పాక్ ప్లేయర్ రికార్డును బద్దలు కొట్టిన సూర్యకుమార్ యాదవ్

పాక్ ప్లేయర్ రికార్డును బద్దలు కొట్టిన సూర్యకుమార్ యాదవ్

టీమిండియా 360 డిగ్రీస్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ టీ20ల్లో దూసుకుపోతున్నాడు. ప్రతీ మ్యాచ్లో సూపర్ ఇన్నింగ్స్లు ఆడుతూ..జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. టీ20 వరల్డ్ కప్లో మొదటి మ్యాచ్లో 15 పరుగులే చేసిన  సూర్య..నెదర్లాండ్స్తో జరిగిన మ్యాచ్లో ఏకంగా హాఫ్ సెంచరీతో రెచ్చిపోయాడు. కేవలం 25 బంతుల్లోనే 51 పరుగులు చేసి..భారత్కు భారీస్కోరును అందించాడు. ఈ హాఫ్ సెంచరీతో  ఈ ఏడాది టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. 

రిజ్వాన్ను వెనక్కునెట్టిన సూర్య..
2022లో  టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో సూర్యకుమార్ యాదవ్ మొదటి స్థానంలో ఉన్నాడు.  2022లో  ఇప్పటి వరకు 25 టీ20లు ఆడిన సూర్యకుమార్ యాదవ్..41.28 సగటుతో 867 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీతో పాటు..7 అర్థసెంచరీలుండటం విశేషం. ఈ జాబితాలో సూర్య తర్వాత పాక్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ రెండో ప్లేస్లో కొనసాగుతున్నాడు. అతను ఇప్పటి వరకు 20 టీ20ల్లో  51.56 సగటుతో 839 పరుగులు చేశాడు. ఇందులో 9 హాఫ్ సెంచరీలున్నాయి.  

ఐదో స్థానంలో కోహ్లీ..
టీ20 వరల్డ్ కప్లో వరుసగా రెండు సూపర్ హాఫ్ సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ...ఈ ఏడాది టీ20ల్లో అత్యధిక రన్స్ చేసిన జాబితాలో ఐదో స్థానంలో నిలిచాడు. 2022లో కోహ్లీ 16 ఇన్సింగ్స్లలో 57.18 సగటుతో 629 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీతో పాటు..6 అర్థసెంచరీలున్నాయి. కోహ్లీ కంటే ముందు జింబాబ్వే ప్లేయర్ సికిందర్ రజా ఉన్నాడు. అతను19 ఇన్నింగ్స్లలో 38.35 సగటుతో 652 పరుగులు సాధించాడు. ఆ తర్వాత  శ్రీలంక క్రికెటర్ నిస్సంక 21 మ్యాచుల్లో 31.80 సగటుతో 636 పరుగులతో నాల్గో ప్లేస్లో ఉన్నాడు. 

సూర్య వర్సెస్ రిజ్వాన్..
టీ20ల్లో ఈ ఏడాది అత్యధిక పరుగులు చేసిన టాప్ బ్యాట్స్మన్ స్థానం కోసం సూర్యకుమార్ యాదవ్, రిజ్వాన్ మధ్య పోటీ నెలకొంది. ప్రస్తుతం సూర్య మొదటి స్థానంలో ఉండగా...రిజ్వాన్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. అయితే వీరిద్దరి మధ్య కేవలం 28 పరుగుల తేడాతో మాత్రమే ఉంది. ఇద్దరు సూపర్ ఫాంలో ఉండటంతో పాట...ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ జరుగుతుండటంతో...ఇద్దరిలో ఎవరు అత్యధిక పరుగులతో ఈ ఏడాదిని ముగిస్తారో అని అభిమానులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.