సీఏఏపై స్టే ఇవ్వలేం .. కేంద్రానికి నోటీసులు జారీ

సీఏఏపై స్టే ఇవ్వలేం .. కేంద్రానికి నోటీసులు జారీ
  • మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం
  • విచారణ ఏప్రిల్ 9కు వాయిదా

న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలుపై స్టే విధించాలన్న పిటిషనర్ల రిక్వెస్ట్​ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. ఈమేరకు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. సీఏఏ రాజ్యాంగ చట్టబద్ధతను సవాల్‌‌‌‌ చేస్తూ సుప్రీం కోర్టులో మొత్తం 237 పిటిషన్లు దాఖలయ్యాయి.

చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం మంగళవారం పిటిషన్లపై విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫు అడ్వకేట్ల వాదనలు విన్నది. మూడు వారాల్లోగా పిటిషన్లపై సమాధానం చెప్పాలని కేంద్ర ప్రభుత్వానికి ధర్మాసనం ఆదేశించింది.

ఒకవైపు వాదనలు విన్నామని, ప్రభుత్వం తరఫు నుంచి ఏం సమాధానం వస్తుందో వేచి చూడాల్సి ఉందని సీజేఐ డీవై చంద్రచూడ్ తెలిపారు. సీఏఏపై తాము ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయడం లేదని చెప్పారు. ముస్లిం కమ్యూనిటీకి వ్యతిరేంగా సీఏఏ నిబంధనలు ఉన్నాయంటూ కేరళకు చెందిన ‘ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్’ పొలిటికల్ పార్టీ, కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్, టీఎంసీ నేత మహువా మొయిత్రాతో పాటు పలువురు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీఏఏకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై తుది తీర్పు వెల్లడయ్యే వరకు చట్టం అమలును నిలిపివేయాలని పిటిషనర్లు కోరారు.

తీర్పు వచ్చేదాకా అమలు ఆపాలి

పిటిషనర్ల తరఫు నుంచి సీనియర్ అడ్వకేట్ ఇందిరా జైసింగ్ తమ వాదనలు వినిపించారు. సీఏఏపై విచారణ కొనసాగుతున్నదని, ఫైనల్ జడ్జిమెంట్ వచ్చేదాకా ఎవరికీ పౌరసత్వం ఇవ్వబోమని కేంద్రంతో ప్రకటన చేయించాలని కోర్టును కోరారు. దీనిపై సొలిసిటర్ జనరల్ స్పందిస్తూ.. 237 పిటిషన్లపై పూర్తి స్థాయిలో అఫిడవిట్ దాఖలు చేస్తామన్నారు. 4 వారాల టైం కావాలని కోరారు.

20 అప్లికేషన్లకు సంబంధించిన వివరాలు సబ్మిట్ చేశామని తెలిపారు. సీఏఏ అనేది ఏ ఒక్కరి పౌరసత్వాన్ని లాక్కోదని చెప్పారు. సీఏఏ అమలుతో  పిటిషనర్లలో ఎవరూ ప్రభావితం కారని కోర్టుకు వివరించారు. ఇలాంటి సమయంలో సీఏఏ అమలుపై స్టే విధించాలని కోరడం సరికాదన్నారు. దీనిపై ఇందిరా జై సింగ్ స్పందిస్తూ.. కౌంటర్ దాఖలు చేయడానికి ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వొచ్చని, అయితే.. అప్పటి దాకా సీఏఏ అమలు చేయకుండా స్టే విధించాలని కోర్టుకు విన్నవించారు. 

ఇప్పుడే చేయాల్సిన అవసరం ఏముంది? 

మరో పిటిషనర్ తరఫు అడ్వకేట్ కపిల్ సిబల్ కూడా తమ వాదనలు వినిపించారు. 2019లోనే పార్లమెంట్​లో సీఏఏ ఆమోదం పొందిందని గుర్తు చేశారు. 2024లో అమలు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో ప్రభుత్వం చెప్పాలని కోర్టు ద్వారా కోరారు. లోక్​సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం సీఏఏ అమలు చేయాలని చూస్తున్నదని వివరించారు. సీఏఏ అమలవుతున్నదని, కొందరికి పౌరసత్వం కూడా ఇచ్చారని తెలిపారు. పిటిషనర్లకు అనుకూలంగా తీర్పు వస్తే.. పౌరసత్వం వెనక్కి తీసుకోవడం అసాధ్యమని కోర్టుకు వివరించారు.

తుది తీర్పు వెలువడే దాకా సీఏఏ అమలుపై స్టే విధించాలని ధర్మాసనానికి విన్నవించారు. ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం.. పిటిషన్లకు జవాబు చెప్పాలని కేంద్రాన్ని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు 3 వారాల గడువు ఇస్తున్నట్టు వెల్లడించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 9కు వాయిదా వేసింది. 2019లో పార్లమెంట్‌‌‌‌ ఆమోదం పొందిన సీఏఏను సవాల్‌‌‌‌ చేస్తూ అప్పట్లోనే పలు పిటిషన్లు దాఖలయ్యాయి. తాజాగా సీఏఏ నిబంధనలు–2024ను నోటిఫై చేయడంతో చట్టం అమలవుతున్నది. దీంతో ఈ అంశం మళ్లీ కోర్టుకు చేరింది.