మణిపుర్ ఘటన దేశానికే తలవంపులు.. అల్లరి మూకలకు అడ్డుకట్ట వేయాల్సిందే

మణిపుర్ ఘటన దేశానికే తలవంపులు.. అల్లరి మూకలకు అడ్డుకట్ట వేయాల్సిందే
  • అణచివేయడానికే లైంగిక దాడులు
  • మణిపుర్ ఘటనపై సుప్రీం కోర్టు
  • అల్లరి మూకలకు అడ్డుకట్ట వేయాలన్న న్యాయస్థానం
  • మణిపుర్ ఘటన దేశాన్ని తల దించుకునేలా చేసింది
  • చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆవేదన

ఢిల్లీ : దేశ ప్రజలు తలవంచుకునేలా చేసిన మణిపుర్ ఘటనలపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.  ఒక వర్గాన్ని అణచివేసేందుకు మరో వర్గంలోని అల్లరి మూకలు ఇలాంటి లైంగిక దాడులకు పాల్పడ్డాయని .. తద్వారా తాము చెప్పదలుచుకున్న సందేశాన్ని ప్రత్యర్థులకు నేరుగా చేరాలని ఇలాంటి పనులకు పాల్పడుతున్నారని సుప్రీం కోర్టు పేర్కొంది. వ్యక్తిగత స్వేచ్ఛ, పరిహారం చెల్లింపు, పునరావాసం, మే4 న ఆ రాష్ట్రంలోని కొందరు మహిళలపై జరిగిన లైంగిక దాడులు ..మణిపూర్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు తదితర అంశాలపై విచారించాలని ముగ్గురు మాజీ న్యాయమూర్తులతో కూడిన కమిటీని ఆదేశించింది.
 
చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ మాట్లాడుతూ.. 'మహిళలపై లైంగిక దాడులు, హింస సహించదగినవి కాదు. ఇవి రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ, గౌరవం, స్వతంత్రతను దెబ్బతిస్తాయి' అని అన్నారు.  నిందితులు గుంపులో ఉండటం వల్ల శిక్ష నుంచి తాము తప్పించుకోవచ్చని భావిస్తారని మణిపుర్ లో దారుణ ఘటన తీవ్రత పెరగడానికి ఇది కూడా ఒక కారణం అయి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.  తమ వర్గం బలాన్ని చాటి చెప్పేందుకు ఇలాంటి ఘోరాలకు పాల్పడి మహిళల జీవితాలను విచ్ఛిన్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వాటిని నివారించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్ధివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా స్పష్టం చేశారు. మహిళల భద్రత విషయంలో రాజీ పడవద్దని ఆదేశించారు. ఈ తీర్పు కాపీ ఆగస్టు 7న రాత్రి అందుబాటులోకి వచ్చింది. 

నిందితులను త్వరగా గుర్తించాలి..

ఘటన జరిగి ఇన్ని రోజులవుతున్నా నిందితులను పోలీసులు పట్టుకోలేకపోవడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. వారిని త్వరగా గుర్తించి అరెస్ట్ చేయడం చాలా ముఖ్యమని వ్యాఖ్యానించింది. లేట్ అయితే సాక్ష్యాలు తారుమారు చేయడం, సాక్షులను బెదిరించడం, తప్పించుకుని పారిపోవడం లాంటివి జరుగుతాయని.. దీంతో బాధిత కుటుంబాలకు న్యాయం చేసే అవకాశం లేకుండా పోతుందని చెప్పింది. 

వర్గ పోరుతో ఆస్తి నష్టం

ఘర్షణలతో ప్రాణ నష్టమే కాకుండా, ఆస్తి నష్టం కూడా జరుగుతుందని సుప్రీం కోర్టు తెలిపింది. ఇలాంటివి మళ్లీ జరగకూడదనే ఇందులో జోక్యం చేసుకుంటున్నట్లు స్పష్టం చేసింది. మణిపూర్ లో   వ్యక్తిగత స్వేచ్ఛ, పరిహారం చెల్లింపు, పునరావాసం, లైంగిక దాడులు ప్రభుత్వం తీసుకున్న చర్యలు తదితర అంశాలపై విచారించాలని ముగ్గురు మాజీ న్యాయమూర్తులతో కూడిన కమిటీ వేసిన విషయం విదితమే. జమ్మూ కశ్మీర్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గీతామిట్టల్ ఈ కమిటీకి నేతృత్వం వహిస్తుండగా.. బాంబే హైకోర్టు మాజీ జడ్జీ జస్టీస్ శాలినీ పీ జోషీ, దిల్లీ హైకోర్టు మాజీ జడ్జీ జస్టిస్ ఆశా మీనన్ మెంబర్స్ గా ఉన్నారు. ఈ కమిటీ పలు అంశాలపై సుప్రీం బెంచ్ కి నివేదిక సమర్పించనుంది.  మహారాష్ట్ర డీజీపీ దత్తాత్రేయ పద్సల్గికర్ కు సీబీఐ చేస్తున్న విచారణపై నిఘా ఉంచాలని సుప్రీంకోర్టు సూచించింది. మణిపుర్ అల్లర్లకు ప్రత్యక్షంగా, పరోక్షంగా కారణమయ్యారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి వివరాలను కోర్టుకు సమర్పించాలని డీజీపీని ఆదేశించింది. 

మణిపుర్ అల్లర్లకు కారణమిదే..

ఎస్టీ రిజర్వేషన్ల విషయమై మైతేయి, కుకీ అనే రెండు జాతుల మధ్య ఏర్పడిన ఘర్షణ చినికిచినికి గాలివానలా మారింది. ఈ ఘర్షణల్లో రెండు జాతుల మహిళలు, ఎందరో అమాయకులు బలయ్యారు. దాదాపు 160 మంది మరణించారు. మే 4న ఇద్దరు స్త్రీలను కొందరు నగ్నంగా ఊరేగిస్తూ, వారిపై అసభ్యకరంగా లైంగిక దాడికి పాల్పడ్డారు.  వారిపై ఓ గుంపు సామూహిక అత్యాచారానికి పాల్పడింది. ఇందుకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఘటన యావత్తు దేశాన్ని కదిలించింది. పార్లమెంటు సమావేశాల్లో అధికార ఎన్డీయే, ప్రతిపక్ష ఇండియా కూటముల మధ్య మాటల మంటలు రాజేసింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.