కామారెడ్డిలో పట్టా భూములకు సర్వే నోటీసులు

కామారెడ్డిలో పట్టా భూములకు సర్వే నోటీసులు

కామారెడ్డి, వెలుగు:జిల్లాలో రైతుల పట్టా భూములకు అధికారులు పోడు సర్వే నోటీసులు  ఇస్తున్నారు.   ఫారెస్ట్​ను ఆనుకొని ఉన్న తమ భూమిలో సర్వే ఏంటని రైతు లు ఆందోళన చెందుతున్నారు.  కామరెడ్డి జిల్లాలో 2,05,475 ఎకరాల్లో ఫారెస్ట్​ ఏరియా ఉంది. కామారెడ్డి డివిజన్లో 1,06,310 ఎకరాలు, బాన్స్​వాడ డివిజన్లో 99,162 ఎకరాల్లో ఫారెస్ట్​ ల్యాండ్​ ఉంది.  అయితే 69,272ఎకరాల ఫారెస్టు ల్యాండ్​లో  పోడు వ్యవసాయం జరుగుతున్నట్లు ఆఫీసర్లు గుర్తించారు. కొన్నేళ్లుగా సాగులో ఉన్నవారి వివరా లతో పాటు, సాగుదారుల నుంచి ఆఫీసర్లు అప్లికేషన్లు తీసుకుంటున్నారు. ఫారెస్టు, రెవెన్యూ ఆఫీసర్ల మధ్య కో అర్డినేషన్​ లేకపొవటంతో సాగుదారులు ఇబ్బందులకు గురవుతున్నారు.  జిల్లా వ్యాప్తంగా  పోడు సర్వే కోసం అధికారులు గ్రౌండ్​ వర్క్​ చేస్తున్నారు. ఈ క్రమంలో సర్వే కోసం రైతులకు నోటీసులు జారీ చేస్తున్నారు. అయితే ఫారెస్ట్​ ల్యాండ్​లో ఎవుసం  చేస్తున్న రైతులతో పాటు  తమ సొంత భూమి లో సాగు చేసుకుంటున్న వారికి కూడా సర్వే నోటీసులు ఇవ్వడంతో రైతులు  ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా  గాంధారి, సదాశివనర్​, రామారెడ్డి, మాచారెడ్డి, రాజంపేట, బిచ్కుంద, పిట్లం, జుక్కల్, బాన్స్​వాడ, బీర్కుర్​, ఎల్లారెడ్డి, లింగంనేట మండలాల్లో  పోడు సమస్య ఎక్కువ కనిపిస్తోంది. 

పట్టా భూములకు నోటీసులు.. 

రామారెడ్డి, రాజంపేట, గాంధారి, లింగంపేట, బిచ్కుంద మండలాల్లోని కొన్ని చోట్ల పట్టా భూములు సాగు చేసుకుంటున్న రైతులకు  నోటీసులు అందాయి. రామారెడ్డి మండలంలోని కన్నాపూర్, కన్నాపూర్​ తండా శివారు రైతులకు నోటీసులు రావటంతో  కలెక్టరేట్​కు వచ్చి ఫిర్యాదు చేశారు.  కొంతమందికి  కొత్త పట్టాదారు ఫాసు బుక్స్​ వచ్చినప్పటికీ ఆన్​లైన్​లో వివరాలు కనిపించటం లేదు.  దీంతో బ్యాంకులు లోన్లు ఇవ్వటం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు.  పాత పాసుబుక్స్​తో లోన్లు తీసుకున్న రైతుల వివరాలు కనిపించటం లేదని, లోన్​ అమౌంట్​ చెల్లించాలంటూ బ్యాంకులు నోటీసులు జారీ చేస్తున్నట్టు చెప్తున్నారు. ఈ సమస్యలపై ప్రజావాణిలో ఫిర్యాదులు వస్తున్నాయి. ఆఫీసర్లు మాత్రం సరిచేయటం లేదని రైతులు  వాపోతున్నారు. 

భూమిని చూసి పోయిండ్రట 

మా తండ్రి చాలా ఏండ్ల కింద  ఏడెకరాల భూమి కొన్నాడు. దాన్ని   ఇద్దరు  అన్నదమ్ములం పంచుకున్నాం. పాత, కొత్త పట్ట బుక్కులు కూడా  వచ్చాయి. పాత బుక్స్​ ఉన్నప్పుడే నేను బ్యాంక్​లో లోన్​ తీసు కున్నా. ఇప్పుడు నా భూమి వివరాలు ఆన్​లైన్లో కనిపిస్తలేవు. మా అన్నది మాత్రం కనిస్తోంది. భూమి ఆన్​లైన్లో కనిపిస్తలేదని బ్యాంక్​ వాళ్లు  లోన్​ అమౌంట్​ చెల్లించాలని నోటిసు ఇచ్చిన్రు. ఒక సారి వచ్చి మా భూమిని ఫారెస్టు వాళ్లు వచ్చి చూసి పోయారట. రెవెన్యూ సార్లను అడిగితే సరిగ్గా చెప్పట్లేదు.
-తత్తుల శీను- ఎల్లారెడ్డిపేట్​