బిల్కిస్ బానో కేసు.. దోషులను ఎట్ల రిలీజ్ చేస్తరు?

బిల్కిస్ బానో కేసు.. దోషులను ఎట్ల  రిలీజ్ చేస్తరు?
  • గుజరాత్ సర్కార్ ఆదేశాలను కొట్టేసిన సుప్రీంకోర్టు
  • 11 మంది దోషులు జైల్లో లొంగిపోవాలి.. రెండు వారాల గడువు ఇస్తున్నం
  • దోషుల్లో ఒకరికి గుజరాత్ సర్కార్ సహకరించింది
  • మహారాష్ట్ర అధికారాలను లాగేసుకుంది
  • రెమిషన్ ఆర్డర్ జారీ చేసే అర్హత మహారాష్ట్రకే ఉంది
  • విచారణ అంతా మహారాష్ట్రలో జరిగితే.. గుజరాత్ ఎట్ల రిలీజ్ చేస్తది?
  • రెమిషన్ ఆర్డర్​ను రద్దు చేస్తున్నట్టు వెల్లడి
  • 100 పేజీల తీర్పు వెల్లడించిన జస్టిస్  బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భూయాన్  

న్యూఢిల్లీ: బిల్కిస్ బానో కేసులో 11 మంది దోషులను జైలు నుంచి విడుదల చేస్తూ గుజరాత్ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు సోమవారం కొట్టేసింది. దోషులందరూ రెండు వారాల్లో జైల్లో లొంగిపోవాలని తీర్పులో స్పష్టం చేసింది. ఈ కేసు విచారణ మహారాష్ట్రలో జరిగిందని, దోషులకు రెమిషన్‌‌ (శిక్ష కాలం తగ్గింపు) ఆర్డర్ మంజూరు చేసే అధికారం గుజరాత్‌‌ ప్రభుత్వానికి లేదని తేల్చి చెప్పింది. సుప్రీం కోర్టు జడ్జిలు జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌‌తో కూడిన ధర్మాసనం ఈ తీర్పు వెల్లడించింది. 


2002లో జరిగిన గుజరాత్ అల్లర్లలో బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం, ఆమె కుటుంబ సభ్యుల హత్య కేసుల్లో దోషులైన 11 మందిని గుజరాత్ ప్రభుత్వం 2022, ఆగస్టు 15న రిలీజ్ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ బిల్కిస్ బానో సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. విచారించిన సుప్రీం కోర్టు.. రెమిషన్ ఆర్డర్​ను రద్దు చేస్తూ 100 పేజీలతో కూడిన కీలక తీర్పు వెల్లడించింది. ఇది నేర పూరిత చర్య గుజరాత్ ప్రభుత్వం రెమిషన్ ఆర్డర్ జారీ చేయడం కారణంగానే దాన్ని రద్దు చేస్తున్నాం. దోషుల విచారణ మొత్తం మహారాష్ట్రలో జరిగింది. అక్కడి నుంచే రెమిషన్ ఆర్డర్ రిలీజ్ కావాలి. కానీ.. ఈ కేసులో అలా జరగలేదు. రెమిషన్ ఆర్డర్ ను గుజరాత్ ప్రభుత్వం ఎలా రిలీజ్ చేస్తుంది? గుజరాత్ సర్కార్​కు ఆ అర్హత లేదు. మహారాష్ట్ర అధికారాలను గుజరాత్ లాగేసుకుంది. గుజరాత్ సర్కార్ అధికార దుర్వినియోగానికి పాల్పడింది. చట్టాన్ని ఉల్లంఘించింది. అందుకే.. రెమిషన్ ఆర్డర్ రద్దు చేయాల్సి వచ్చింది”అని సుప్రీం ధర్మాసనం తీర్పులో వెల్లడించింది. వాస్తవాలను తప్పుదోవ పట్టించి దోషులు క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకున్నారని ధర్మాసనం వివరించింది. దోషులను రిలీజ్ చేయాలని సుప్రీం కోర్టు ఎప్పుడూ గుజరాత్ ప్రభుత్వానికి చెప్పలేదని, ఇది నేరపూరిత చర్య అని మండిపడింది. 

బాధితురాలి హక్కు పరిగణనలోకి తీసుకున్నం

దోషుల్లో ఒకరైన రాధేశ్యామ్ షాకు గుజరాత్​ ప్రభుత్వం సహకరించిందని సుప్రీం ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. దోషులకు ఉపశమనం కల్పించే విషయంలో ప్రభుత్వాలు సెలెక్టివ్​గా (తమకు నచ్చిన వారికే) ఉండకూడదని అభిప్రాయపడింది. బాధితురాలి హక్కును పరిగణనలోకి తీసుకుని ఈ తీర్పు వెల్లడిస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. 1992 చట్టం ఆధారంగా తమను విడుదల చేయాలంటూ 2022, మే 13న ఒక దోషి చేసిన అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోవాలని మాత్రమే గుజరాత్ ప్రభుత్వానికి సూచించామని సుప్రీం ధర్మాసనం వివరించింది. బాధిత మహిళకు గౌరవం ఇవ్వాలని, దోషులను విడుదల చేసే ముందు చట్టం గురించి తెలుసుకోవాలని అసహనం వ్యక్తం చేసింది. రెండు వారాల్లో 11 మంది దోషులు లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. 

