
- సుప్రీం కోర్టుకు స్పష్టం చేసిన కేంద్రం
న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలకు జారీచేసే ఎలక్టోరల్ బాండ్ల స్కీం పూర్తిగా పారదర్శకమైదని సుప్రీం కోర్టుకు కేంద్రం వెల్లడించింది. ఆ స్కీం ద్వారా లెక్కాపత్రంలేని డబ్బు పొందే అవకాశమేలేదని తేల్చిచెప్పింది. రాజకీయ పార్టీలు అందుకునే విరాళాలలో పారదర్శకత తీసుకొచ్చేందుకు ఎలక్టోరల్ బాండ్లను జారీచేసే ప్రక్రియ అందుబాటులోకి తెచ్చామని పేర్కొంది. ఈ బాండ్ల వల్ల ప్రజాస్వామ్యంపై ప్రభావం పడుతుందన్న ఆరోపణల్లో వాస్తవం లేదని కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. రాజకీయ పార్టీలకు ఆ బాండ్లు ఎలా జారీ అవుతున్నాయో త్వరలోనే వివరిస్తామని జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన బెంచ్‌కు ఆయన చెప్పారు.
పొలిటికల్ పార్టీలకు ఆ బాండ్ల ద్వారా ఫండింగ్ చేయడంపై ఎన్జీవో అసోసియేషన్ ఫర్ డిమోక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్), సీపీఎం వేసిన పిల్స్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఎలక్టోరల్ బాండ్ల ఇష్యూ ప్రజాస్వామ్యంపై ప్రభావంచూపే సమస్య అని, ప్రతి అసెంబ్లీ ఎన్నికల ముందు వాటిని జారీచేస్తున్నారని ఏడీఆర్ తరఫున అడ్వొకేట్ ప్రశాంత్ భూషణ్ వాదించారు. ఈ విషయంపై వెంటనే విచారణ జరపాలని ఆయన కోరారు. ఈ విషయంపై మరింత పెద్ద బెంచ్ విచారణ చేయాలని మరో పిటిషనర్ తరపున అడ్వొకేట్ కపిల్ సిబల్ అన్నారు. రాజకీయ పార్టీలకు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా నిధులు అందజేయడాన్ని చట్టం అనుమతిస్తుందని, ఈ విషయంలో దాఖలైన పిల్స్ ను పెద్ద బెంచ్ కు రెఫర్ చేయాలా వద్దా అనే విషయంపై డిసెంబర్ 6న విచారణ చేస్తామని బెంచ్ వెల్లడించింది. ఎలక్టోరల్ బాండ్ల అంశం చాలా ముఖ్యమని, దీనిపై అర్జంట్ గా విచారణ చేపట్టాలని ఏడీఆర్ తరఫున ప్రశాంత్ భూషణ్ ఈ ఏడాది ఏప్రిల్ 5న అప్పటి చీఫ్‌జస్టిస్ ఎన్వీ రమణ ముందు ప్రస్తావించారు. ఏడీఆర్ పిల్ ను విచారణకు స్వీకరించేందుకు అప్పుడు సుప్రీంకోర్టు అంగీకరించింది. కానీ ఆ అంశం విచారణకు రాలేదు.