
ఆగస్టు నెలలో భారత క్రికెట్ జట్టు బంగ్లాదేశ్ గడ్డపై వన్డే, టీ20 సిరీస్ ఆడనుంది. ఈ పర్యటనలో భాగంగా మొత్తం మూడు వన్డేలతో పాటు మూడు టీ20 మ్యాచ్ లు ఆడనుంది. ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ ముగిసిన వెంటనే టీమిండియా బంగ్లాదేశ్ కు వెళ్తుంది. ఆగస్టు నెలలో బంగ్లాదేశ్ తో జరగబోయే టీ20 సిరీస్ కు టీ20 కెప్టెన్ సూర్య దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సూర్య కుమార్ వరుస సర్జరీలతో ఇబ్బందిపడుతున్నాడు. గురువారం (జూన్ 26) జర్మనీలోని మ్యూనిచ్‌లో సూర్య స్పోర్ట్స్ హెర్నియా ఆపరేషన్ విజయవంతంగా ముగిసింది. ‘కుడి వైపు పొత్తి కడుపులో ఉన్న హెర్నియాకు డాక్టర్లు విజయవంతంగా సర్జరీ చేశారు.
మూడేళ్లలో సూర్యకుమార్‌కు ఇది మూడో సర్జరీ. 2023లో చీలమండకు ఆపరేషన్ చేయించుకున్న అతను 2024లోనూ స్పోర్ట్స్ హెర్నియాకు చికిత్స తీసుకున్నాడు. సర్జరీ చేయడంతో ఈ టీమిండియా టీ20 కెప్టెన్ ఎప్పుడు పూర్తిగా కోలుకుంటాడో ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఈ ఆపరేషన్ తర్వాత రెండు వారాల్లో బెంగళూరులోని ఎన్‌సీఏలో రిహాబిలిటేషన్ మొదలుపెట్టనున్నాడు. బంగ్లాదేశ్ తో సిరీస్ కావడంతో ఈ సిరీస్ సమయానికి కోలుకున్నా సూర్యకు రెస్ట్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే ప్రస్తుతం భారత జట్టుకు వైస్ కెప్టెన్ గా ఉన్న అక్షర్ పటేల్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టవచ్చు.
ఈ ఏడాది ప్రారంభంలో ఇంగ్లాండ్ తో జరిగిన టీ20 సిరీస్ కు అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు. ఒకవేళ అక్షర్ కాకపోతే శుభమాన్ గిల్ కెప్టెన్ గా జట్టును నడిపించవచ్చు. ఆగస్టు 26న బంగ్లాదేశ్‌తో మూడు టీ20ల సిరీస్‌లో తలపడనుంది. 2026 లో భారత్ వేదికగా టీ20 వరల్డ్ కప్ జరగనుండడంతో ఈ సిరీస్ కు భారత క్రికెట్ జట్టు పూర్తి స్థాయి జట్టుతోనే బరిలోకి దిగే అవకాశం ఉంది. మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ ఆగస్ట్ 26 న చట్టోగ్రామ్ వేదికగా జరుగుతుంది. ఆగస్టు 29, ఆగస్టు 31 న వరుసగా రెండు, మూడు టీ20 మ్యాచ్ లు జరుగుతాయి. ఆగస్టు 17 నుంచి 23 మధ్యలో మొదటగా వన్డే సిరీస్ జరుగుతుంది.
2025లో బంగ్లాదేశ్ పర్యటనకు భారత జట్టు షెడ్యూల్:
ఆగస్టు 17.. భారత్ వర్సెస్ బంగ్లాదేశ్.. తొలి వన్డే.. మీర్పూర్
ఆగస్టు 20.. భారత్ వర్సెస్ బంగ్లాదేశ్.. రెండో వన్డే.. మీర్పూర్
ఆగస్టు 23.. భారత్ వర్సెస్ బంగ్లాదేశ్.. మూడో వన్డే.. చట్టోగ్రామ్
ఆగస్టు 26 భారత్ వర్సెస్ బంగ్లాదేశ్.. తొలి టీ20.. చట్టోగ్రామ్
ఆగస్టు 29 భారత్ వర్సెస్ బంగ్లాదేశ్.. 2వ టీ20.. మీర్పూర్
ఆగస్టు 31 భారత్ వర్సెస్ బంగ్లాదేశ్.. 3వ టీ20.. మీర్పూర్