
- మీ పిటిషన్‌ను సీజేఐకి పంపిస్తున్నం
- కేజ్రీవాల్ బెయిల్ పొడిగింపుపై అత్యవసర విచారణకు నిరాకరణ
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. హెల్త్ కండీషన్ బాగా లేదని.. వారం రోజుల పాటు తన బెయిల్ పొడిగించాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించేందుకు వెకేషన్ బెంచ్ నిరాకరించింది. ఇందులో ప్రస్తుతం జోక్యం చేసుకోలేమని వెకేషన్ బెంచ్‌లోని జడ్జిలు జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ కేవీ విశ్వనాథన్ తెలిపారు. దీనికి ముందు కేజ్రీవాల్ తరఫున కపిల్ సిబల్ వాదనలు వినిపించారు.
‘‘కేజ్రీవాల్ ప్రస్తుతం మధ్యంతర బెయిల్‌పై ఉన్నారు. బెయిల్ జూన్ 2తో ముగియనున్నది. ఆయన ఆరోగ్యం బాగా లేదు. తిహార్ జైలు అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఆయనకు ఈ పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కేజ్రీవాల్‌కు వైద్య పరీక్షలు చేయించాల్సి ఉంది. సీటీ స్కాన్ చేయాలని డాక్టర్లు చెప్పారు. మరో ఏడు రోజులు బెయిల్ పొడిగించండి. ఆయన వేసిన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించండి’’ అని బెంచ్‌ను సిబల్ కోరారు.
దీనిపై బెంచ్ స్పందిస్తూ.. ‘‘ఈడీ అక్రమంగా అరెస్ట్ చేసిందంటూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌కు సంబంధించిన తీర్పు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్‌తో కూడిన బెంచ్ రిజర్వ్ చేసింది. ఇందులో మేము జోక్యం చేసుకోలేం. అత్యవసర విచారణ వీలుకాదు. అందుకే ఈ పిటిషన్‌ను సీజేఐ ముందుకు పంపుతున్నం. ఆయన ఈ పిటిషన్‌ను లిస్ట్ చేయడంపై నిర్ణయం తీస్కుంటారు’’ అని జస్టిస్ జేకే మహేశ్వరి, కేవీ విశ్వనాథన్‌తో కూడిన వెకేషన్ బెంచ్ స్పష్టం చేసింది.
నెల రోజుల్లో ఏడు కిలోలు తగ్గిన: కేజ్రీవాల్
ఏ కారణం లేకుండానే తాను ఏడు కిలోల బరువు తగ్గినట్టు కేజ్రీవాల్ చెప్పారు. ఇది అత్యంత ప్రమాదకరమని అన్నారు. భటిండాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘నా బరువు చాలా తగ్గింది. ఏ వ్యక్తి అయినా ఎలాంటి కారణం లేకుండా నెల రోజుల్లో ఏడు కిలోలు తగ్గితే చాలా సీరియస్ అంశం. నేను అలాంటి పరిస్థితే ఎదుర్కొంటున్న. నేనేదో సీరియస్ డిసీజ్ బారినపడినట్టు అనిపిస్తోంది. డాక్టర్లు సూచించిన టెస్టులు చేయించుకోవడం కోసం మరో ఏడు రోజులు బెయిల్ పొడిగించాలని కోర్టును కోరా” అని కేజ్రీవాల్ వివరించారు.