రాష్ట్రంలో అవినీతిపై సర్జికల్ స్ట్రైక్స్ : మోదీ

రాష్ట్రంలో అవినీతిపై సర్జికల్ స్ట్రైక్స్ :  మోదీ
  •  కాళేశ్వరంలో బీఆర్ఎస్ అవినీతికి పాల్పడినా కాంగ్రెస్ చర్యలు తీసుకుంటలేదు
  • ఆ అవినీతిలో భాగమైన తమ వాళ్ల బాగోతం బయటపడ్తదని భయపడుతున్నది
  • తెలంగాణను కాంగ్రెస్ ఏటీఎంలా మార్చుకున్నది
  • కుటుంబ పార్టీలకు కుటుంబమే ముఖ్యం.. తనకు దేశం ముఖ్యమన్న ప్రధాని 
  • రూ.7,200 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభం

సంగారెడ్డి, వెలుగు: కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఒక్కటేనని ప్రధాని మోదీ విమర్శించారు. ఆ రెండు పార్టీల మధ్య అవినీతి బంధం ఉన్నదని ఆరోపించారు. ‘‘తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ​రెండూ ఒక్కటే. కవర్ ఫైర్​ చేస్తూ ఒకరినొకరు కాపాడుకుంటున్నారు. వాళ్ల ఆటలు ఎంతోకాలం సాగవు. మోదీ ప్రభుత్వంలో సర్జికల్​ స్ట్రైక్స్ జరుగుతాయి. ఎయిర్ ​స్ట్రైక్స్ కూడా జరుగుతాయి’’ అని సంచలన కామెంట్స్​ చేశారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలం పటేల్​గూడలో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధాని మోదీ పాల్గొని మాట్లాడారు. 

  ‘‘కాళేశ్వరం ప్రాజెక్టులో గత బీఆర్ఎస్​ప్రభుత్వం రూ.కోట్లల్లో అవినీతికి పాల్పడింది. అయినా కాంగ్రెస్​ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. బీఆర్ఎస్​అవినీతిలో భాగస్వాములైన తమ వాళ్ల విషయాలు ఎక్కడ బయటపడ్తాయోనని కాంగ్రెస్​సర్కార్ భయపడుతున్నది” అని మోదీ మండిపడ్డారు. ‘‘ప్రాజెక్టుల్లో అవినీతిని బయటకు తీస్తున్న కాంగ్రెస్​ప్రభుత్వం.. అదే స్పీడ్ తో చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య స్కామ్​ల బంధం ఉన్నది. ఈ విషయం ప్రపంచానికంతా తెలుసు” అని అన్నారు. కాంగ్రెస్ తెలంగాణను తమ కొత్త ఏటీఎంగా మార్చుకున్నదని ఫైర్ అయ్యారు.
 
వాళ్లకు కుటుంబమే ముఖ్యం.. 

మాటిచ్చి తప్పే ముచ్చట్నే లేదని ప్రధాని మోదీ అన్నారు. ‘‘మోదీ గ్యారంటీ అంటే కచ్చితంగా అమలయ్యే గ్యారంటీ. మోదీ ఏది చెప్పినా తప్పకుండా చేసి చూపిస్తాడు. ఆర్టికల్​370 రద్దు, అయోధ్యలో రామ మందిర నిర్మాణం, ప్రపంచంలో భారత్ ను బలమైన ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దుతామని గతంలో హామీ ఇచ్చాం. ఆ హామీలను నెరవేర్చాం. ఆర్టికల్​ 370 రద్దు చేసినం. రామమందిర నిర్మాణం పూర్తి చేశాం. దేశాన్ని మూడో బలమైన ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దే పనిలో ఉన్నాం” అని చెప్పారు. కుటుంబ పార్టీల అవినీతిని బయటపెడుతున్నందుకే తనపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

మీ ప్రేమ సంతృప్తినిచ్చింది..  

