పోస్టుమార్టం చేశాక కేసు పెడ్తరా?

పోస్టుమార్టం చేశాక  కేసు పెడ్తరా?
  • కోల్​కతా పోలీసులపై సుప్రీంకోర్టు ఆగ్రహం 
  • బాడీని గుర్తించిన 14 గంటలకు ఫిర్యాదు చేస్తరా? 
  • అప్పటిదాకా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ ఏం చేశారు?
  • ఎవరితో టచ్​లో ఉన్నారు? ఎందుకు ఆలస్యం చేశారు?
  • డాక్టర్ రేప్ అండ్ మర్డర్ కేసులో సుప్రీంకోర్టు ప్రశ్నల వర్షం 
  • గత 30 ఏండ్లలో ఇలాంటి కేసు చూడలేదని కామెంట్  
  • క్రైమ్ సీన్ మార్చేశారని కోర్టుకు సీబీఐ వెల్లడి

న్యూఢిల్లీ: కోల్ కతా డాక్టర్ రేప్ అండ్ మర్డర్ కేసులో పోలీసులు తీవ్ర నిర్లక్ష్యం చేశారని సుప్రీంకోర్టు మండిపడింది. కేసు నమోదు విషయంలో ఆలస్యం చేశారని ఫైర్ అయింది. ఇది తీవ్ర ఆందోళనకరమని, గత 30 ఏండ్లలో ఇలాంటి కేసును చూడలేదని వ్యాఖ్యానించింది. బెంగాల్ ప్రభుత్వం క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ను ఫాలో కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది.

కోల్ కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ, హాస్పిటల్ లో అత్యాచారం, హత్యకు గురైన జూనియర్ డాక్టర్ కేసును సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. దీనిపై చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన బెంచ్ గురువారం మరోసారి విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ.. కోర్టుకు స్టేటస్ రిపోర్టు అందజేసింది. బాధితురాలికి పోస్టుమార్టం, అంత్యక్రియలు పూర్తి చేసిన తర్వాతే కేసు నమోదు చేశారని అందులో పేర్కొంది.

ఆ రిపోర్టును పరిశీలించిన బెంచ్ కీలక కామెంట్లు చేసింది. బెంగాల్ ప్రభుత్వం, పోలీసులు, ఆర్జీ కర్ హాస్పిటల్ అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించింది. ‘‘ఆస్పత్రిలో బాడీ దొరికిన 14 గంటల తర్వాత కంప్లయింట్ ఇచ్చారు. అప్పటి వరకు ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ ఏం చేశారు? అతను ఎవరితో టచ్ లో ఉన్నారు? ఆయనెందుకు ఫిర్యాదు చేయడంలో ఇంత ఆలస్యం చేశారు? దానికి కారణమేంటి?” అని కోర్టు ప్రశ్నించింది. ‘‘అసహజ మరణం అని కేసు నమోదు చేయడానికి ముందే పోస్టుమార్టం నిర్వహించడం ఆశ్చర్యంగా ఉంది.

ఈ నెల 9న సాయంత్రం 6:10 గంటల​నుంచి 7:10 గంటల మధ్య పోస్టుమార్టం నిర్వహించారు. కానీ రాత్రి 11:30 గంటలకు బాధితురాలిది అసహజ మరణమని పోలీసులకు సమాచారం ఇచ్చారు. అసలు ఎఫ్ఐఆర్ ఏ టైమ్ కు నమోదు చేశారు? దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీస్ ఆఫీసర్ తదుపరి విచారణకు హాజరు కావాలి” అని ఆదేశించింది. ఈ టైమ్ లో సీబీఐ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ.. బాధితురాలి అంత్యక్రియలు పూర్తి చేసిన తర్వాత రాత్రి 11:45 గంటలకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని కోర్టుకు తెలిపారు.  కాగా, ఈ కేసులో ఆర్జీ కర్ మెడికల్​కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సందీప్ ఘోష్ తో పాటు మరో నలుగురు డాక్టర్లకు సీబీఐ పాలీగ్రాఫ్ టెస్టు చేసేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. 

డాక్టర్లు విధుల్లో చేరాలి.. 

నిరసనలు తెలుపుతున్న డాక్టర్లు తిరిగి విధుల్లో చేరాలని సుప్రీంకోర్టు సూచించింది. డాక్టర్లు డ్యూటీ చేయకపోతే ప్రజలకు వైద్యం ఎలా అందుతుందని ప్రశ్నించింది. డాక్టర్లు డ్యూటీలో చేరిన తర్వాత వాళ్లపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా చూస్తామని తెలిపింది. ఒకవేళ ఎక్కడైనా అధికారులు అలా చేస్తే తమను సంప్రదించాలని డాక్టర్లకు సూచించింది. అదే విధంగా శాంతియుతంగా జరుగుతున్న నిరసనలను అడ్డుకోవద్దని బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దేశవ్యాప్తంగా డాక్టర్ల భద్రత కోసం కేంద్రం, రాష్ట్రాలు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ‘‘డాక్టర్ల భద్రత కోసం నేషనల్ టాస్క్ ఫోర్స్ (ఎన్టీఎఫ్) ఏర్పాటు చేశాం. డాక్టర్ల సేఫ్టీకి ప్రొటోకాల్ రూపొందించేందుకు ఎన్టీఎఫ్ సలహాలు, సూచనలు స్వీకరిస్తుంది.

