పోలీస్ ​ఉద్యోగాల వేటలో కుప్పకూలిన ప్రాణాలు

పోలీస్ ​ఉద్యోగాల వేటలో కుప్పకూలిన ప్రాణాలు

టార్గెట్​ ఛేదించి ఒకరు..మధ్యలో మరొకరు గుండెపోటుతో మృతి 

యాదగిరిగుట్ట/ వరంగల్​సిటీ, వెలుగు : కానిస్టేబుల్​ జాబ్స్​ కోసం ప్రయత్నించిన రెండు నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పోలీస్ ​రిక్రూట్​మెంట్​ నోటిఫికేషన్ రావడంతో ఎలాగైనా ఉద్యోగం కొట్టాల్సిందేనని కష్టపడ్డారు. ఇప్పుడు కాకపోతే మళ్లీ సాధిస్తామో లేదోనన్న భయం వారిని వెంటాడింది. దీంతో 1600 మీటర్ల పరుగు పందాన్ని పూర్తి చేసి ఒకరు..మధ్యలోనే మరొకరు విగతజీవులయ్యారు. గుండెపోటుతో సొమ్మసిల్లి పడిపోయి దవాఖానాల్లో చికిత్స పొందుతూ చనిపోయారు. నల్గొండ, వరంగల్​ జిల్లాల్లో జరిగిన ఈ ఘటనలు రెండు కుటుంబాల్లో విషాదాన్ని మిగిల్చాయి.  

నల్గొండలో యాదాద్రి జిల్లా వాసి....

యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లికి చెందిన ముడుగుల సతీష్ (30) సోమవారం నల్గొండలో నిర్వహించిన కానిస్టేబుల్ ఈవెంట్స్ లో పాల్గొన్నాడు. మొదటగా నిర్వహించిన 1600 మీటర్ల పరుగు పందెంలో పాల్గొన్నాడు. పరిగెడుతూనే మధ్యలో కుప్పకూలాడు. అక్కడే ఉన్న పోలీసులు నల్గొండ ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ దవాఖానాకు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో చనిపోయాడు. 

భార్య నాలుగు నెలల గర్భిణి..

తమ కొడుకు పోలీస్ అవుతాడని కలలు కన్న సతీశ్​తల్లిదండ్రులు.. అతడు శవమై ఇంటికి రావడంతో తట్టుకోలేకపోయారు. ‘కొడుకా ఈ వయస్సులో మాకెందుకీ గోస’ అని విలపించారు. కాగా, సతీశ్​కు ఏడాది కిందే పెండ్లి కాగా, భార్య ప్రస్తుతం నాలుగు నెలల గర్భిణి. కాగా గత సంవత్సరం నిర్వహించిన కానిస్టేబుల్ ఈవెంట్స్ లో సతీశ్​ క్వాలిఫై అయినా రాతపరీక్షలో తప్పాడు. మళ్లీ జాబ్​ కోసం కష్టపడినా ప్రాణాలు పోగొట్టుకున్నాడు.  

వరంగల్ ​జిల్లాలో ములుగు వ్యక్తి..

ములుగు జిల్లా ములుగు మండలం శివతండాకు చెందిన బానోతు రాజేందర్ (25) ప్రిలిమినరీ ఎగ్జామ్​లో పాసై ఈ నెల17న ఈవెంట్స్​ కోసం వరంగల్​వచ్చాడు. 1600 మీటర్ల పరుగు పందెం లక్ష్యాన్ని 7 నిమిషాల 15 సెకన్లలో ఛేదించాల్సి ఉండగా, 6 నిమిషాల 51 సెకన్లలోనే కంప్లీట్​ చేశాడు. కానీ ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. ఛాతిలో నొప్పి రావడంతో పడిపోయాడు. అతడిని వరంగల్​ఎంజీఎంకు తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం చనిపోయాడు.  

తండ్రి లేని వాళ్లయిన పిల్లలు

శివ తండాలో బానోతు సుక్య, మీట్యానాయక్​కు పెద్ద కొడుకైన రాజేందర్ కు నాలుగేండ్ల కింద పెండ్లయ్యింది. భార్య సుజాతతోపాటు మూడేండ్ల కొడుకు, ఏడాది వయస్సున్న బిడ్డ ఉన్నారు. పోలీసు ఉద్యోగం పొందాలని ఆశపడ్డ రాజేందర్ ​ములుగు పోలీసుశాఖ ఆధ్వర్యంలో జాకారం వైటీసీలో సుమారు ఆరు నెలల పాటు శిక్షణ తీసుకున్నాడు. ప్రభుత్వం రాజేందర్​ కుటుంబాన్ని ఆదుకోవాలని రాజకీయ, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్​ చేస్తున్నారు. నాణ్యమైన వైద్యం అందించి ఉంటే బతికేవాడని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలని నంగారాభేరి రాష్ట్ర నాయకులు డిమాండ్ చేశారు.