లాలూ బెయిల్ పిటిషన్ కొట్టేసిన సుప్రీం

లాలూ బెయిల్ పిటిషన్ కొట్టేసిన సుప్రీం

బిహార్ మాజీ సీఎం, ఆర్జేడీ సుప్రీమ్ లాలూ ప్రసాద్ యాదవ్ బెయిల్ ప్రయత్నాలు ఫలించలేదు. ఆయన బెయిల్ పిటిషన్ ను సుప్రీంకోర్టు ఇవాళ కొట్టివేసింది.

చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ ఆధ్వర్యంలోని బెంచ్ ఇవాళ లాలూ ప్రసాద్ యాదవ్ బెయిల్ పిటిషన్ ను విచారణ చేసింది. ఇప్పటికే రెండేళ్ల జైలు జీవితం అనుభవించారని.. బెయిల్ కు అనుమతించాలని యాదవ్ తరఫు న్యాయవాది కపిల్ సిబల్ కోర్టును కోరారు. ఓ కుట్ర తో ఈ కేసులో యాదవ్ ను ఇరికించారని.. ఇప్పటివరకు రికవరీ గానీ… ఈ విషయంలో డిమాండ్లు గానీ ఏమీ లేవని ఆయన కోర్టుకు చెప్పారు.

ఐతే… అనారోగ్యం నుంచి లాలూ ప్రసాద్ యాదవ్ పూర్తిగా కోలుకున్నారనీ సీబీఐ… కోర్టుకు తెలిపింది. లోక్ సభ ఎన్నికల్లో యాక్టివ్ రోల్ పోషించాలన్నది ఆయన ఉద్దేశమని.. బెయిల్ ను ఇవ్వొద్దని విజ్ఞప్తిచేసింది.

వాదోపవాదాలు విన్న తర్వాత కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కొన్ని వందల కోట్ల రూపాయల గడ్డి స్కామ్ లో 14 ఏళ్ల జైలు శిక్ష పడిన లాలూ ప్రసాద్ యాదవ్.. ఇప్పటివరకు కేవలం 24 నెలల జైలు శిక్షను మాత్రమే అనుభవించారని కోర్టు అభిప్రాయపడింది. అసలు శిక్షతో పోల్చితే ఇప్పటివరకు అనుభవించింది పరిగణలోకి తీసుకునే స్థాయిలో లేదని చెప్పింది ధర్మాసనం.