రిలీజ్​ను వ్యతిరేకిస్తూ పిటిషన్లు

11 మంది దోషుల విడుదలను సవాల్ చేస్తూ టీఎంసీ నాయకురాలు మహువా మొయిత్రా, సీపీఐ (ఎం) లీడర్లు సుభాషిణి అలీ, ఇండిపెండెంట్ జర్నలిస్ట్ రేవతి లౌల్, లక్నో వర్సిటీ మాజీ వీసీ రూప్ రేఖ వర్మతో పాటు పలువురు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో 2022, ఆగస్టు 25న  కేంద్రంతో పాటు గుజరాత్ సర్కార్​కు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. 2022, నవంబర్ 30న  బిల్కిస్ బానో గుజరాత్ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. దోషులను విడుదల చేస్తే న్యాయ వ్యవస్థపై నమ్మకం పోతుందని పిటిషన్​లో ఆమె పేర్కొన్నారు. అన్ని పిటిషన్లపై విచారించిన సుప్రీం కోర్టు.. 2023, అక్టోబర్ 12న తీర్పు రిజర్వ్ చేసింది.  తాజాగా సోమవారం గుజరాత్ సర్కార్ ఇచ్చిన ఆదేశాలను కొట్టేస్తూ తీర్పు వెలువరించింది. 11 మంది దోషులు జైల్లో లొంగిపోవాలని ఆదేశించింది.

జీవిత ఖైదు ఎన్ని ఏండ్లు?

వాస్తవానికి, జీవిత ఖైదు శిక్ష పడిన ఖైదీ కనీసం 14 ఏండ్లు జైల్లో గడపాలి. ఆ తర్వాత దోషుల కేసు ఫైల్ పరిశీలనకు వస్తుంది. వయస్సు, నేర స్వభావం, జైల్లో ప్రవర్తన మొదలైన వాటి ఆధారంగా వారి శిక్షను తగ్గించే అవకాశం ఉంటుంది. ఖైదీ తన నేరానికి తగినంత శిక్షను అనుభవించినట్లు ప్రభుత్వం భావిస్తే, అతన్ని విడుదల చేయొచ్చు. చాలా సార్లు ఖైదీలు తీవ్ర అనారోగ్యం కారణాలతో కూడా విడుదలవుతుంటారు. జీవిత ఖైదు శిక్ష పడిన నేరస్తులకు, వారు చేసిన నేరం చిన్నదైతే ముందుగా విడుదల చేస్తారు. తీవ్రమైన నేరాలలో ఇలాంటివి జరగవు. బిల్కిస్ బానో కేసులో దోషులను విడుదల చేయాలంటూ అప్పట్లో గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. అయినా, ప్రభుత్వం వారిని విడుదల చేసింది.

అసలు బిల్కిస్​ బానో కేసు ఏంటి?

గుజరాత్‌‌‌‌‌‌‌‌లోని గోద్రాలో 2002, మార్చిలో హిందూ – ముస్లింల మధ్య అల్లర్లు చెలరేగాయి. దీంతో అహ్మదాబాద్ కు దగ్గర్లోని రంధిక్​పూర్ గ్రామంలో నివాసం ఉంటున్న బిల్కిస్ బానో, ఆమె కుటుంబంపై ఓ వర్గం దాడి చేసింది. అప్పుడు బిల్కిస్ బానో వయస్సు 21 ఏండ్లు. ఐదు నెలల గర్భవతిగా ఉన్న ఆమెపై కొందరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తర్వాత ఏడుగురు కుటుంబ సభ్యలను హత్య చేశారు. చనిపోయిన వారిలో బిల్కిస్ బానో మూడేండ్ల కూతురు కూడా ఉంది. ఈ ఘటనపై 2003, డిసెంబర్​లో సుప్రీం కోర్టు సీబీఐ ఎంక్వైరీకి ఆదేశించింది. దీంతో బిల్కిస్​ బానో కేసు దర్యాప్తు గుజరాత్ నుంచి ముంబైకి తరలించారు. కేసు సీబీఐ చేతుల్లోకి వెళ్లింది. 11మంది నిందితులను జీవిత ఖైదు చేయాలని 2008, జనవరి 21న స్పెషల్ కోర్టు తీర్పు చెప్పింది. 

