సిడ్నీ: టీమిండియా వన్డే టీమ్ వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గాయంపై భారత టీ20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ బిగ్ అప్డేట్ ఇచ్చాడు. ఆస్ట్రేలియా, ఇండియా మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనున్న విషయం తెలిసిందే. తొలి టీ20 సందర్భంగా సోమవారం (అక్టోబర్ 28) కాన్ బెర్రాలో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో సూర్య పాల్గొన్నాడు. ఈ సందర్భంగా అయ్యర్ హెల్త్ కండిషన్‌పై స్కై మాట్లాడుతూ.. శ్రేయస్ అయ్యర్ ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు చాలా మెరుగ్గా ఉందని.. అతడిని ఐసీయూ నుంచి జనరల్ వార్డుకు షిఫ్ట్ చేశారని తెలిపాడు.
అయ్యర్ అందరితో ఫోన్ మాట్లాడుతున్నాడని చెప్పాడు. అతడు త్వరగా కోలుకుంటున్నాడని.. టీ20 సిరీస్ ముగిసిన తర్వాత అయ్యర్‌ను మాతో పాటే ఇంటికి తీసుకెళ్తామని పేర్కొన్నాడు. శ్రేయస్ గాయం గురించి తెలియగానే మా ఫిజియో కమలేష్ జైన్‌కు ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నానని తెలిపాడు. ఈ ఘటన చాలా దురదృష్టకరమని.. అయ్యర్ లాంటి అరుదైన వ్యక్తులకు అరుదైన గాయాలు సంభవిస్తాయని పేర్కొన్నాడు.
కాగా, సిడ్నీ వేదికగా ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మూడో వన్డేలో ఫీల్డింగ్ చేస్తూ శ్రేయస్ అయ్యర్ గాయపడ్డ విషయం తెలిసిందే. క్యాచ్ పట్టే క్రమంలో కిందపడటంతో అయ్యర్ పక్క టెముకలకు తీవ్ర గాయమైంది. దీంతో అతడిని వెంటనే సిడ్నీలోని ఆసుపత్రిగా తరలించగా.. స్కానింగ్‌లో అయ్యర్ కు ఇంటర్నల్ బ్లీడింగ్ అయినట్లు తేలింది.
గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఐసీయూలో ట్రీట్మెంట్ అందించారు. ఆరోగ్యం మెరుగుపడటంతో అయ్యర్ ను ఐసీయూ నుంచి జనరల్ వార్డుకు షిఫ్ట్ చేసినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. అయితే.. అయ్యర్ ఆసుపత్రి నుంచి పూర్తిగా డిశ్చార్జ్ కావడానికి మరికొన్ని రోజులు పట్టవచ్చని సమాచారం.