తెలంగాణ ప్రజలు చూపించిన ప్రేమ తనకెంతో సంతృప్తిని ఇచ్చిందని ప్రధాని మోదీ అన్నారు.  ‘‘తెలంగాణలో రెండు రోజులు ఉన్నాను. బీజేపీపై ఇక్కడి ప్రజలకు ఉన్న విశ్వాసం చూసి నాకు మరింత సంతృప్తి కలిగింది. మీరు నా మీద చూపించిన ప్రేమకు రెండింతలు అభివృద్ధి రూపంలో తెలంగాణకు తిరిగి ఇస్తా. తెలంగాణ  ప్రజల విశ్వాసాన్ని,  ఆశీర్వాదాన్ని వృథా కానివ్వం. పార్లమెంట్​ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీని ఆశీర్వదించాలి. 17 స్థానాల్లోనూ పార్టీని గెలిపించాలి” అని కోరారు. సభలో ఎమ్మెల్యేలు  వెంకటరమణ రెడ్డి, పాల్వాయి హరీశ్​బాబు, మాజీ ఎమ్మెల్యే రఘునందన్​రావు, పార్టీ నేతలు ప్రేమేందర్ రెడ్డి, గోదావరి తదితరులు పాల్గొన్నారు. 

బేగంపేట్ లో తొలి ఏవియేషన్ సెంటర్

సభకు ముందు రూ.7,200 కోట్ల అభివృద్ధి పనులను ప్రధాని మోదీ జాతికి అంకితమిచ్చారు. బేగంపేట ఎయిర్​పోర్టులో ఏర్పాటు చేసిన దేశంలోనే తొలి ఏవియేషన్​సెంటర్​ను వర్చువల్ గా ప్రారంభించారు. నేషనల్​హైవేలు, రైల్వే లైన్లు, ఎయిర్​పోర్టులు, 6 కొత్త రైల్వే స్టేషన్ల బిల్డింగులు, విద్యుదీకరణ పూర్తి చేసుకున్న సనత్​నగర్, మౌలాలి, ఘట్కేసర్, లింగంపల్లి ఎంఎంటీఎస్ రైల్వే లైన్, ఇండియన్ ఆయిల్ కంపెనీకి చెందిన పారదీప్–హైదరాబాద్​ప్రొడక్ట్ లైన్ ను జాతికి అంకితమిచ్చారు. ఏవియేషన్ సెంటర్ తో​ఈ రంగంలో తెలంగాణకు ఎంతో లబ్ధి చేకూరుతుందని, రాష్ట్రంలోని యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని మోదీ తెలిపారు. 

పదేండ్లలో ఎయిర్​పోర్ట్​ల సంఖ్య రెట్టింపు అవుతుందని చెప్పారు. వికసిత్ తెలంగాణ ద్వారా వికసిత్​భారత్​లక్ష్యాన్ని సాధించడం కోసం ఈ ప్రాజెక్టులు ఉపయోగపడతాయన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నిరంతరాయంగా సహాయం చేస్తోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో గవర్నర్​తమిళిసై, రాష్ట్ర మంత్రులు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ, సంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్​పర్సన్​మంజుశ్రీ, కలెక్టర్​వల్లూరి క్రాంతి తదితరులు పాల్గొన్నారు. కాగా, అంతకుముందు కేంద్రం, రాష్ట్రాలకు చెందిన వివిధ శాఖల అధికారులతో పటేల్ గూడ వద్ద మోదీ సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఉజ్జయిని మహంకాళి ఆలయంలో  మోదీ పూజలు

