
- ప్రాజెక్ట్‌ల నిర్మాణం ఆగిపోతే ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి: సుప్రీం కోర్టు
- కేంద్రం కోసం కొన్ని మార్గదర్శకాలు జారీ
- రెరాకు పవర్స్ ఇవ్వాలని ఆదేశం
- ఎన్‌సీఎల్‌టీ, ఎన్‌సీలాట్‌లో మ్యాన్‌పవర్ పెంచాలన్న కోర్టు
న్యూఢిల్లీ: ఇండ్ల కొనుగోలుదారులకు సుప్రీం కోర్టు అండగా నిలిచింది. ఇల్లు కొనుగోలు చేసిన తర్వాత ప్రాజెక్ట్ నిర్మాణం ఆగిపోవడం లేదా డెలివరీకి చాలా ఏళ్లు పట్టడంతో బయ్యర్లపై అప్పుల భారం పెరుగుతోంది. దీనిని దృష్టిలో పెట్టుకొని కేంద్రానికి కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. ఇలాంటి వారిని రక్షించేందుకు ‘రివైవల్ ఫండ్’ ఏర్పాటు చేయాలని సూచించింది. నిర్మాణం ఆగిపోయిన ప్రాజెక్టులకు ఆర్థికంగా సాయం అందించి, హోమ్ బయ్యర్ల హక్కులను కాపాడాలని సలహా ఇచ్చింది. “డెవలపర్లు హోమ్ బయ్యర్లను మోసం చేయకుండా, ప్రాజెక్ట్‌లను సమయానికి పూర్తి చేసేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
ఇది దేశపు నగరాభివృద్ధి విధానానికి మూలస్తంభం కావాలి” అని జస్టిస్ జె.బి. పార్దీవాలా, ఆర్. మహదేవన్‌ల బెంచ్ వ్యాఖ్యానించింది. రెరా సంస్థలు “పంజా లేని పులులు”గా మారకుండా, సరైన మౌలిక సదుపాయాలు, అధికారాలు, ట్రిబ్యునల్స్, అమలు వ్యవస్థలు కల్పించాలని తెలిపింది. వారి ఆదేశాలు త్వరగా, పూర్తిగా అమలయ్యేలా చూడాలంది. ప్రభుత్వం మౌనంగా ఉండకూడదని, హోం బయ్యర్ల హక్కులు, ఆర్థిక వ్యవస్థ స్థిరత్వం కాపాడటం కేంద్ర ప్రభుత్వ రాజ్యాంగ బాధ్యతని బెంచ్ స్పష్టం చేసింది.
‘‘ఇన్‌సాల్వెన్సీ కోడ్ ప్రకారం, నిర్మాణం ఆగిపోయిన ప్రాజెక్టులను గుర్తించి, పూర్తి చేయడానికి నేషనల్ అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీ (ఎన్‌ఏఆర్‌సీఎల్) తరహాలో ఒక సంస్థ ఏర్పాటు చేయండి. దీనిని ప్రభుత్వ, -ప్రైవేట్ భాగస్వామ్యంతో లేదా రియల్ ఎస్టేట్ -కన్‌స్ట్రక్షన్ రంగానికి చెందిన ప్రభుత్వ సంస్థ ద్వారా నడపొచ్చు. పీఎంఏవై వంటి అఫోర్డబుల్ హౌసింగ్ స్కీములకు లేదా ప్రభుత్వ క్వార్టర్లకు దీనిని మొదట ఉపయోగించవచ్చు” అని సుప్రీం కోర్టు బెంచ్ కేంద్రాన్ని ఉద్దేశిస్తూ తెలిపింది.
ఇవీ మార్గదర్శకాలు:
- దివాలాలో ఉన్న ప్రాజెక్టులకు ఫైనాన్సింగ్ సాయాన్ని అందించేందుకు అఫోర్డబుల్ అండ్ మిడ్‌ఇన్‌కమ్ హౌసింగ్ (స్వామిహ్) ఫండ్‌ను విస్తరించాలి. ఈ ఫండ్ కింద నిర్మాణం ఆగిపోయిన హౌసింగ్ ప్రాజెక్టులకు ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందిస్తోంది. ప్రతి రూపాయి చివరి దశ ఫైనాన్సింగ్‌కే వినియోగించాలి. దుర్వినియోగం నివారించేందుకు కాగ్ ద్వారా ఆడిట్ నిర్వహించి, సాధారణ ప్రజలకు అర్థమయ్యే రూపంలో పబ్లిక్ డొమైన్‌లో ఉంచాలి.
- ఎన్‌సీఎల్‌టీ/ఎన్‌సీలాట్‌లో ఖాళీలు భర్తీ చేయాలి. దివాలా కేసుల పరిష్కారానికి ప్రత్యేక బెంచ్‌లు ఏర్పాటుచేయాలి. అవసరమైతే, రిటైర్డ్ జడ్జీల సేవలు తాత్కాలికంగా వినియోగించాలి. మూడు నెలల్లో ఎన్‌సీఎల్‌టీ/ఎన్‌సీలాట్ మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కేంద్రం రిపోర్ట్ సబ్మిట్ చేయాలి.
- రెరాలో మానవ వనరులు, నిపుణుల అవసరం ఉంది. ప్రతి రాష్ట్రం రెరా సంస్థలకు సరైన మౌలిక వనరులు, నిపుణులు, సాంకేతిక నిపుణులను అందించాలి.
- రియల్ ఎస్టేట్ రంగంలో సంస్కరణలు తీసుకురావాలి. మూడు నెలల్లో హైకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో, హౌసింగ్, లా మంత్రిత్వ శాఖ, ఫైనాన్స్, రియల్ ఎస్టేట్ నిపుణులతో కమిటీ ఏర్పాటు చేయాలి. ఇది వాణిజ్యపరంగా సాధ్యమైన సంస్కరణలు సూచించాలి.
- కొత్త ఇండ్ల ప్రాజెక్టుల్లో, కొనుగోలుదారులు కనీసం 20శాతం చెల్లించిన తర్వాత, లావాదేవీని స్థానిక రెవెన్యూ అధికారుల వద్ద నమోదు చేయాలి. భూమి కొనుగోలు లేదా నిర్మాణం ప్రారంభం కాకపోయిన ప్రాజెక్టుల్లో, కొనుగోలుదారుల డబ్బును ఎస్క్రో ఖాతాలో ఉంచి, రెరా ఆమోదించిన స్టాండర్డ్ ప్రాసెస్ ప్రకారం
- దశలవారీగా డబ్బును విడుదల చేయాలి. ప్రతి రెరా ఆరు నెలల్లో ఈ ప్రాసెస్‌ను రూపొందించాలి.
- రాష్ట్రాల మధ్య రెరా నియమాల్లో ఏకరీతి అవసరం. కేంద్రం అన్ని రాష్ట్రాల్లో రెరా నియమాలను ఒకే విధంగా చేపట్టడానికి సంప్రదింపుల ప్రక్రియ ప్రారంభించాలి. హోమ్ బయ్యర్లకు భద్రత కల్పిస్తూనే, రియల్ ఎస్టేట్ రంగాన్ని స్థిరంగా ఉంచే దిశగా చర్యలు తీసుకోవాలి.