కరోనా నియంత్రణపై కేంద్రానికి సుప్రీం నోటీసులు

కరోనా నియంత్రణపై కేంద్రానికి సుప్రీం నోటీసులు

కేంద్రం తీరు చూస్తుంటే ప్రజల ప్రాణాలంటే పట్టింపు లేనట్లుందని ఆగ్రహం వ్యక్తం చేసింది ఢిల్లీ హైకోర్టు. హాస్పిటళ్లకు సరిపడా ఆక్సిజన్ అందించాలని ఆదేశించింది. కరోనా విజృంభణతో అనేక రాష్ట్రాల్లో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. మహారాష్ట్రలో మరిన్ని ఆంక్షలు పెట్టారు. తమ ప్రజలకు ఫ్రీగా వ్యాక్సిన్ ఇస్తామని ప్రకటించాయి యూపీ, అస్సాం, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, కేరళ ప్రభుత్వాలు.

ఢిల్లీలో ఆక్సిజన్ కొరత విషయంలో కేంద్రంపై మరో సీరియస్ అయింది ఢీల్లీ హైకోర్టు. కేంద్రం తీరు చూస్తుంటే ప్రజల ప్రాణాలంటే ఏమాత్రం పట్టింపులేదనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత ఇంతలా ఉన్నా.. మీరింక ఎందుకు మేల్కోవడంలేదని కేంద్రాన్ని ప్రశ్నించింది. ఆక్సిజన్ సరఫరా కోసం మ్యాక్స్ హాస్పిటల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఢిల్లీలోని తమ హాస్పిటల్ కు అత్యవసరంగా ఆక్సిజన్ సరఫరా చేసేలా ఆదేశాలివ్వాలని న్యాయస్థానాన్ని కోరింది. ఆక్సిజన్ నిల్వలు 3 గంటలకు మించి లేనందున ఆక్సిజన్ అందించేలా కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. ఈ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు అత్యవసర విచారణ చేపట్టింది. వెంటనే మ్యాక్స్ హాస్పిటల్ కు ఆక్సిజన్ అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. 

ఇలాంటి కఠిన పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి హాస్పిటళ్లకు కాకుండా పరిశ్రమలకు ఆక్సిజన్ అందించడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది ఢిల్లీ హైకోర్టు. ఆక్సిజన్ కొరతపై ఇంతకుముందే ఆదేశాలు ఇచ్చినా పాటించలేదంటూ అసహనం వ్యక్తం చేసింది. ఆక్సిజన్ కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంటుందని తెలిపింది. పారిశ్రామిక అవసరాలకు ఆక్సిజన్ సరఫరా నిలిపేయాలని కేంద్రానికి సూచించింది. ఢిల్లీలోని హాస్పిటల్స్ లో ఆక్సిజన్ కొరత తీవ్రంగా మారింది. కొన్ని హాస్పిటళ్లలో గంటలకు సరిపడా ఆక్సిజన్ ఉన్న పరిస్థితి. ఆక్సిజన్ షార్టేజ్ తో 1200 మంది పేషెంట్లు ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నారు. వెంటనే అలర్ట్ అయిన ప్రభుత్వం ఆగమేఘాలపై కొన్ని హాస్పిటల్స్ కు ఆక్సిజన్ సరఫరా పునరుద్ధరించింది. మరోవైపు ఢిల్లీ ఆక్సిజన్ కోటాను కేంద్రం పెంచినట్టు సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు.

దేశంలోని అనేక రాష్ట్రాల్లో కరోనా కారణంగా కఠిన ఆంక్షలు అమలవుతున్నాయి. అక్కడక్కడా జనం ఆంక్షలను పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారు. ఓవరాల్ గా జనం ఎక్కువగా బయట కనిపించడంలేదు. దేశవ్యాప్తంగా శ్రీరామ నవమి వేడుకల్లోనూ రద్దీ కనిపించలేదు. కార్యక్రమాలు కూడా పెద్దగా జరగలేదు. ఆలయాల్లోకి ఎవరినీ అనుమతించలేదు.

కరోనా కేసులు పెరుగుతుండటంతో లాక్ డౌన్ కు సంబంధించి మహారాష్ట్ర పభుత్వం మరిన్ని ఆంక్షలు విధించింది. పభుత్వ, ప్రైవేట్ ఆఫీసులు ఇప్పటిదాకా 50 శాతం మంది సిబ్బందితో పనిచేయించుకుంటుండగా.. ఇకపై 15 శాతం మందితోనే నడపాలని ఆదేశాలిచ్చింది. ఎమర్జెన్సీ విభాగాలు తప్పా అన్ని పభుత్వశాఖల్లోనూ 15 శాతానికే సిబ్బందిని పరిమితం చేసింది. పెళ్లీలు 25 మందితోనే రెండు గంటల్లోనే జరుపుకోవాలని ఆంక్షలు పెట్టింది. రూల్స్ ఉల్లంఘించిన కుటుంబాలకు 50వేల ఫైన్ వేస్తామని హెచ్చరించింది. 50 శాతం మంది ప్రయాణికులతోనే ప్రైవేట్ బస్సులు నడుపుకోవాలని తేల్చి చెప్పింది. స్టాండింగ్ జర్నీలను నిషేధించింది. మెడికల్ ఎమర్జెన్సీ, అంత్యక్రియలకు వెళ్లేవాళ్లకే అనుమతి ఉంటుందని చెప్పింది. ప్రయాణ రూల్స్ ఉల్లంఘిస్తే 10వేల ఫైన్ వేస్తామని హెచ్చరించింది. కొత్త ఆంక్షలు మే 1 వరకు అమల్లో ఉంటాయని తెలిపింది. 

కరోనా కట్టడిలో భాగంగా కేంద్ర పాలిత ప్రాంతం చంఢీఘఢ్ లో ఒక్కరోజు లాక్ డౌన్ అమలు చేశారు. లాక్ డౌన్ ను పోలీసులు కఠినంగా అమలు చేయడంతో రోడ్లు నిర్మానుష్యంగా కనిపించాయి. మరోవైపు నైట్ కర్ఫ్యూ, వీకెండ్ లాక్ డౌన్ టైంను కూడా పెంచింది అక్కడి ప్రభుత్వం.  గోవాలోనూ బుధవారం రాత్రి నుంచి నైట్ కర్ఫ్యూ విధించారు. ఏప్రిల్ 30వరకు ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.

రాజస్థాన్ కోటాలో దారుణం జరిగింది. మెడికల్ కాలేజీ హాస్పిటల్ లో ఆక్సిజన్ కొరతతో ఇద్దరు కరోనా పేషంట్లు చనిపోయారు. మృతుల్లో ఒక మహిళ పేషంట్ ఉన్నారు. రాత్రి ఒంటి గంటకు ఆక్సిజన్ సప్లై నిలిచిపోయిందని..తిరిగి తెల్లవారుజామున నాలుగు గంటలకు ప్రారంభమైందని బంధువులు చెప్పారు. ఐతే డాక్టర్లు ఈ ఆరోపణలను ఖండించారు.