సుప్రీంకోర్టు తీర్పు.. పెన్షనర్లకు వరం..

సుప్రీంకోర్టు తీర్పు.. పెన్షనర్లకు వరం..

ప్రభుత్వాలు, ప్రభుత్వేతర సంస్థలు పదవీవిరమణ పొందిన ఉద్యోగులకు అందించే నెలసరి పెన్షన్‌‌ ఎవరి దయ, భిక్ష, బహుమానం లేదా ఎక్స్‌‌గ్రేషియా కాదని సుప్రీం కోర్టు17 డిసెంబర్‌‌ 1983న డి. యస్‌‌ సతారా కేసు విచారణ సందర్భంగా సంచలనాత్మక తీర్పును ఇచ్చారు. ఉద్యోగిగా వ్యక్తి అందించిన అమూల్య సేవలను గుర్తించి ఇచ్చే గౌరవప్రదమైన ఆర్థిక వెసులుబాటే నెలసరి పెన్షన్‌‌ అని తీర్పులో స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా 58 మిలియన్ల పౌరులు వివిధ రకాలైన పెన్షన్లు పొందుతున్నారు. ఉద్యోగి వేతనంలో దాదాపు సగం వరకు పెన్షన్‌‌గా జీవితకాలం పొందుతాడు. ప్రభుత్వాలు, ప్రభుత్వేతర సంస్థలు పెన్షన్లను భారంగా భావించకుండా అది బాధ్యతని తలచాలి. పింఛన్లు పొందుతున్న సీనియర్‌‌ సిటిజన్ల అపార కార్యాలయ అనుభవం, వృత్తి నైపుణ్యం, కార్యదక్షతలను దేశాభివృద్ధికి దోహదపడేలా ప్రభుత్వ, ప్రైవేట్‌‌ రంగాలు వినియోగించుకోవాలి. వయోవృద్ధ పెన్షనర్ల ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్‌‌, తెలంగాణ ప్రభుత్వాలు తమ పౌరులకు వృద్ధాప్య, వికలాంగుల, వితంతు, పలు వ్యాధిగ్రస్థులకు ఆసరా లాంటి పలు రకాల నెలసరి పెన్షన్లను అందిస్తున్నారు. మనదేశంలో పెన్షన్లు 3 రకాలుగా అమలు అవుతున్నాయి. ఉద్యోగులకు అందించే సాధారణ పెన్షన్‌‌, ఎంప్లాయిస్‌‌ ప్రావిడెంట్‌‌ ఫండ్‌‌ ఆర్గనైజేషన్‌‌ ఆఫ్‌‌ ఇండియా ఆధారిత పెన్షన్‌‌, అసంఘటిత రంగంలో నేషనల్‌‌ సోషియల్‌‌ అసిస్టెన్స్‌‌ ప్రోగ్రామ్‌‌ ఆధారిత పెన్షన్లు అందిస్తారు. 01 జనవరి 2004 నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రభుత్వేతర రంగ ఉద్యోగులకు కూడా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్‌‌ (సిపియస్‌‌)‌‌ అమలులోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ‘ప్రధానమంత్రి శ్రమ యోగి మాన్‌‌ ధన్‌‌’ పేరుతో ఫిబ్రవరి 2019 నుంచి అసంఘటిత శ్రామికవర్గాలకు నెలసరి రూ: 3,000/-ల పెన్షన్‌‌ ఇస్తున్నారు. ఆరోగ్యం, ప్రయాణాలు, పన్ను రాయితీలు, సంరక్షణ కేంద్రాలు, వినోద విహార ఏర్పాట్లు లాంటి చేయూతలు పెన్షనర్లకు అందించాలి.   - డా. బుర్ర మధుసూదన్ రెడ్డి