బహుముఖ ప్రజ్ఞాశాలి: పేద, బడుగు, బలహీన వర్గాల పెన్నిధి సురవరం సుధాకర్ రెడ్డి

 బహుముఖ  ప్రజ్ఞాశాలి: పేద, బడుగు, బలహీన వర్గాల పెన్నిధి సురవరం సుధాకర్ రెడ్డి

భారతదేశ రాజకీయాలతోపాటు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో జరుగుతున్న పరిణామాలను అవలీలగా అర్థం చేసుకొని ప్రజలకు వివరించే బహుముఖ  ప్రజ్ఞాశాలి.. నిరంతరం కార్మిక, కర్షక, పేద, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ప్రధాన లక్ష్యంగా ఆలోచన చేసిన అపర మేధావి సురవరం సుధాకర్​ రెడ్డి. 

 ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో కీలకంగా వ్యవహరించిన గొప్ప నాయకుడు.  రాజకీయ ముఖచిత్రంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని నీతి, నిజాయితీలకు నిలువుటద్దంగా, రాజకీయవేత్తగా, మేధావిగా, విలువలతో కూడుకున్న రాజకీయ ప్రముఖుల్లో సుధాకర్ రెడ్డికి ప్రత్యేక స్థానం ఉంది.  సురవరం సుధాకర్ రెడ్డిది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా  మానవపాడు మండలం  కంచుపాడు స్వగ్రామం.  

ఆయన తన అమ్మమ్మ ఊరైన కొండ్రావుపల్లిలో 1942 మార్చి 25వ తేదీన జన్మించాడు.  తండ్రి వెంకటరామిరెడ్డి, తల్లి ఈశ్వరమ్మ దంపతుల  కుమారుడైన సుధాకర్ రెడ్డి విద్యాభ్యాసం అంతా కర్నూలులో పూర్తి చేశారు.  కర్నూలులోని  ఉస్మానియా  కళాశాలలో బీఏ పూర్తి చేశారు. సురవరం ప్రతాపరెడ్డికి సుధాకర్ రెడ్డి తండ్రి వెంకట్రామారెడ్డి తమ్ముడు.  

విద్యార్థి, యువజన రంగాల ఉద్యమ నేపథ్యం

విద్యార్థి దశలోనే  విద్యారంగ సమస్యల పట్ల పేద, బడుగు, బలహీన విద్యార్థుల సంక్షేమం కోసం ఏఐఎస్ఎఫ్ లో  చేరి 19 ఏళ్లకే  ఏఐఎస్ఎఫ్  కర్నూలు పట్టణ కార్యదర్శిగా 1960లో కర్నూలు జిల్లా కార్యదర్శిగా పనిచేశారు. 1967లో హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో లా కోర్సులో చేరి ఉస్మానియా యూనివర్సిటీలో కూడా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు, పోరాటాలు నిర్వహించారు.  

లా కాలేజీలో యూనివర్సిటీ ఎన్నికల్లో ప్రధాన కార్యదర్శిగా విజయం సాధించాడు. అనంతరం ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాడు. 1963లో ఏఐఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికై అనంతరం రెండు పర్యాయాలు జాతీయ అధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా  పనిచేశారు. 1972లో జాతీయ అధ్యక్షుడుగా  కూడా పనిచేశారు.   

పార్టీ పదవుల ప్రస్థానం

లా పూర్తి చేసిన తర్వాత ఢిల్లీలో సీనియర్ న్యాయవాది వద్ద చేరి ప్రాక్టీస్ చేస్తున్న క్రమంలో భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ నాయకత్వం సీపీఐలో  పూర్తికాలం పనిచేయడానికి అవకాశం ఇవ్వడంతో భారత కమ్యూనిస్టు పార్టీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. 

అక్కడి నుంచే రాష్ట్ర రాజకీయాలలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్రస్థాయినేతగా మంచి గుర్తింపు పొంది రాష్ట్ర సహాయ కార్యదర్శి,  రాష్ట్ర కార్యదర్శి స్థాయికి ఎదిగారు. 1998లో  రాష్ట్ర కార్యదర్శిగా, జాతీయ కార్యవర్గ సభ్యుడిగా, కేంద్ర కార్యదర్శి వర్గ సభ్యుడిగా పనిచేశారు. 2012లో  సీపీఐ  జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై 2019లో అనారోగ్య కారణాలవల్ల పార్టీ పదవుల నుంచి తప్పుకున్నారు.  

