పొలాల్లో చెత్తను కాల్చొద్దు: సుప్రీంకోర్టు

పొలాల్లో చెత్తను కాల్చొద్దు: సుప్రీంకోర్టు

    కాలుష్యం వల్ల ప్రజలు జీవితాన్ని కోల్పోతున్నరు

    ఈ పరిస్థితి వల్ల వారు చనిపోకూడదు

    ఢిల్లీలో కాలుష్యంపై సుప్రీంకోర్టు కామెంట్స్

    ఢిల్లీలో నిర్మాణాలు, కూల్చివేతలు ఆపేయండి

    ఎవరైనా ఉల్లంఘిస్తే లక్ష జరిమానా విధించాలని ఆదేశం

 

‘‘ఢిల్లీ, నేషనల్ క్యాపిటల్ రీజియన్(-ఎన్‌‌‌‌‌‌‌‌సీఆర్) ప్రజలు తమ జీవితంలోని విలువైన సంవత్సరాలను కోల్పోతున్నారు. ప్రస్తుతమున్న దారుణమైన కాలుష్య పరిస్థితి వల్ల వారు చనిపోకూడదు” అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. పంట వ్యర్థాలను కాల్చడం ఆపేయాలని ఢిల్లీ పక్క రాష్ట్రాలైన పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్​లను ఆదేశించింది. తాము తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఢిల్లీలో నిర్మాణాలు, కూల్చివేతలు, చెత్తను కాల్చడం వంటి వాటిని ఆపేయాలని స్పష్టం చేసింది. వరి వ్యర్థాలను కాల్చుతుండటంపై పంజాబ్, హర్యానా, యూపీ రాష్ట్రాల సీఎస్​లకు సమన్లు జారీ చేసింది. ‘‘ఇప్పటి నుంచి ఒక్కచోట కూడా పంట వ్యర్థాలను కాల్చకూడదు. ఇందుకు పంజాబ్, హర్యానా, యూపీ రాష్ట్రాల సీఎస్​లు, జిల్లా కలెక్టర్లు, పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకోవాలి” అని ఆదేశించింది. లాంగ్ టర్మ్​లో పరిస్థితిని చక్కదిద్దేందుకు మూడు వారాల్లోగా రోడ్​మ్యాప్ తో రావాలని కేంద్రం, ఢిల్లీ, పంజాబ్, హర్యానా ప్రభుత్వాలకు సూచించింది. సోమవారం ఈ మేరకు ఎన్విరాన్​మెంట్ పొల్యూషన్ కంట్రోల్ అథారిటీ (ఈపీసీఏ) వేసిన పిటిషన్​పై న్యాయమూర్తులు జస్టిస్ అరుణ్ మిశ్రా, దీపక్ గుప్తాల బెంచ్ విచారణ జరిపింది.

అందరూ బాధ్యులే..

‘‘పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో వ్యవసాయ భూముల్లో మంటలను అర్పివేయాలి. అలాకాదని ఒకవేళ అక్క డ పంట వ్యర్థాలను కాల్చితే మాత్రం.. చీఫ్ సెక్రెటరీ నుంచి గ్రామ్ ప్రధాన్ వరకూ అందరూ బాధ్యులే” అని సుప్రీం హెచ్చరించింది. పరస్పరం ఆరోపణలు చేసుకోవడం మాని కాలుష్య నివారణకు పరిష్కారం కనిపెట్టాలంటూ అక్షింతలు వేసింది. జీవించే హక్కు ముఖ్యమైనదని స్పష్టంచేసింది. ‘ఏటా కాలుష్యం వల్ల ఢిల్లీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. కానీ మనం ఏమీ చేయలేకపోతున్నాం. ఏటా15 రోజులు ఈ పరిస్థితి వస్తోంది. నాగరికత గల దేశాల్లో ఇలాంటి పరిస్థితి ఉండకూడదు’అని జస్టిస్ అరుణ్ మిశ్రా పేర్కొన్నారు.

ఏం సాధించారు?

‘‘సరి-బేసి ప్రవేశపెట్టి మీరు ఏం సాధించారు. ట్యాక్సీలు నడపకుండా అడ్డుకుంటున్నారా? సరి-బేసి ప్రవేశపెట్టిన తర్వాత కనిపించిన ప్రభావం ఎంత?” అని ఢిల్లీ ప్రభుత్వాన్ని సుప్రీం నిలదీసింది. 44 శాతం వరి వ్యర్థాలను పంజాబ్​లోని నాలుగు జిల్లాలు కాలుస్తున్నాయని, ఢిల్లీలో నిర్మాణం, కూల్చివేత వల్ల పొల్యూషన్ ఎక్కువగా జరుగుతోందని కోర్టుకు కేంద్రం వివరించింది. దీంతో ఢిల్లీలో నిర్మాణాలు, కూల్చివేతలను తాత్కాలికంగా ఆపాలని బెంచ్ ఆదేశించింది. మున్సిపల్ అథారిటీలు ఈ బాధ్యతలు తీసుకోవాలని, ఎవరైనా ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే రూ.లక్ష జరిమానా విధించాలని సూచించింది. చెత్త కాలిస్తే రూ.5వేల జరిమానా వేయాలని స్పష్టం చేసింది.

ఢిల్లీలో ఒక్క రూమ్ కూడా సేఫ్ కాదు. ఆఖరికి బెడ్​రూమ్​లలో కూడా ఏక్యూఐ 500 నుంచి 600 వరకు ఉంటోంది. ఇలా ఉంటే మనం బతకగలమా? ఈ పరిస్థితి వల్ల ప్రజలు తమ జీవితాన్ని కోల్పోతున్నారు.

– సుప్రీంకోర్టు