సికింద్రాబాద్, వెలుగు: ప్రధాని మోదీ మంగళవారం సికింద్రాబాద్​లోని ఉజ్జయిని మహంకాళి ఆలయాన్ని సందర్శించారు. రాజ్ భవన్ నుంచి బయలుదేరి ఉదయం 10:10 గంటలకు అమ్మవారి ఆలయానికి ప్రధాని చేరుకోగా, ఆలయ సిబ్బంది ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అమ్మవారికి మోదీ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు ఆయనకు అమ్మవారి వస్త్రం, చిత్రపటం అందజేశారు. అనంతరం మోదీ 10:20 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి సంగారెడ్డి సభకు వెళ్లారు. కాగా, ప్రధాని రాక సందర్భంగా సికింద్రాబాద్ లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

ఇటీవల బెంగళూరులో జరిగిన పేలుడు నేపథ్యంలో పకడ్బందీగా సెక్యూరిటీ ఏర్పాట్లు చేశారు. ట్యాంక్​బండ్​నుంచి ప్యారడైజ్ జంక్షన్ వరకు ఆలయానికి ఆరు కిలోమీటర్ల పరిధిలో 12 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఆలయానికి సమీపంలోని షాపులను మూసివేయించారు. ఇక ఆలయంలో రెండంచెల భద్రత ఏర్పాటు చేశారు. ముందుగా ఎస్పీజీ టీమ్ ఉదయం 8గంటలకే ఆలయాన్ని తమ అధీనంలోకి తీసుకుంది. అమ్మవారిని దర్శించుకునేందుకు  ప్రధానితో పాటు మరొకరిని మాత్రమే అనుమతించారు. ఆలయంలో పూజలు చేసేందుకు ప్రధాన అర్చకుడితో పాటు మరొక అర్చకుడు,  ఆలయ సీఈఓను అనుమతించారు.

రాష్ట్రంలో రాహుల్ ట్యాక్స్: కిషన్​ రెడ్డి

తెలంగాణలో కాంగ్రెస్ ​ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు కావస్తున్నా, ఎలాంటి మార్పు కనిపించడం లేదని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​రెడ్డి విమర్శించారు. ఎన్నికల టైమ్​లో ఆరు గ్యారంటీల పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. బీఆర్ఎస్​తరహాలోనే పాలన సాగిస్తున్నదని మండిపడ్డారు. ‘‘వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేసి చూపిస్తామని కాంగ్రెస్​చెప్పింది. కానీ ఇప్పటి వరకు 3 స్కీములకే పరిమితమైంది. అదికూడా కొంత మేరకే అమలు చేసింది. పైగా రాష్ట్రంలో రాహుల్ ట్యాక్స్​ వసూలు చేస్తోంది” అని ఆరోపించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం కలిసి కాపురం పెట్టాయని విమర్శించారు. తెలంగాణలో నిజమైన ప్రజాపాలన రావాలంటే అది బీజేపితోనే సాధ్యమన్నారు. రానున్న పార్లమెంట్​ఎన్నికల్లో మొత్తం 17 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.

Also Read:  పోచారం భాస్కర్​రెడ్డికి పదవీ గండం?    

కుటుంబ పాలన సాగుతున్న చోట్ల ఆయా 

కుటుంబాలు మాత్రమే బాగుపడ్డాయి. కానీ రాష్ట్రాలు నాశనమయ్యాయి. కుటుంబ పాలన చేస్తున్నోళ్లు నల్లధనం దాచుకోడానికి విదేశీ బ్యాంకుల్లో ఖాతాలు తెరిచారు. తమ కుటుంబసభ్యులకు విలాసవంతమైన బిల్డింగులు కట్టించారు. కానీ నేను దేశంలోని పేదలకు 4 కోట్ల ఇండ్లు కట్టించాను. నాకు కుటుంబం లేదంటూ కుటుంబ పార్టీలు విమర్శిస్తున్నాయి. 140 కోట్ల మంది భారతీయులు నా  కుటుంబ సభ్యులే. కుటుంబ పార్టీలకు వాళ్ల కుటుంబమే ముఖ్యం. కానీ నాకు దేశం, దేశంలోని ప్రతి కుటుంబం ముఖ్యం.
- సంగారెడ్డి సభలో ప్రధాని మోదీ