నారీ శక్తి చట్టంలో ఆ భాగాన్ని కొట్టేయలేం : సుప్రీం

నారీ శక్తి చట్టంలో ఆ భాగాన్ని కొట్టేయలేం : సుప్రీం
  • మహిళా బిల్లును వెంటనే అమలుచేయాలని ఆదేశించలేం: సుప్రీం

న్యూఢిల్లీ: చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ల కోసం కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ‘నారీ శక్తి వందన్ అధినీయం’ చట్టాన్ని వెంటనే అమలు చేయాలంటూ ఆదేశించలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. దేశవ్యాప్తంగా జనాభా లెక్కలు నిర్వహించాక, డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) చేసిన తర్వాతే మహిళా కోటాను అమలు చేయాలంటూ చట్టంలో ఉన్న భాగాన్ని కొట్టివేయడం చాలా కష్టమని స్పష్టం చేసింది.

128వ రాజ్యాంగ సవరణ బిల్లు (నారీ శక్తి వందన్ అధినీయం చట్టం)ను వెంటనే అమలు చేసేలా  ఆదేశాలు ఇవ్వాలంటూ కాంగ్రెస్ నేత జయా ఠాకూర్ దాఖలు చేసిన పిటిషన్ పై శుక్రవారం సుప్రీంకోర్టు జడ్జిలు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టితో కూడిన బెంచ్ విచారించింది. ఈ సందర్భంగా జయా ఠాకూర్ తరఫు అడ్వకేట్ వికాస్ సింగ్ వాదిస్తూ.. బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలంటే జనాభా లెక్కలు చేపట్టాల్సి ఉంటుంది కానీ మహిళల రిజర్వేషన్లు అమలు చేయడానికి జనాభా లెక్కల అవసరం లేదన్నారు.

జనాభా లెక్కల తర్వాతే చట్టాన్ని అమలు చేయాలనడం నిర్హేతుకమని, ఆ భాగాన్ని వెంటనే కొట్టేయాలని కోరారు. దీనిపై బెంచ్ స్పందిస్తూ.. ‘‘మీ వాదనలను అర్థం చేసుకున్నాం. కానీ ఇందులో చాలా సమస్యలు ఉన్నాయి. ముందుగా లోక్ సభ, అసెంబ్లీ సీట్లను రిజర్వ్ చేయాలి. ఇతర అంశాలు కూడా పూర్తిచేయాల్సి ఉంటుంది. అందుకే ఈ విషయంలో కేంద్రానికి నోటీసులు జారీ చేయలేం” అని స్పష్టం చేసింది. అయితే, ఇదే అంశంపై సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ పెండింగ్ లో ఉందని, దానితో కలిపి ఈ పిటిషన్ ను కూడా ఈ నెల 22న విచారిస్తామని బెంచ్ పేర్కొంది.   

ఎన్నికల బరిలో ‘నేరచరితుల బ్యాన్’ పై మీ స్పందనేమిటి?

క్రిమినల్ కేసులు, తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలంటూ దాఖలైన పిటిషన్​పై అభిప్రాయం తెలియజేయాలంటూ కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు మరోసారి నోటీసులు జారీ చేసింది. అడ్వకేట్ అశ్విని ఉపాధ్యాయ్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీం జడ్జిలు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన బెంచ్ శుక్రవారం విచారించింది.

ఈ పిల్ పై కేంద్రానికి, ఎన్నికల సంఘానికి ఇదివరకే నోటీసులు జారీ అయినా.. ఇప్పటివరకూ కేంద్రం సమాధానం ఇవ్వలేదంటూ పిటిషనర్ తరఫు అడ్వకేట్ కోర్టుకు తెలిపారు. కేంద్రం తరఫు అడ్వకేట్ స్పందిస్తూ.. అఫిడవిట్ దాఖలుకు మరింత సమయం కావాలని కోరారు. దీంతో రెండు వారాల్లోగా సమాధానం తెలియజేయాలని ఆదేశించిన కోర్టు విచారణను వాయిదా వేసింది.