బాల రాముడికి సూర్య తిలకం

బాల రాముడికి సూర్య తిలకం

అయోధ్య: ఉత్తరప్రదేశ్ అయోధ్యలోని రామాలయంలో శ్రీరామ నవమి వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ప్రాణప్రతిష్ఠ తరువాత తొలిసారి శ్రీరామనవమి కావడంతో ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు. రామ్​లల్లా నుదుటిపై ‘సూర్య తిలకం’ అద్భుత దృశ్యాన్ని చూసి భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. మూడో అంతస్తు నుంచి సూర్య కిరణాలు నేరుగా బాలరాముడి నుదుటిపై పడేలా పది మంది సైంటిస్టుల బృందం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అడ్వాన్స్ డ్​ సైంటిఫిక్ టెక్నాలజీ సాయంతో స్పెషల్ సెటప్ డిజైన్ చేసింది. మధ్యాహ్నం 12:15 గంటలకు 5.8 సెం.మీ. పొడవులో సూర్య కిరణాలు రామ్​లల్లా నుదుటిపై పడ్డాయి. 

దాదాపు 3.50 నిమిషాల పాటు ఈ ‘సూర్య తిలకం’ భక్తుల కనువిందు చేసింది. విదేశాల నుంచి తెప్పించిన అద్దాలు, లెన్స్ ఉపయోగించి థర్డ్ ఫ్లోర్ నుంచి సూర్యకాంతి నేరుగా బాలరాముడి నుదుటిపైకి మళ్లించడం ద్వారా ‘సూర్య తిలకం’ ఘట్టం పూర్తయింది. ఆ తర్వాత నవమి సందర్భంగా అర్చకులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌‌‌‌ సభ్యుల కోరిక మేరకు సైంటిస్టుల టీమ్ సూర్య తిలకం ఆవిష్కరింపజేసింది. ప్రతి శ్రీరామ నవమి రోజు మధ్యాహ్నం పూట సూర్యతిలకం వచ్చేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 

కాగా, ‘సూర్య తిలక్‌‌‌‌’ వేడుకను ప్రధాని మోదీ అస్సాంలో చూశారు. ప్రచార ర్యాలీలో పాల్గొన్న తర్వాత హెలికాప్టర్‌‌‌‌లో ప్రయాణిస్తూ ఈ అపురూప ఘట్టాన్ని వీక్షించారు. అయోధ్య చరిత్రలోనే అత్యంత ఘనమైన రామనవమి ఉత్సవం ఇదే అని, ఈ సూర్యతిలకం వికసిత భారతం తీసుకునే ప్రతీ సంకల్పాన్ని తన దివ్య శక్తితో మరింత ప్రకాశవంతం చేస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. వీడియోను ట్విట్టర్​లో షేర్ చేశారు. యూపీ సీఎం యోగి ప్రజలకు నవమి శుభాకాంక్షలు చెప్పారు. సూర్య తిలకం వీడియోను షేర్ చేసి ఆనంద వ్యక్తం చేశారు.