
- పిటిషన్ల కొట్టివేత
- 9 శాతం పడిన వీఐ స్టాక్
న్యూఢిల్లీ: అడ్జెస్టెడ్ గ్రాస్ రెవెన్యూ (ఏజీఆర్) బకాయిలను మాఫీ చేయాలని కోరుతూ టెలికాం కంపెనీలు వొడాఫోన్, ఎయిర్‌టెల్, టాటా టెలిసర్వీసెస్ దాఖలు చేసిన పిటిషన్‌లను సుప్రీంకోర్టు సోమవారం తోసిపుచ్చింది. ఈ విషయంలో ఎటువంటి మినహాయింపులనూ ఇవ్వబోమని స్పష్టం చేసింది. న్యాయమూర్తి జేబీ పార్దివాలా, మహాదేవన్‌లతో కూడిన బెంచ్ధర్మాసనం ఈ పిటిషన్లపై విచారణ జరిపింది. "మా ముందుకు వచ్చిన ఈ పిటిషన్లను చూసి నిజంగా షాకయ్యాం! కలత చెందాం. మల్టీ నేషనల్ కంపెనీల నుంచి ఇలాంటివి ఆశించలేదు. ఈ పిటిషన్లను డిస్మిస్ చేస్తున్నాం" అని వొడాఫోన్ ఐడియా తరపున హాజరైన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గికి స్పష్టం చేసింది. కేసుల విచారణను జులై వరకు వాయిదా వేయాలన్న విన్నపాన్నీ పట్టించుకోలేదు. వాయిదా ఎందుకని కోర్టు ప్రశ్నించగా, సుప్రీంను ఇబ్బంది పెట్టకుండా ఏదైనా చేయవచ్చా ? అనే కోణంలో పిటిషనర్లు ఆలోచిస్తున్నారని, ప్రభుత్వానికి ఇప్పుడు వొడాఫోన్‌లో 50 శాతం వాటా ఉందని బెంచ్‌కి వివరించారు. దీనికి జడ్జీలు స్పందిస్తూ ప్రభుత్వం సహాయం చేయాలనుకుంటే తమకేమీ అభ్యంతరం లేదంటూ పిటిషన్లను కొట్టేశారు. జూలై 2021 నాటి సుప్రీంకోర్టు తీర్పు కారణంగా సహాయం అందించలేమని కేంద్రం నిస్సహాయత వ్యక్తం చేసిందని రోహత్గి అన్నారు. వొడాఫోన్ రూ.30 వేల కోట్ల విలువైన ఏజీఆర్ బకాయిలు, వడ్డీ, జరిమానాలను మాఫీ చేయాలని కోరింది. ఎయిర్‌టెల్, దీని అనుబంధ సంస్థ భారతీ హెక్సాకామ్ రూ.43,980 కోట్ల బకాయిలను మాఫీ చేయాలని విన్నవించాయి.
ఏజీఆర్ వివాదం ఏమిటి?
సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం (ఏజీఆర్) టెలికాం ఆపరేటర్లు ప్రభుత్వానికి చెల్లించాల్సిన లైసెన్స్ ఫీజు, స్పెక్ట్రమ్ వినియోగ చార్జీలను లెక్కించడానికి ఉపయోగించే ఆదాయం. టెలికాం శాఖ తన లెక్కల్లో టెలికాంయేతర ఆదాయాన్ని కూడా చేర్చాలని కోరగా, కంపెనీలు కేవలం టెలికాం సేవల ద్వారా వచ్చే ఆదాయాన్ని మాత్రమే పరిగణించాలని వాదించాయి. ఈ వివాదం చాలా కాలంగా కొనసాగుతోంది. చివరకు, సుప్రీంకోర్టు టెలికాం శాఖ వాదనతో ఏకీభవిస్తూ 2019లో తీర్పును వెలువరించింది. ఈ తీర్పు కారణంగా టెలికాం కంపెనీలు ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాల్సి వస్తోంది. టెలికం శాఖ లెక్కల ప్రకారం ఆపరేటర్లు రూ.1.47 లక్షల కోట్లు చెల్లించాలి. వీటిలో రూ.96,642 కోట్లు లైసెన్సు ఫీజుకు, రూ.55,054 కోట్లు స్పెక్ట్రమ్ వాడకం చార్జీలు ఉన్నాయి. అయితే 75 శాతం మొత్తం వడ్డీ, పెనాల్టీ, పెనాల్టీలపై వడ్డీలే ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చాలా టెలికాం సంస్థలు వెంటనే అంత పెద్ద మొత్తాన్ని చెల్లించలేకపోయాయి. దీంతో 2020 సెప్టెంబర్‌లో టెలికాం సర్వీస్ ప్రొవైడర్లకు 10 సంవత్సరాల కాలపరిమితిని నిర్ణయించింది. టెలికమ్యూనికేషన్స్ శాఖ (డాట్) కోరిన విధంగా మొత్తం బకాయిలలో 10 శాతం మొత్తాన్ని మార్చి 31, 2021 నాటికి చెల్లించాలని, మిగిలిన మొత్తాన్ని ఏప్రిల్ 1, 2021 నుంచి మార్చి 31, 2031 వరకు ఏడాది వాయిదాలలో చెల్లించాలని సుప్రీంకోర్టు పేర్కొంది.
తీర్పు ప్రభావం
సుప్రీంకోర్టు ఈ తాజా తీర్పు టెలికాం రంగంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని టెలికం రంగ ఎక్స్పర్టులు అంటున్నారు. ఇప్పటికే ఆర్థికంగా కష్టాల్లో ఉన్న వోడాఫోన్ ఐడియాకు ఈ తీర్పు మరింత భారంగా మారవచ్చు. బకాయిలు చెల్లించాల్సిన ఒత్తిడి పెరగడంతో, కంపెనీ మనుగడ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది. వోడాఫోన్ ఐడియాతో పోలిస్తే భారతీ ఎయిర్‌టెల్ ఆర్థికంగా కొంత మెరుగైన స్థితిలో ఉన్నప్పటికీ, ఈ తీర్పుతో దానికి కూడా గణనీయమైన ఆర్థిక భారం తప్పదు. బకాయిల భారం కారణంగా కొన్ని టెలికాం కంపెనీలు ఇతర కంపెనీల్లో విలీనం కావడం లేదా తమ వ్యాపారాలను విక్రయించడం వంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కంపెనీలు తమ ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికి టారిఫ్‌లను పెంచే అవకాశం కూడా లేకపోలేదు. ఇది సామాన్య వినియోగదారులపై ప్రభావం చూపుతుంది. సుప్రీంకోర్టు నిర్ణయంతో వోడాఫోన్ ఐడియా షేర్లు దాదాపు 9 శాతం పడిపోయాయి.