కుక్క కరిస్తే భారీ పరిహారం రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించాల్సిందే: సుప్రీంకోర్టు

కుక్క కరిస్తే భారీ పరిహారం రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించాల్సిందే: సుప్రీంకోర్టు
  • గత ఐదేండ్లుగా రూల్స్ అమలు చేయట్లేదని ఫైర్
  • కుక్క కాటు కేసులకు డాగ్ లవర్స్, ఫీడర్స్ కూడా బాధ్యులేనని వెల్లడి
  • ప్రజల ప్రాణాలు పోతున్నా కండ్లు మూసుకుని ఉండాలా? అని ఆగ్రహం

న్యూఢిల్లీ: వీధి కుక్కల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడం లేదని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇకపై ప్రతి కుక్క కాటుకు సంబంధించి రాష్ట్రాలు భారీ పరిహారం చెల్లించాల్సిందేనని హెచ్చరించింది. వీధి కుక్కల అంశంపై జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వీ అంజారియాతో కూడిన బెంచ్ మంగళవారం విచారణ కొనసాగించింది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘వీధి కుక్కల నియంత్రణకు సంబంధించిన నిబంధనల అమలుకు గత ఐదేండ్లుగా రాష్ట్రాలు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇకపై ప్రతి కుక్క కాటుకు సంబంధించి పిల్లలు గానీ, పెద్దలు గానీ చనిపోయినా, గాయపడినా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు భారీ పరిహారం చెల్లించేలా ఆదేశాలు ఇస్తాం” అని స్పష్టం చేసింది. కుక్క కాటు కేసులకు డాగ్ ఫీడర్స్, డాగ్ లవర్స్ కూడా బాధ్యులేనని తేల్చి చెప్పింది. ‘‘మీకు వీధి కుక్కలపై అంత ప్రేమ ఉంటే.. వాటిని ఎందుకు మీ ఇంటికి తీసుకెళ్లడం లేదు? అవి ఎందుకు వీధుల్లో తిరుగుతూ ప్రజలను కరుస్తున్నాయి. వీధి కుక్క దాడిలో 9 ఏండ్ల చిన్నారి చనిపోయింది. దీనికి ఎవరిని బాధ్యులను చేయాలి? ఆ కుక్కకు ఆహారం పెట్టిన సంస్థనా? కుక్కల దాడిలో ప్రజల ప్రాణాలు పోతున్నా మౌనంగా ఉండమంటారా? ఇంత జరుగుతున్నా మేం కండ్లు మూసుకుని ఉండాలా?” అని డాగ్ ఫీడర్స్, డాగ్ లవర్స్‌‌‌‌పై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 

విచారణ జరగనివ్వండి.. 

‘‘మేం ఈ అంశంపై నాలుగు రోజులుగా విచారణ జరుపుతున్నాం. కానీ అది ముందుకు కదలడం లేదు. యాక్టివిస్టులు, ఎన్జీవోల లాయర్లు మమ్మల్ని ముందుకు వెళ్లనివ్వడం లేదు. మేం మీకు విజ్ఞప్తి చేస్తున్నాం.. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర సంస్థల వాదనను విననివ్వండి. వీధి కుక్కల నియంత్రణకు వాళ్ల దగ్గర ఏదైనా ప్రణాళిక ఉందో తెలుసుకోనివ్వండి. ఇందుకు మాకు సగం రోజు కావాలి. ఈ సమస్య ఇప్పటికే వెయ్యి రెట్లు పెరిగిపోయింది. మేం చట్టబద్ధమైన నిబంధనల అమలునే కోరుకుంటున్నాం. మా పని మమ్మల్ని చేసుకోనివ్వండి. ఈ అంశంలో ఆర్డర్ ఇవ్వనివ్వండి” అని బెంచ్ కోరింది.