ఎలా రిలీజ్ అయ్యారు?

2016 , డిసెంబర్​లో యావజ్జీవ కారాగార శిక్ష పడిన 11 మంది దోషులు దాఖలు చేసిన అప్పీళ్లపై బాంబే హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. తర్వాత.. 2017, మేలో స్పెషల్ కోర్టు తీర్పును బాంబే హైకోర్టు డివిజన్​ బెంచ్ సమర్థించింది. 2019, ఏప్రిల్ 23న బిల్కిస్ బానోకు రూ.50లక్షల పరిహారం చెల్లించాలని గుజరాత్ సర్కార్​ను సుప్రీం కోర్టు ఆదేశించింది. అప్పటికే 15 ఏండ్ల జైలు జీవితం గడిపిన దోషుల్లో ఒకడు.. 1992 చట్టం ప్రకారం తమను యావజ్జీవ కారాగార శిక్షకు ముందు రిలీజ్ చేయాలని 2022, మే 13న సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. ఈ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోవాలని గుజరాత్ సర్కార్​ను సుప్రీం కోర్టు ఆదేశించింది. దీంతో 2022, ఆగస్టు 15న సత్ర్పవర్తన కారణంగా 11 మంది దోషులను గుజరాత్ ప్రభుత్వం గోద్రా సబ్ జైలు నుంచి రిలీజ్ చేసింది. దీంతో కొందరు వీరికి ఘనంగా స్వాగతం పలికారు. వీరిని హీరోలుగా పేర్కొంటూ చేసిన సోషల్ మీడియా పోస్టులపై అప్పట్లో నిరసన వ్యక్తమైంది.

దోషులు ఎవరు?

రాధేశ్యామ్ షా, జశ్వంత్ చతుర్‌‌‌‌‌‌‌‌ భాయ్, కేశూభాయ్ వడానియా, బాకాభాయ్ వడానియా, రాజీభాయ్ సోని, రమేశ్​ భాయ్ చౌహాన్, శైలేశ్​భట్, బిపిన్ చంద్ర జోషి, గోవింద్‌‌‌‌‌‌‌‌ భాయ్, మహేశ్​భట్, ప్రదీప్ మోధియా విడుదల అయ్యారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌‌‌‌‌‌‌‌ను పురస్కరించుకుని గుజరాత్ ప్రభుత్వం - వారిని సత్ప్రవర్తన గల ఖైదీలుగా గుర్తించి విడుదల చేసింది.

న్యాయం సాధించిన విజయం ఇది: రాహుల్ గాంధీ

బిల్కిస్ బానో కేసు విషయంలో సుప్రీం తీర్పు.. న్యాయం సాధించిన విజ‌‌‌‌‌‌‌‌య‌‌‌‌‌‌‌‌మ‌‌‌‌‌‌‌‌ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. అహంకార బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బిల్కిస్‌‌‌‌‌‌‌‌ బానో చేసిన సుదీర్ఘ పోరాటానికి ఫ‌‌‌‌‌‌‌‌లితంగా న్యాయం గెలిచిందని ట్విట్టర్​లో పేర్కొన్నారు. బీజేపీ మహిళా వ్యతిరేకి అని, నేరస్తులను ప్రోత్సహిస్తున్నదని ఆరోపించారు. ఎన్నికల ప్రయోజనాల కోసం న్యాయాన్ని చంపేసే ధోరణి ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదకరమన్నారు. సుప్రీంకోర్టు తీర్పు.. నేరస్తులను పెంచి పోషిస్తుంది ఎవరనే విషయాన్ని దేశానికి చాటి చెప్పిందని వివరించారు.

బిల్కిస్ బానో కుటుంబ సభ్యుల సంబురాలు

సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తూ.. బిల్కిస్ బానో కుటుంబ సభ్యులు పటాకులు కాల్చి, స్వీట్లు తినిపించుకుని సంబురాలు జరుపుకున్నారు. గుజరాత్​లోని దాహోద్ జిల్లా దేవ్​గఢ్ బరియాలో ఉంటున్న బిల్కిస్ బానో ఫ్యామిలీ మెంబర్స్ సుప్రీం కోర్టుకు ధన్యవాదాలు తెలిపారు. బిల్కిస్ బానోకు న్యాయం జరిగిందని ఈ కేసులో సాక్షిగా ఉన్న అబ్దుల్ రజాక్ మన్సూరీ అన్నారు. గుజరాత్ ప్రభుత్వం 11 మంది దోషులను రిలీజ్ చేసి చట్టాన్ని ఉల్లంఘించిందని మండిపడ్డారు. సుప్రీం కోర్టు దాన్ని సరి చేసిందన్నారు. సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్టు తెలిపారు.