కవితకు నో బెయిల్.. ట్రయల్ కోర్టుకు వెళ్లాలని చెప్పిన సుప్రీంకోర్టు

కవితకు నో బెయిల్.. ట్రయల్ కోర్టుకు వెళ్లాలని చెప్పిన సుప్రీంకోర్టు
 
  • ఆరువారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఈడీకి ఆదేశం

న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కామ్​ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. కవిత రాజకీయ వ్యక్తి అయినందున ఆమె పిటిషన్‌‌ను నేరుగా స్వీకరించలేమని, బెయిల్​ ఇవ్వలేమని స్పష్టం చేసింది. ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని  తేల్చిచెప్పింది. లిక్కర్ స్కామ్​ కేసులో ఈడీ తనను అరెస్ట్​ చేయడాన్ని, కస్టడీలోకి తీసుకోవడాన్ని సవాల్ చేస్తూ కవిత సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్​ వేశారు. సోదాల పేరుతో ఈడీ అధికారులు తనను అక్రమంగా అరెస్ట్ చేశారని, సీబీఐ స్పెషల్​ కోర్టు తనను కస్టడీకి అప్పగించడం రాజ్యాంగ విరుద్దమని పేర్కొంటూ 537 పేజీల పిటిషన్​ను ఆమె దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బేలా ఎం. త్రివేది, జస్టిస్  సుందరేశ్​తో కూడిన ధర్మాసనం విచారించింది. 

ఈడీ తీరు కలచివేసింది: కవిత లాయర్లు

కవిత తరఫున సీనియర్ అడ్వకేట్లు కపిల్ సిబల్, విక్రమ్ చౌదరీ వాదనలు కొనసాగించారు. తొలుత సిబల్ వాదనలు ప్రారంభిస్తూ... హైకోర్టుకు వెళ్లాలని మాత్రం సూచించొద్దని కోరారు. కవితకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి స్టేట్​మెంట్ ను అప్రూవర్ల నుంచి ఈడీ సేకరించింది తప్ప, ఒక్క చిన్న ఎవిడెన్స్ కూడా దర్యాప్తు సంస్థ దగ్గర లేదని అన్నారు. నిరుడు సెప్టెంబర్​లో కవితను నిందితురాలిగా ఈడీ పేర్కొనలేదని, కానీ కవిత అరెస్ట్ రిపోర్ట్ లో మాత్రం ఆగస్టులోనే కవితకు వ్యతిరేకంగా పలు ఆధారాలను చూపిందని తెలిపారు. 

మాగుంట శ్రీనివాసులు ఇచ్చిన స్టేట్​మెంట్ ఆధా రంగా ఆమెను నిందితురాలిగా పేర్కొంటున్నారని చె ప్పారు. ఈడీ వ్యవహరించిన తీరు, ప్రస్తుత పరిణామాలు తమను కొంత కలిచివేశాయని అన్నారు. దీనిపై స్పందించిన జస్టిస్ సంజీవ్ ఖన్నా.. ఎమోషనల్ కావొద్దని చెప్పారు. బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు వెళ్లాలని సూచించారు. అయితే జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ విషయంలో ట్రయల్ కోర్టుకు వెళ్తే ఏమీ జరగలేదని సిబల్ వాదనలు కొనసాగించారు. 

మెరిట్స్​లోకి వెళ్లడం లేదు: సుప్రీం

సిబల్​ వాదనలపై మరోసారి స్పందించిన సుప్రీంకోర్టు బెంచ్​.. కవిత రాజకీయ వ్యక్తి అయినందున ఆమె పిటిషన్‌‌‌‌ను నేరుగా స్వీకరించలేమని స్పష్టం చేసింది. ‘‘అన్ని అంశాల్లో ఆర్టికల్ 32 ప్రకారం.. వాళ్లు బెయిల్ కోరితే, అన్ని విషయాల్లో మీరు మెరిట్లపై వాదించలేరు. మేము ఏకరీతిగా వ్యవహరించాల్సి ఉంటుంది. రాజ్యాంగ సవాలుకు సంబంధించిన ప్రధాన పిటిషన్‌‌‌‌లో నోటీసు జారీ చేసి, తర్వాత వాటిపై విచారణ చేపడ్తం’’ అని బెంచ్​ తేల్చిచెప్పింది. 

కవిత పిటిషన్ విషయంలో మెరిట్స్​లోకి వెళ్లడం లేదని స్పష్టం చేసింది. ఇందులో తాము బెయిల్ ఇవ్వలేమని, ట్రయ ల్ కోర్టుకు వెళ్లక తప్పదని పేర్కొంది. త్వరితగతిన కేసు విచారణ చేపట్టాలని సీబీఐ స్పెషల్ కోర్టుకు సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది. అలాగే ఈ పిటిషన్​లో రాజ్యాంగ ఉల్లంఘనకు సంబంధించిన అంశాలను పొందుపరిచినందున, విజయ్ మదన్ లాల్ కేసుతో అటాచ్ చేస్తున్నట్లు తెలిపింది. మధ్యలో కవిత తరఫు మరో అడ్వకేట్ విక్రమ్ చౌదరి వాదిస్తూ.. కవిత దాఖ లు చేసిన గత పిటిషన్ అంశాలను ప్రస్తావించారు. విచారణ సందర్బంగా కవితను అరెస్ట్ చేయబోమని అప్పట్లో ఈడీ చెప్పిందని, అయితే అందుకు భిన్నంగా ఈడీ ఆఫీసర్ల వ్యవహరించారన్నారు. 

ఈ వాదనలపై జస్టిస్ బేలా ఎం. త్రివేది స్పందిస్తూ.. కవిత వేసిన గత పిటిషన్​పై ఎలాంటి తాత్కాలిక ఉపశమనం లేదని చెప్పారు. తర్వాత 4,5 సార్లు విచారణ వాయిదా పడిం దని గుర్తు చేశారు. అప్పుడు  ఎలాంటి అభ్యంతరాలను లేవనెత్తలేదని, దీంతో ఈడీ ఇచ్చిన స్టేట్​మెంట్​లో ఇంటర్ లింకింగ్ ఏర్పడిందన్నారు. ఈ నెల 19 న ఈ కేసు చివరిసారి విచారణకు వచ్చినప్పుడూ ఎలాంటి అభ్యంతరాలు చెప్పకుండా, పిటిషన్ ఉపసంహరించుకున్నారని గుర్తుచేశారు. కాగా, కవిత తాజా పిటిషన్ లో లేవనెత్తిన రాజ్యాంగపర అంశాలను పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ధర్మాసనం.. ఈడీకి నోటీసులు జారీ చేసింది. ఆరు వారాల్లో కవిత పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈడీ సమాధానంపై రిజాయిండర్ దాఖలు చేసేందుకు పిటిషనర్ కు మరో ఆరు వారాల టైం ఇస్తున్నట్లు వెల్లడించింది.