- టపాసులను పూర్తిగా నిషేధించలేం..
- అలాగని 24 గంటలూ కాల్చేందుకు అనుమతించబోం: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: దీపావళితోపాటు పండుగలపూట టపాసులు కాల్చకుండా పూర్తిగా నిషేధించలేమని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. బాణాసంచాపై పూర్తి నిషేధం విధిస్తే ప్రజల సాంప్రదాయ మనోభావాలు దెబ్బతింటాయని అభిప్రాయపడింది. అలాగని, పండుగ రోజున 24 గంటలూ టపాసులు కాల్చడానికి కూడా అనుమతించబోమని తేల్చిచెప్పింది. పండుగల సమయంలో బాణాసంచా కాల్చడం వల్ల కాలుష్యం పెరుగుతోందని, దీనిని అరికట్టాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్)పై జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ పీబీ వరాలేలతో కూడిన బెంచ్ బుధవారం విచారణ చేపట్టింది.
కేంద్ర ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్‌జీ) ఐశ్వర్య భాటి వాదనలు వినిపిస్తూ.. సైంటిఫిక్, ఇండస్ట్రియల్ రీసెర్చ్ కౌన్సిల్, ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ సిఫారసు చేసిన ‘నెక్స్ట్ జనరేషన్ జాయిండ్ గ్రీన్ క్రాకర్స్’ వినియోగానికి సడలింపు ఇవ్వాలని కోరారు. లైసెన్స్ పొందిన తయారీదారులు, నిర్దేశిత శబ్ద పరిమితులు, భద్రతా నిబంధనలకు కట్టుబడి ఉండే ఈ టపాసులను అనుమతించవచ్చని పేర్కొంటూ ఓ నివేదికను కోర్టుకు అందజేశారు.
