ట్యూషన్ ఫీజులు స్టూడెంట్లకు అందుబాటులో ఉండాలి: సుప్రీం

ట్యూషన్ ఫీజులు స్టూడెంట్లకు అందుబాటులో ఉండాలి: సుప్రీం

 

  • మెడికల్ కాలేజీల్లో ఫీజులు పెంచుతూ ఏపీ సర్కార్ ఇచ్చిన జీవో కొట్టివేత
  • అదనంగా వసూలు చేసిన ఫీజులు స్టూడెంట్లకు తిరిగి ఇవ్వాలని ఆదేశం 
  • నారాయణ మెడికల్ కాలేజీ,ఏపీ సర్కార్​కు కలిపి రూ.5 లక్షల జరిమానా 

న్యూఢిల్లీ: డబ్బులు సంపాదించుకోవడానికి విద్య వ్యాపారం కాదని సుప్రీంకోర్టు కామెంట్ చేసింది. మెడికల్ కాలేజీల్లో ట్యూషన్ ఫీజులు పెంచుతూ ఏపీ సర్కార్ తెచ్చిన జీవో చెల్లదని స్పష్టం చేసింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. ‘‘ట్యూషన్ ఫీజు ఏడాదికి రూ.24 లక్షలు చేశారు. అంటే అంతకుముందు ఉన్న ఫీజుకు ఏడు రెట్లు ఎక్కువ. ఇది ఏమాత్రం సరికాదు. సంపాదించుకోవడానికి విద్యేమీ వ్యాపారం కాదు. ట్యూషన్ ఫీజులు ఎప్పుడైనా సరే స్టూడెంట్లు భరించే విధంగా ఉండాలి” అని పేర్కొంది. ఈ మేరకు జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సుధాంశ్ ధూలియాలతో కూడిన డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చింది. ఏపీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ నారాయణ మెడికల్ కాలేజీ వేసిన పిటిషన్ ను కొట్టివేసింది.

అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ (ఏఎఫ్ ఆర్సీ) సిఫార్సుల మేరకే ట్యూషన్ ఫీజులు వసూలు చేయాలని, అంతకన్నా ఎక్కువ వసూలు చేసిన మొత్తాన్ని విద్యార్థులకు తిరిగి ఇవ్వాలని ఆదేశించింది. నారాయణ మెడి కల్ కాలేజీ, ఏపీ సర్కార్ కు రూ.5 లక్షల జరిమానా విధించింది. చెరో రూ.2.5 లక్షల చొప్పున సుప్రీంకోర్టు రిజిస్ట్రీకి ఆరు వారాల్లోగా జమ చేయాలని ఆదేశించింది. 

ఏంటీ కేసు? 

2017లో టీడీపీ సర్కార్ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ కోర్సుల ట్యూషన్ ఫీజును ఏడాదికి రూ.24 లక్షలకు పెంచుతూ జీవో ఇచ్చింది. ఏఎఫ్ ఆర్సీ ఎలాంటి సిఫార్సులు చేయకుండానే ఫీజులు పెంచింది. దీనిపై కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఏఎఫ్ ఆర్సీ సిఫార్సులు లేకుండా ఫీజుల పెంపు చెల్లదని హైకోర్టు స్పష్టం చేసింది. జీవోను కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది. అయితే దీన్ని సవాల్ చేస్తూ నారాయణ మెడికల్ కాలేజీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది.

మరిన్ని వార్తలు