పశ్చిమబెంగాల్ ప్రభుత్వానికి సుప్రీం ఫైన్‌

పశ్చిమబెంగాల్ ప్రభుత్వానికి సుప్రీం ఫైన్‌

పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు జరిమానా విధించింది. ‘భోబిష్యోటర్‌ భూత్‌’ అనే సినిమా స్క్రీనింగ్‌ను రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది. ఇది పొలిటికల్‌ సెటైర్‌ మూవీ కావడంతో ఎన్నికల సమయంలో విడుదల చేస్తే స్థానికంగా దుమారం రేపుతుందన్న ఉద్దేశంతో స్క్రీనింగ్‌ను ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో సినిమా దర్శకుడు అనిక్ దత్తా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సినిమాను ఆపే శక్తి ఏ ప్రభుత్వానికీ ఉండదని, భావవ్యక్తీకరణ విషయంలో ప్రజలకు స్వేచ్ఛ కలిగించాల్సిన బాధ్యత రాష్ట్రంపై ఉంటుందని సుప్రీం తెలిపింది. సినిమా స్క్రీనింగ్‌ను నిలిపివేసినందుకు గానూ ప్రభుత్వం రూ.20 లక్షలు జరిమానా కట్టాలని తీర్పునిచ్చింది. ఆ డబ్బు చిత్ర నిర్మాతలకు, థియేటర్‌ యజమానులకు ఇవ్వాలని చెప్పింది.

భోబిష్యోటర్‌ భూత్‌ సినిమా ఫిబ్రవరిలో విడుదలైంది. కానీ రాజకీయ కారణాలతో సినిమాను అన్ని సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లు, మల్టీప్లెక్స్‌ల నుంచి తొలగించారు. సెన్సార్‌ బోర్డు అనుమతించాక కూడా సినిమాను ఎందుకు ఆపాలని చూశారో నాకు అర్థం కావడంలేదన్నారు సినిమా దర్శకుడు అనిక్ దత్తా.