ఫిరాయింపుల కేసులో.. స్పీకర్ కు ఇదే చివరి అవకాశం..నాలుగు వారాల్లో అనర్హత పిటిషన్లను తేల్చాలి: సుప్రీంకోర్టు

ఫిరాయింపుల కేసులో.. స్పీకర్ కు ఇదే చివరి అవకాశం..నాలుగు వారాల్లో అనర్హత పిటిషన్లను తేల్చాలి: సుప్రీంకోర్టు
  • తీసుకున్న చర్యలపై రెండు వారాల్లో అఫిడవిట్ ఇవ్వాలి
  • స్పీకర్ కార్యాలయానికి ఆదేశాలు
  • విచారణ 2 వారాలకు వాయిదా

న్యూఢిల్లీ, వెలుగు:  పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల అంశంలో అసెంబ్లీ స్పీకర్ నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. స్పీకర్​కు ఇదే చివరి అవకాశమని తేల్చి చెప్పింది. అనంతరం స్పీకర్ తీసుకున్న చర్యలపై రెండు వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని పేర్కొంటూ విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. అఫిడవిట్ ను పరిశీలించి.. తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది. 

బీఆర్ఎస్ కారు గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావ్, కడియం శ్రీహరి పార్టీ ఫిరాయించారని పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద సుప్రీంకోర్టులో గతేడాది జనవరి 15న స్పెషల్ లీవ్ పిటిషన్(సివిల్) దాఖలు చేశారు. అదేరోజు  ఎమ్మెల్యేలు పరిగి శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాలె యాదయ్య, టీ ప్రకాశ్ గౌడ్, అరికెపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, ఎం సంజయ్ కుమార్ పార్టీలు ఫిరాయించారని కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద, జగదీశ్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, చింత ప్రభాకర్, కల్వకుంట్ల సంజయ్ సుప్రీంలో రిట్ పిటిషన్(సివిల్) వేశారు. ఆ తర్వాత వాదనలు జరుగుతుండగానే మార్చి 18న బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్పెషల్ లీవ్ పిటిషన్(సివిల్) దాఖలు చేశారు. దానం నాగేందర్ ను ప్రతివాదిగా చేర్చారు.

ఈ అన్నీ పిటిషన్లపై గతంలో సీజేఐ ధర్మాసనం విచారణ జరిపి గత జులై 31 వరకు ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయాన్ని ఆదేశించారు. అయితే, ఈ మూడు నెలల కాలం ముగిశాక మరింత సమయం కావాలని స్పీకర్ కార్యాలయం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇదే సందర్భంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ పై కోర్టు ధిక్కార పిటిషన్ తో పాటు, మరో పిటిషన్ దాఖలు చేశారు. పాడి కౌశిక్ రెడ్డి, ఇతరులు మిస్ లీనియస్ అప్లికేషన్లు వేశారు. ఈ పిటిషన్లపై శుక్రవారం జస్టిస్‌‌‌‌ సంజయ్‌‌‌‌ కరోల్‌‌‌‌, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్ బెంచ్ విచారించింది.  పిటిషనర్లు కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి, ఇతరుల తరఫున సీనియర్ అడ్వకేట్ దామా శేషాద్రి, ఏఓఆర్ మోహిత్ రావు, స్పీకర్ కార్యాలయం తరఫు సీనియర్ అడ్వకేట్లు అభిషేక్ మను సింఘ్వీ, ముకుల్ రోహిత్గి, ఇతరుల తరఫున నిరంజన్ రెడ్డి హాజరయ్యారు. 

మరింత గడువు ఇవ్వండి: స్పీకర్ అడ్వకేట్  

తొలుత స్పీకర్‌‌‌‌ తరఫున సింఘ్వీ వాదిస్తూ..మొత్తం10 అనర్హత పిటిషన్లలో ఏడింటిని స్పీకర్‌‌‌‌ పరిష్కరించారని కోర్టుకు నివేదించారు. ఎనిమిదో పిటిషన్ విచారణ ముగిసిందని తీర్పు రిజర్వ్‌‌‌‌లో ఉందన్నారు. అలాగే మిగిలిన రెండు పిటిషన్ల పరిష్కారానికి మరో 8 వారాల గడువు కావాలని కోరారు. కౌంటర్‌‌‌‌, రిజాయిండర్‌‌‌‌ దాఖలు చేయడానికి, రికార్డులను పరిశీలంచడానికి 4 నుంచి 6 వారాల సమయం కావాలని అభ్యర్థించారు. ఈ అభ్యర్థనను బెంచ్ తోసిపుచ్చింది. 6 వారాల టైం ఇవ్వలేమని... రెండు వారాల్లో తుది నిర్ణయం తీసుకోవాలన్నారు.  

కోర్టు గౌరవానికి భంగం: దామా శేషాద్రి

స్పీకర్ తరఫు వాదనలపై పిటిషనర్ల తరఫున దామా శేషాద్రి నాయుడు అభ్యంతరం తెలిపారు. కోర్టు ఆదేశాలకు స్పీకర్‌‌‌‌ ఏమాత్రం విలువివ్వడం లేదన్నారు. విచారణలో జాప్యం కోసం ప్రతిసారీ వాయిదాలు కోరుతున్నారని అన్నారు. ‘‘అనర్హత పిటిషన్ ఎదుర్కొంటున్న ఒక ఎమ్మెల్యే బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ టికెట్‌‌‌‌పై గెలిచి అధికార పార్టీలో చేరి.. ఆ పార్టీ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. కానీ, ఇప్పటికీ ఆయన బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నారు. ఆ ఎమ్మెల్యేను బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌కు చెందినవాడినని చెప్పుకుంటున్నారు. ఇది ఓపెన్ అండ్‌‌‌‌ షట్‌‌‌‌ కేసు. 

దీన్ని స్పీకర్‌‌‌‌ ఇప్పటివరకు ముట్టుకోలేదు. మళ్లీ 4 వారాలు, 8 వారాలు గడువు కావాలంటే ఎలా?’’ అని వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు విన్న బెంచ్.. స్పీకర్ తీరుపై అసహనం వ్యక్తం చేసింది. గతంలోనే సమయం ఇచ్చామని.. అయినా ఎందుకు వినియోగించుకోలేదని జస్టిస్ మసీమ్ అని ప్రశ్నించారు. ఇదే చివరి అవకాశమని, రెండు వారాల్లో అనర్హత పిటిషన్లపై పురోగతిని వివరిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని విచారణను రెండు వారారాలకు వాయిదా వేశారు. కాగా.. ఈ పిటిషన్లపై ఫిబ్రవరి 6న మరోసారి సుప్రీంకోర్టు విచారణ చేపట్టే అవకాశం ఉంది.