క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరుస్తాం : తేజస్ నంద్ లాల్ పవార్ 

క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరుస్తాం : తేజస్ నంద్ లాల్ పవార్ 
  • విద్య, వైద్యంపై స్పెషల్ ఫోకస్ పెడతాం
  • గ్రీవెన్స్ లో సమస్య పరిష్కారానికి ప్రాధాన్యత
  • వెలుగు ఇంటర్వ్యూలో సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ 

సూర్యాపేట, వెలుగు: అధికారులను సమన్వయం చేసుకుంటూ ప్రజలకు ప్రజాపాలన అందించడమే తన లక్ష్యమని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. జిల్లాలో ప్రజలకు అత్యవసరమైన విద్య, వైద్యంపై స్పెషల్ ఫోకస్ పెడుతూ ప్రజల సమస్యలను పరిష్కరిస్తానని చెప్పారు. ముఖ్యంగా సర్కారు స్కూళ్లలో ఎన్ రోల్ మెంట్ పెంచేందుకు కృషి చేస్తానన్నారు. ఇటీవల బదిలీల్లో భాగంగా శుక్రవారం సూర్యాపేట జిల్లాకు వచ్చిన ఆయన బాధ్యతలు చేపట్టాక తొలిసారి వెలుగుతో ముచ్చటించారు.  

ప్రజాపాలన ప్రజలకు చేరుస్తాం..

ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా పాలన ప్రజలకు అందేలా పనిచేస్తాం. అడ్మినిస్ట్రేషన్ ఫర్ పీపుల్... ఆఫీసర్లు ప్రజల కోసం పనిచేయాలి.. అప్పుడే అర్హులకు ప్రభుత్వ పథకాలు చేరుతాయి. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందిస్తూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తాం. ముఖ్యంగా గ్రీవెన్స్ లో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తాం. ప్రజా సమస్యలపై ప్రతి వారం డిపార్ట్​మెంట్ల వారీగా అధికారులతో రివ్యూ నిర్వహించి వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకుంటాం. అధికారులంతా సమష్టిగా జిల్లా అభివృద్ధికి కృషిచేయాలి. 

విద్య, వైద్యంపై స్పెషల్ ఫోకస్.. 

ప్రభుత్వ పాఠశాలలో ఎన్ రోల్ మెంట్ పెంచేలా ప్రణాళికతో ముందుకెళ్తాం. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పిస్తాం. విద్య, వైద్యంపై స్పెషల్ ఫోకస్ పెడతాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పని చేసే డాక్టర్ల విషయంలో కఠినంగా వ్యవహరిస్తాం. జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలు మరింత మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకుంటాం. అధికారులు, వైద్యుల సమయ పాలనపై దృష్టి పెడతాం. వారంలో రెండు రోజులు ఆస్పత్రులను సర్ ప్రైజ్ విజిట్​ చేస్తాం. అన్ని మండలాల్లో పర్యటిస్తా. వానాకాలంలో సీజనల్ వ్యాధులు వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. వీటిని కంట్రోల్ చేయడానికి శానిటైజేషన్ మెరుగుపర్చుతాం. అంటు వ్యాధులను అరికట్టడానికి ప్రతిఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. 

ధరణి సమస్యలను పరిష్కరిస్తాం..

ధరణి పెండింగ్ ఫైళ్లను గడువులోపు క్లియర్ చేయడానికి చర్యలు తీసుకుంటాం. వివాదాలు, కోర్టు కేసులు ఉన్నవి మినహా మిగతా వాటిని త్వరగా పరిష్కరిస్తాం. భూములకు సంబంధించిన పొజిషన్ లో ఉన్న రైతులు, టైటిల్ పరిశీలన, న్యాయపరమైన అంశాలపై దృష్టి సారిస్తాం. ఏవైనా అప్లికేషన్లు రిజెక్ట్ చేయాల్సి వస్తే.. స్పష్టంగా తెలియజేస్తాం. భూముల సర్వేను ఆఫీసర్లు పక్కాగా చేయాలి. ఎక్కడా తప్పులు చేయకూడదని  ఆదేశాలు జారీ చేశాం.