ఢిల్లీలో నీటికొరతపై సుప్రీం సీరియస్​

ఢిల్లీలో నీటికొరతపై సుప్రీం సీరియస్​
  •     ఆప్​ సర్కారుకు అత్యున్నత న్యాయస్థానం మొట్టికాయలు
  •     పిటిషన్​లో లోపాలు కూడా సవరించరా? అంటూ ఆగ్రహం
  •     విచారణ నేటికి వాయిదా

న్యూఢిల్లీ: ఢిల్లీలో నీటికొరతపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇందుకు సంబంధించి ఢిల్లీ సర్కారు దాఖలు చేసిన పిటిషన్​లో లోపాలను ఎత్తిచూపుతూ.. మొట్టికాయలువేసింది. రాజధానిలో నీటి సంక్షోభాన్ని తగ్గించడానికి హిమాచల్ ప్రదేశ్ నుంచి మిగులు జలాలను ఢిల్లీకి తరలించేలా హర్యానాను ఆదేశించాలని కోరుతూ ఢిల్లీ సర్కార్ పిటిషన్ దాఖలు చేసింది. అయితే, ఇందులో లోపాలున్నాయని, సవరించాలని ఢిల్లీ సర్కారును కోర్టు ఆదేశించింది.

కాగా, ఆ లోపం అలాగే ఉండడంతో రిజిస్ట్రీలో అఫిడవిట్‌‌లను ఆమోదించడం లేదని జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ప్రసన్న బి వరాలేతో కూడిన వెకేషన్ బెంచ్ సోమవారం పేర్కొంది. ‘మేమిచ్చిన గడువు తేదీ కూడా ముగిసింది. మీరు లోపాన్ని ఎందుకు సవరించలేదు. ఇలా అయితే మేం పిటిషన్​ కొట్టేస్తాం. కోర్టు విచారణను అంత తేలికగా తీసుకోకండి’ అని హెచ్చరించింది. అనంతరం విచారణను ఈ నెల 12కు వాయిదా వేసింది. 

నీటి విడుదలపై ఎల్జీ​ హామీ ఇచ్చారు: ఆతిశీ

దేశ రాజధాని వాటా 1,050 క్యూసెక్కుల నీటిని మునాక్ కాలువకు విడుదల చేసేలా హర్యానా ప్రభుత్వంతో మాట్లాడతానని లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా హామీ ఇచ్చినట్టు ఢిల్లీ వాటర్​మినిస్టర్​ అతిశి  తెలిపారు. నీటి కొరతపై చర్చించేందుకు ఆమె తన సహచర మంత్రి సురభ్​ భరద్వాజ్​తో కలిసి గవర్నర్​ను కలిశారు. అనంతరం అతిశి మాట్లాడుతూ.. ‘‘వజీరాబాద్​ బ్యారేజీలో నీటినిల్వలు గణనీయంగా పడిపోయాయి.

మునాక్ కాలువలోకి మరిన్ని నీటిని విడుదల చేసేలా హర్యానా సర్కారును ఒప్పించాలని లెఫ్టినెంట్​ గవర్నర్​ను కోరాం. ఈ కాలువ నీటిపైనే ఏడు ట్రీట్​మెంట్​ ప్లాంట్లు ఆధారపడి ఉన్నాయి. దీనిపై వీకే సక్సేనా సానుకూలంగా స్పందించారు” అని పేర్కొన్నారు. ​ అలాగే, ఢిల్లీ జల్​బోర్డులో ఉన్న ఉద్యోగ ఖాళీలపై కూడా ఆయనతో చర్చించినట్టు చెప్పారు. ఈ సమస్యను కూడా రెండు రోజుల్లో పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారని తెలిపారు.