వైవాహిక జీవితం

ఏఐఎస్ఎఫ్ ఉద్యమ సమయంలో పరిచయమైన డాక్టర్  బీవీ  విజయలక్ష్మిని 1974లో ఆదర్శ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు.  జాతీయస్థాయి పార్టీ పదవిలో కొనసాగడానికి అవకాశం వచ్చిన సందర్భంగా విజయలక్ష్మి బ్యాంకు ఉద్యోగాన్ని సైతం వదులుకొని పార్టీ కోసం పనిచేశారు.  నిత్యం  ప్రజాక్షేత్రంలో ఉన్న సుధాకర్ రెడ్డికి తోడు నీడగా  ఆయన బాగోగులు చూసుకుంటూ నాటి నుంచి తుదిశ్వాస విడిచేవరకు వెన్నంటి ఉన్నారు.

సురవరంతో నా అనుబంధం 

భారత కమ్యూనిస్టు పార్టీ క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించడంలో ఎన్నడూ కూడా వెనకడుగు వేయని గొప్ప మనసున్న వ్యక్తి సుధాకర్ రెడ్డి.  ఉమ్మడి కరీంనగర్ జిల్లా పార్టీ కార్యదర్శిగా  పనిచేస్తున్న క్రమంలో  రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు వహిస్తున్న సుధాకర్ రెడ్డి నాకు పార్టీ కార్యక్రమాల నిర్వహణ,  నీతి,  నిజాయితీ, క్రమశిక్షణతో ఉండాలని, సైద్ధాంతిక అవగాహన కల్పించడంలో అందరి కంటే ముందున్నారు. 

2004లో  జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆనాటి ఇందుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానాన్ని సైతం నాకు ఇప్పించి నేను శాసనసభ్యుడిగా గెలుపొందడం కోసం కృషి చేశారు.  పార్టీ పక్షాన శాసనసభలో సీపీఐ పక్ష నాయకునిగా పనిచేస్తున్న క్రమంలో ప్రజల పక్షాన నిలబడి పనిచేయాలని అనేక సలహాలు, సూచనలు ఇస్తూ ప్రోత్సహించేవారు. ఆయన ప్రోత్సాహం మరవలేనిది.    నల్గొండలో జరిగిన  భారత  కమ్యూనిస్టు పార్టీ వంద సంవత్సరాల ప్రారంభ వేడుకలకు ఆయన వీల్ చైర్ మీద వచ్చి సందేశం ఇచ్చారు. 

 రాష్ట్ర పార్టీ  కార్యాలయం మగ్దూం భవన్ పునర్నిర్మాణ  ప్రారంభోత్సవానికి కూడా హాజరయ్యారు.  వారికి పార్టీ పిలుపు ఉంటే చాలు  అనారోగ్యం  లెక్కచేయకుండా  సమావేశాలలో పాల్గొని నాయకుల్ని,  ప్రజల్ని, కార్యకర్తల్ని ఉత్సాహపరిచేవారు.  వారి సైద్ధాంతిక లక్ష్యాలను పుణికి పుచ్చుకుని ముందుకుపోవడమే ఈనాటి తరానికి లక్ష్యంగా ఉండాలి.

ప్రజా ప్రతినిధి  ప్రాతినిధ్య ప్రస్థానం

1980, 1984లో  మహబూబ్ నగర్ జిల్లా  కొల్లాపూర్ నియోజకవర్గం, 1994లో ఆనాటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డిపై కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. 1998లో జరిగిన 12వ లోక్​సభ స్థానానికి  నల్గొండ పార్లమెంటు నియోజకవర్గం నుంచి మొట్ట మొదటిసారి పార్లమెంటు సభ్యుడుగా ఎన్నికయ్యారు.  

2004లో  తిరిగి మరోసారి 14వ లోక్​సభకు జరిగిన ఎన్నికల్లో నల్గొండ పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. భారతదేశ అత్యున్నత పార్లమెంటరీ కమిటీలకు ప్రాతినిధ్యం వహించారు. అనేకమంది పేదలకు ఇండ్ల స్థలాలు, ఇండ్లు నిర్మించి ఇవ్వడం కోసం కేంద్రంలో కీలకంగా వ్యవహరించారు.


- చాడ వెంకటరెడ్డి, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు-