ఓబుళాపురం మైనింగ్ కేసులో..ఐఏఎస్ శ్రీ లక్ష్మీ పాత్రపై మరోసారి విచారణ జరపండి: హైకోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశం

ఓబుళాపురం మైనింగ్ కేసులో..ఐఏఎస్ శ్రీ లక్ష్మీ పాత్రపై మరోసారి విచారణ జరపండి: హైకోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశం
  • హైకోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశం

న్యూఢిల్లీ, వెలుగు: ఓబుళాపురం మైనింగ్ కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మి పాత్రపై మరోసారి సమగ్ర విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. మూడు నెలల్లో విచారణ జరిపి, శ్రీలక్ష్మి పాత్ర ఉందా? లేదా? అనే అంశాన్ని తేల్చాలని హైకోర్టును ఆదేశించింది. కర్నాటక- ఏపీ సరిహద్దుల్లోని బళ్లారి, అనంతపురం జిల్లాల పరిధిలో అక్రమంగా ఇనుప ఖనిజం తవ్వకాలు జరుపుతున్నారంటూ ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ)పై అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి.

దీంతో సమగ్ర విచారణ జరిపించాలని 2009లో ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ బాధ్యతలను కేంద్రం సీబీఐకి అప్పగించింది. గనుల తవ్వకాల్లో ఆ సంస్థ అక్రమాలు చేస్తోందంటూ సీబీఐ నమోదు చేసిన కేసులో.. బీవీ శ్రీనివాస రెడ్డి , గాలి జనార్దన రెడ్డి, వీడీ రాజగోపాల్, లింగారెడ్డి , వై.శ్రీలక్ష్మి, మెఫజ్ అలీ ఖాన్, కృపానందం, సబితా ఇంద్రారెడ్డిని నిందితులుగా చేర్చింది. ఇందులో లింగారెడ్డి మరణించగా, ఏ6గా ఉన్న శ్రీలక్ష్మిపై నమోదైన కేసును 2022లో హైకోర్టు కొట్టేసింది. శ్రీలక్ష్మిని నిర్దోషిగా తేల్చడంపై 2023 ఆగస్టు 3న ఏపీ సర్కార్ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.

ఆ పిటిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై బుధవారం జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ రాజేశ్ బిందాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల బెంచ్ విచారణ జరిపింది. ఈ సందర్భంగా సీబీఐ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఓబుళాపురం మైనింగ్ కేసులో శ్రీలక్ష్మి కీలకపాత్ర పోషించారని ఆరోపించారు. ప్రతివాదుల వాదనలను పరిగణనలోకి తీసుకోకుండా హైకోర్టు తీర్పు ఇచ్చిందని చెప్పారు. ఇదే కేసులో మిగిలిన వారిని దోషులుగా తేల్చుతూ, తాజాగా న్యాయస్థానం శిక్షను ఖరారు చేసిన విషయాన్ని బెంచ్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకొన్న ధర్మాసనం.. శ్రీలక్ష్మి పాత్రపై మరోసారి విచారణ చేపట్టాలని హైకోర్టుకు సూచించింది.