కంట తడిపెట్టిన సింగం

కంట తడిపెట్టిన సింగం

తమిళ స్టార్‌ హీరో సూర్య కేవలం నటుడిగానే కాకుండా.. సామాజిక సేవలతోనూ గుర్తింపు తెచ్చుకున్నారు. అగరం ఫౌండేషన్‌ ద్వారా పేద విద్యార్థులకు చదువు చెప్పించేందుకు ఆయన కృషి చేస్తున్నారు. గత పదేళ్లుగా ఆయన ఈ ఫౌండేషన్‌ను నిర్వహిస్తున్నారు.

ఇందులో భాగంగానే చెన్నైలో అగరం ఫౌండేషన్‌ తరఫున రెండు పుస్తకాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి సూర్య హాజరయ్యారు. ఈ సందర్భంగా తన ఫౌండేషన్ ద్వారా సాయం అందుకున్న గాయత్రి అనే బాలిక జీవితగాథను ఆమె మాటల్లోనే విన్న సూర్య కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఓ చిన్న పల్లెటూర్లో పుట్టిన తాను ప్రస్తుతం ఇంగ్లీష్ టీచర్ గా పనిచేస్తున్నానని చెప్పారు. రోజు కూలీ కడుపున పుట్టిన తాను ఎన్నో కష్టాలు పడి కాలేజ్ విద్య పూర్తి చేశానని గాయత్రి తెలిపారు. అందుకు కారణం అగరం ఫౌండేషన్ అని, ఎక్కడో అనామకురాలిగా ఉన్న తాను ఎన్నో అడ్డంకులను అధిగమించానని, ఈ ప్రస్థానంలో అగరం ఫౌండేషన్ తోడ్పాటు మరువలేనని తెలిపింది. ఆమె దయనీయ గాథను విన్న సూర్య తీవ్ర భావోద్వేగాలకు లోనయ్యారు. కన్నీళ్లు పెడుతూ, లేచి వెళ్లి గాయత్రిని ప్రేమతో దగ్గరికి తీసుకున్నారు.