు భారతీయుల్లానే బతకాలని కోరుకుంటున్నామని కశ్మీరీలు తమకు చెప్పారని ఈయూ ఎంపీలు వివరించారు.