కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై  సుప్రీంకోర్టు ఆగ్రహం

ఇకపై జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశం

ఎక్కడైనా చేసినట్టు తెలిస్తే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్

న్యూఢిల్లీ: మహిళపై అత్యాచారం జరిగిందా లేదా అని తెలుసుకోవడానికి ‘టూ ఫింగర్​ టెస్టు’ను ఇంకా అమలు చేస్తున్నారా? అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీం కోర్టు ప్రశ్నించింది. 2013లోనే ‘టూ ఫింగర్​ టెస్టు’ను తప్పుబట్టిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసింది. వెంటనే ఈ టెస్టును ఆపేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ టెస్టుకు ఎలాంటి శాస్ర్తీయత లేదని పేర్కొంటూ ఇకపై ఎక్కడైనా టూ ఫింగర్​ టెస్టు చేసినట్టు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

ఓ రేప్​ ఘటనకు సంబంధించిన విచారణలో భాగంగా జస్టిస్​ డీవై చంద్రచూడ్, జస్టిస్​ హిమా కోహ్లీ ఆధ్వర్యంలోని బెంచ్ ‘టూ ఫింగర్​ టెస్ట్’పై కీలక వ్యాఖ్యలు చేసింది. టూ ఫింగర్​ టెస్టు చేయడంతో మహిళల ఆత్మగౌరవం దెబ్బతింటుందని, ప్రైవసీకి భంగం కలుగుతుందని అభిప్రాయపడింది. ఇప్పటికీ సమాజంలో ఈ టెస్టు కొనసాగుతుండటం దురదృష్టకరమని తెలిపింది. ఇకపై ఎక్కడా ఈ టెస్ట్ జరగకుండా చూసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు హెల్త్​ సెక్రటరీలు ‘టూ ఫింగర్​ టెస్టు’కు ప్రత్యామ్నాయ పద్ధతులు కనుగొనాలని, వాటిపై హెల్త్​ వర్కర్లకు ట్రైనింగ్​ ఇవ్వాలని సూచించింది. గవర్నమెంట్, ప్రైవేట్​ మెడికల్​ కాలేజీ పుస్తకాల్లోని ‘టూ ఫింగర్​ టెస్ట్’ అంశాన్ని సమీక్షించి, వెంటనే తొలగించాలని ఆదేశించింది. అత్యాచారం, హత్య చేసిన నిందితుడిని నిర్దోషిగా ప్రకటిస్తూ జార్ఖండ్​ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం బెంచ్​తోసిపుచ్చింది. అతన్ని దోషిగా పేర్కొంటూ ట్రయల్​ కోర్టు నిర్ణయాన్ని సమర్థించింది.