ఎలక్షన్ కమిషనర్ నియామకంలో అంత స్పీడెందుకు?

ఎలక్షన్ కమిషనర్ నియామకంలో అంత స్పీడెందుకు?
  • కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు
  •     24 గంటల్లోనే ఎట్ల ఆమోదిస్తరు?
  •     అరుణ్​ గోయల్ నియామకపు ఒరిజినల్ ఫైల్‌‌ను పరిశీలించిన బెంచ్
  •     తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటన
  •     5 రోజుల్లో అభిప్రాయాలు చెప్పాలని పిటిషనర్లకు, సర్కార్​కు ఆదేశం
  •     విచారణ సందర్భంగా ప్రశాంత్ భూషణ్‌‌పై అటార్నీ జనరల్ ఆగ్రహం!

న్యూఢిల్లీ: ఎలక్షన్ కమిషనర్‌‌‌‌గా అరుణ్ గోయల్ నియామకం విషయంలో అంత తొందరెందుకని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. గోయల్‌‌ అపాయింట్‌‌మెంట్‌‌కు సంబంధించిన ఫైలు.. ఆయా డిపార్ట్‌‌మెంట్లలో కనీసం 24 గంటల సేపు కూడా లేదని, మెరుపు వేగంతో ఎలా ఆమోదించారని ప్రశ్నించింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఎన్నికల కమిషనర్ల నియామకానికి కొలీజియం లాంటి వ్యవస్థ ఉండాలంటూ సుప్రీంకోర్టులో దాఖలైన పలు పిటిషన్లపై జస్టిస్ కేఎం జోసెఫ్‌‌ ఆధ్వర్యంలో జస్టిస్ అజయ్ రస్తోగీ, జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ హృషికేశ్ రాయ్, జస్టిస్ సీటీ రవికుమార్‌‌‌‌ల రాజ్యాంగ ధర్మాసనం గురువారం విచారణ కొనసాగించింది. వాదనల తర్వాత తన తీర్పును రిజర్వ్ చేసింది. ఐదు రోజుల్లో రాతపూర్వకంగా అభిప్రాయాలను తమకు సమర్పించాలని కక్షిదారుల(పార్టీలు)ను కోరింది.

ఒక్క రోజులోనే పూర్తి చేస్తరా?

విచారణ సందర్భంగా అటార్నీ జనరల్ వెంకటరమణిని ఉద్దేశించి జస్టిస్ అజయ్ రస్తోగీ మాట్లాడుతూ.. ‘‘మీరు కోర్టు చెప్పింది జాగ్రత్తగా వినాలి. అడిగే ప్రశ్నలను జవాబు చెప్పాలి. మనం వ్యవస్థలో భాగం’’ అని సూచించారు. దీంతో తాను కోర్టు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి కట్టుబడి ఉన్నానని ఏజీ చెప్పారు. ‘‘1985 బ్యాచ్‌‌కి చెందిన ఐఏఎస్ ఆఫీసర్‌‌ వీఆర్‌‌‌‌ఎస్‌‌కు దరఖాస్తు చేసుకున్న ఒక్క రోజులోనే క్లియరెన్స్‌‌ వచ్చింది. ఆయన ఫైల్‌‌ను లా మినిస్ట్రీ ఒక్కరోజులోనే క్లియర్ చేసింది. ప్రధాని ఎదుట నలుగురి పేర్లను ఉంచారు. కానీ గోయల్‌‌ పేరును 24 గంటల్లోనే రాష్ట్రపతి ఆమోదించారు” అని సుప్రీం కామెంట్ చేసింది. ప్యానెల్‌‌లోని నలుగురి పేర్లలో ఏ ఒక్కరినీ న్యాయ మంత్రి జాగ్రత్తగా ఎంపిక చేయలేదని చెప్పింది. బదులిచ్చిన వెంకటరమణి.. ‘‘ఈసీల సెలక్షన్‌‌కు ఒక యంత్రాంగం, కొన్ని ప్రమాణాలు ఉంటాయి. అంతేతప్ప ప్రభుత్వం ప్రతి అధికారి ట్రాక్‌‌ రికార్డును పరిశీలించదు. ఆరేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసేలా చూసే పరిస్థితి కూడా ఉండదు’’ అని స్పష్టం చేశారు. ఇక గోయల్ నియామకానికి వస్తే.. ఆయన ప్రొఫైల్ ముఖ్యమని, స్వచ్ఛంద పదవీవిరమణ అనేది పెద్ద విషయం కాదని అన్నారు. దీంతో స్పందించిన బెంచ్..‘‘ఎలక్షన్ కమిషనర్ పదవీకాలం ఆరేండ్లని, ఆ పదవిలో ఉన్న వ్యక్తి నిర్ణీత పదవీకాలం పూర్తి చేసుకునేలా కేంద్రం చూసుకోవాలని ఎలక్షన్ కమిషన్ యాక్ట్–1991 చెప్తున్నది. కానీ పూర్తి పదవీకాలం ఉండలేని నలుగురి పేర్లను న్యాయ శాఖ ఎలా ఎంపిక చేసిందనేది మాకు అర్థం కాలేదు” అని కామెంట్ చేసింది. వాదనలు విన్న తర్వాత తీర్పును రిజర్వ్ చేసింది.

నిర్ణయాలన్నీ ఇట్లనే తీసుకుంటున్నరు: కాంగ్రెస్

ప్రధాని నరేంద్ర మోడీ చేపట్టే నియామకాలు, తీసుకునే నిర్ణయాలన్నీ ఇలానే.. సంప్రదాయానికి, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంటున్నాయని, సంప్రదింపులు జరపట్లేదని కాంగ్రెస్ ఆరోపించింది. ‘‘ఎలక్షన్ కమిషనర్ నియామకం విషయంలో తొందర పడ్డరని సుప్రీంకోర్టే చెప్పింది.  కేంద్రం ఇలా చేయడం కొత్తేమీ కాదు” అని ఏఐసీసీ మీడియా ఇన్‌‌చార్జ్ పవన్​ ఖేరా ట్వీట్ చేశారు.

ఇదేం ఎవాల్యుయేషన్

ముందుగా ఈసీగా గోయల్ నియామకానికి సంబంధించిన ఒరిజినల్ ఫైల్‌‌ను కేంద్రం నుంచి తెప్పించుకుని సుప్రీం పరిశీలించింది. ‘‘ఇదేం ఎవాల్యుయేషన్? మేం అరుణ్‌‌ గోయల్ మెరిట్స్‌‌ను ప్రశ్నించడం లేదు.. నియామక ప్రాసెస్‌‌ గురించి మాత్రమే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాం” అని బెంచ్ అసహనం వ్యక్తం చేసింది. దీంతో కేంద్రం నిర్ణయాన్ని సమర్థించిన అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి.. అపాయింట్‌‌మెంట్ గురించిన పూర్తి ప్రక్రియను పరిశీలించకుండా ఒక అభిప్రాయానికి రావద్దని ధర్మాసనాన్ని కోరారు. ఏజీ వాదనలు వినిపిస్తున్న సమయంలో లాయర్ ప్రశాంత్ భూషణ్ జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించారు. సీరియస్‌‌గా స్పందించిన అటార్నీ జనరల్.. ‘‘దయచేసి కొద్దిసేపు మీరు నోరుమూసుకుని ఉండండి” అని అన్నారు.