
- సూర్యాపేట కలెక్టర్ కు ఆధారాలతో బాధితురాలి ఫిర్యాదు
- వెంటనే ఏవోను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు
సూర్యాపేట, వెలుగు: మండల వ్యవసాయాధికారి వేధింపులు తట్టుకోలేక ఆఫీసులోనే మహిళా ఏఈవో చితకబాదిన ఘటన సూర్యాపేట జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. తుంగతుర్తి ఏవోగా బాలకృష్ణ, అదే మండలం గొట్టిపర్తి ఏఈవోగా మహితారెడ్డి విధులు నిర్వహిస్తున్నారు. ఆమె సూర్యాపేటలో నివసిస్తున్నారు. గురువారం అర్ధరాత్రి ఏవో బాలకృష్ణ మద్యం తాగి ఆమె ఇంటికి వెళ్లి బయటకు రావాలని, కలవాలని ఫోన్ చేయడం, మెసేజ్ లు పెట్టడడంతో భయాందోళన చెందింది.
శుక్రవారం ఉదయం ఏఈవో కుటుంబ సభ్యులు, ప్రజాసంఘాలతో కలిసి ఆఫీసుకు వెళ్లి ఏవో బాలకృష్ణను నిలదీసింది. ఎందుకు వేధిస్తున్నావని ఆమె ప్రశ్నిస్తే బాలకృష్ణ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. దీంతో ఆగ్రహంతో ఏవోను చితకబాదారు. అనంతరం ఏవో వేధింపులకు సంబంధించిన ఆధారాలతో జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ కు ఫిర్యాదు చేశారు.
తన కిందిస్థాయి మహిళా ఉద్యోగినులను ఏదో రకంగా వేధించడం ఏవో బాలకృష్ణకు పరిపాటిగా మారిందని, తనలాగే ఇంకొందరు ఏఈవోలు ఇబ్బంది పడ్డారని, న్యాయం చేయాలని ఆమె కలెక్టర్ ను కోరారు. దీనిని సీరియస్ గా తీసుకుని వెంటనే ఏవో బాలకృష్ణను సస్పెండ్ చేశారు. తక్షణమే శాఖాపరమైన విచారణ చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. మహిళా ఉద్యోగినుతో ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తిస్తే సహించేదిలేదని కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.