ఇందుకోసం కేంద్ర ఆరోగ్య శాఖ ప్రత్యేక పోర్టల్ ను అందుబాటులోకి తీసుకురావాలి” అని ఆదేశించింది. మెడికల్ సిబ్బంది భద్రతపై రాష్ట్రాల సీఎస్ లు, డీజీపీలతో చర్చించాలని కేంద్ర ఆరోగ్య శాఖ సెక్రటరీకి సూచించింది. ఈ ఘటనపై రాజకీయ నేతల కామెంట్లను లాయర్లు ప్రస్తావించగా.. ‘‘దయచేసి దీన్ని రాజకీయం చేయకండి. చట్టం తన పని తాను చేసుకుపోతుంది” అని కోర్టు వ్యాఖ్యానించింది. కాగా, సుప్రీం సూచనతో సమ్మె విరమిస్తున్నట్టు ఢిల్లీ ఎయిమ్స్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రకటించింది. మరోవైపు ఈ కేసును సుమోటోగా తీసుకుని సుప్రీం విచారిస్తుండగా, దీనిపై పిటిషన్ దాఖలు చేయాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) నిర్ణయించింది. 

సందీప్ ఘోష్ పై వేటు.. 

ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్​సందీప్ ఘోష్ పై బెంగాల్ సర్కార్ వేటు వేసింది. ఆయనను ఇంతకుముందు కలకత్తా నేషనల్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ గా ట్రాన్స్ ఫర్ చేశారు. అయితే జూనియర్ డాక్టర్ల డిమాండ్ తో సందీప్ ఘోష్ ను ఆ పదవి నుంచి ప్రభుత్వం తొలగించింది. అలాగే ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలోని మరో ముగ్గురు సీనియర్ అధికారులపై బదిలీ వేటు వేసింది. 

క్రైమ్ సీన్ మార్చేశారు: సీబీఐ 

డాక్టర్ పై రేప్ అండ్ మర్డర్ ను కప్పిపుచ్చడానికి ప్రయత్నించారని, క్రైమ్ సీన్ ను మార్చేశారని కోర్టుకు సీబీఐ తెలిపింది. ఈ కేసుపై సీబీఐ స్టేటస్ రిపోర్టు అందజేయగా, అందులోని అంశాలను సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు వివరించారు. ‘‘బాధితురాలికి ఆరోగ్యం బాలేదని ఆమె తల్లిదండ్రులకు హాస్పిటల్ డిప్యూటీ సూపరింటెండెంట్ మొదట సమాచారం ఇచ్చారు. అయితే వాళ్లు హాస్పిటల్ చేరుకున్న తర్వాత చనిపోయిందని చెప్పారు.

పోస్టుమార్టం చేసేటప్పుడు వీడియో తీయాలని బాధితురాలితో పని చేసినోళ్లు పట్టుబట్టారు. దీన్ని బట్టి ఏదో జరిగిందని, దాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నించారని అర్థమవుతున్నది” అని మెహతా అన్నారు. ‘‘ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని బాధితురాలి తండ్రి కోరినా ఆస్పత్రి అధికారులు పట్టించుకోలేదు. ఆయన పట్టుబట్టడంతో చివరకు పోస్టుమార్టం, అంత్యక్రియలు పూర్తయిన తర్వాత కేసు నమోదు చేశారు. ఇది నేరాన్ని కప్పిపుచ్చేందుకు చేసిన ప్రయత్నమే. ఘటన జరిగిన ఐదు రోజుల తర్వాత సీబీఐకి దర్యాప్తు అప్పగించారు. వాళ్లు వెళ్లేసరికి క్రైమ్ సీన్ లో మొత్తం మార్చేశారు” అని చెప్పారు. 

డాక్టర్ల బాధలు తెలుసు.. 

ఆస్పత్రుల్లో సౌలతులు, పని ఎలా ఉంటుందో తెలుసు. నేనూ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాను. మా కుటుంబసభ్యులకు ఆరోగ్యం బాలేనప్పుడు ఆస్పత్రిలో నేలపైనే పడుకున్నాను. డాక్టర్లకు పని ఒత్తిడి ఉంటుంది. 36 గంటలకు పైగా పని చేస్తుంటారు.

 సీజేఐ జస్టిస్​ డీవై చంద్రచూడ్