వెయ్యి పరుగులు చేసిన ఏకైక భారత క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్

వెయ్యి పరుగులు చేసిన ఏకైక భారత క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్

క్రికెట్లో మిస్టర్ 360 అంటే ఠక్కున గుర్తొచ్చేది సౌతాఫ్రికా మాజీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్. క్రీజులో ఏబీ ఉన్నాడంటే...ప్రేక్షకులు పండగ చేసుకుంటారు. మైదానానికి అన్ని వైపులా డివిలియర్స్ కొట్టే షాట్లు..చూడముచ్చటగా ఉంటాయి. అందుకే వరల్డ్ క్రికెట్ లో ఏబీ మిస్టర్ 360గా పేరు సంపాదించాడు. అయితే ప్రస్తుత క్రికెట్లో డివిలియర్స్నే మరిపిస్తున్నాడు టీమిండియా స్టార్ బ్యాట్స్మన్ సూర్యకుమార్ యాదవ్ . బౌలర్లను చితక్కొడుతూ...మిస్టర్ 360గా పేరు తెచ్చుకున్నాడు. 
 
సూపర్ ఫాంలో...
సూర్యకుమార్ యాదవ్..ప్రస్తుతం ఈ పేరు చెబితే బౌలర్లకు నిద్రపట్టడం లేదు. సూర్య ప్రస్తుతం టీమిండియాలోనే అత్యంత అద్భుతమైన ఫాంలో ఉన్న క్రికెటర్. టీమ్ లోకి వచ్చినప్పటి నుంచి సూర్య సూపర్గా ఆడుతున్నాడు. ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ఈ నేపథ్యంలోనే టీ20 ఫార్మాట్లో ఒక కాలెండర్ ఇయర్లో వెయ్యికి పైగా పరుగులు చేసిన తొలి భారత క్రికెటర్గా సూర్యకుమార్ యాదవ్ రికార్డు సృష్టించాడు. 

అగ్రస్థానంలో సూర్య..
2022లో సూర్యకుమార్ యాదవ్..ఇప్పటి వరకు 28 మ్యాచులు ఆడాడు. 28 ఇన్నింగ్స్‌లలో వెయ్యి పరుగుల  మైలురాయిని అందుకున్నాడు. ప్రస్తుతం సూర్య  ఖాతాలో 1026 పరుగులున్నాయి. సూర్య తర్వాతి స్థానాల్లో మహ్మద్ రిజ్వాన్ 924 పరుగులతో రెండో స్థానంలో.... కోహ్లీ 731 పరుగులతో మూడో స్థానంలో... పాథుమ్ నిశ్శంక 713 పరుగులతో నాల్గో స్థానంలో...సికందర్ రజా 701 పరుగులతో ఐదో స్థానంలో ఉన్నారు. మొత్తం 2021లో టీ20 క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన సూర్య..ఇప్పటి వరకు 39 మ్యాచులు ఆడాడు. 42.23 సగటుతో 1270 పరుగులు సాధించాడు. 

టీ20 వరల్డ్ కప్ 2022లో రెచ్చిపోతున్న సూర్య..
టీ20 ప్రపంచకప్‌లో సూర్యకుమార్ యాదవ్  జోరు కొనసాగిస్తున్నాడు. తొలి మ్యాచ్లో పాక్పై కేవలం 15 పరుగులే చేసినా...నెదర్లాండ్స్పై కేవలం 25 బంతుల్లోనే 51 పరుగులు సాధించాడు. ఆ తర్వాత సౌతాఫ్రికాపై 40 బంతుల్లో 68 పరుగులతో రాణించి జట్టును ఆదుకున్నాడు. బంగ్లాదేశ్పై 30 పరుగులతో పర్వాలేదనిపించాడు. రీసెంట్గా జింబాబ్వేపై 61 రన్స్ చేశాడు. మొత్తంగా ఇప్పటి వరకు ఐదు మ్యాచుల్లో 225 పరుగులు సాధించడం విశేషం. ఇందులో మూడు అర్థసెంచరీలున్నాయి.