
- రెండేండ్లుగా నిరుపయోగంగా సూర్యాపేట డీఎస్పీ ఆఫీసు
- ఆఫీస్ కొత్త బిల్డింగ్ నెలకు రూ.30 వేల రెంట్ కడుతున్నరు
- సొంత బిల్డింగ్ ఉన్నా ప్రారంభిస్తలేరు
సూర్యాపేట, వెలుగు: ఓ పక్క గవర్నమెంట్ ఆఫీసులు సొంత బిల్డింగులు లేక అద్దె భవనాల్లో కొనసాగుతుంటే మరో పక్క రూ.లక్షలు పెట్టి కట్టించిన సొంత బిల్డింగులు ఉన్నా అందులోకి వెళ్లడం లేదు. పక్కా భవనం నిర్మించి అప్పగించినా రెండేండ్లుగా అద్దె భవనంలో ఉంటూ జనం డబ్బును తేరగా అధికార పార్టీ లీడర్లకు దోచిపెడుతున్నారు సూర్యాపేట పోలీసులు.
2017లో పనులు ప్రారంభం
సూర్యాపేటలోని శాంతి నగర్ వద్ద ఉన్న పాత డీఎస్పీ ఆఫీసు శిథిలావస్థకు చేరడంతో కొత్త ఆఫీసు నిర్మాణానికి రూ. 63లక్షల వ్యయంతో 2017లో మంత్రి జగదీశ్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. పనులు మొదలైనా ఫండ్స్ విడుదలలో ఆలస్యం చేయడంతో 2018లో ఆరు నెలల పాటు కాంట్రాక్టర్ పనులను నిలిపేశాడు. మరోపక్క లాక్ డౌన్ తో అడ్డంకులు కలిగాయి. లాక్డౌన్ తర్వాత పనులను పూర్తి చేసిన కాంట్రాక్టర్ 2021లో డిపార్ట్మెంట్కు అప్పగించాడు.
ఎందుకు వెళ్లడం లేదంటే...
డీఎస్పీ ఆఫీస్ బిల్డింగ్ నిర్మించి రెండేండ్లవుతున్నా అందులోకి ఎందుకు వెళ్లడం లేదన్న దానిపై రకరకాల మాటలు వినిపిస్తున్నాయి. తాళ్లగడ్డలోని డీఎస్పీ ఆఫీస్ బిల్డింగ్ అధికార పార్టీకి చెందిన లీడర్ ది కావడంతో ఆయనకు రెంట్ పోతదనే ఉద్దేశంతోనే షిఫ్ట్ కావడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఆఫీసుకు నెలకు రూ.30 వేలకు పైగా అద్దె చెల్లిస్తుండగా, రెండేండ్ల కింద కొత్త బిల్డింగ్ హ్యాండోవర్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు లెక్క వేసినా సుమారు రూ.7.20 లక్షలు సదరు లీడర్‌కు చెల్లించారు. ఇదంతా వృథా ఖర్చే. గతంలో సూర్యాపేట ఎస్పీగా పని చేసిన ఓ అధికారి ముఖ్య ప్రజాప్రతినిధిని సంప్రదించకుండా ప్రారంభోత్సవ ముహూర్తం ఖరారు చేయడంతో ప్రజాప్రతినిధి నొచ్చుకున్నట్టు సమాచారం. ఈ విషయంలో పోలీస్ బాస్ పై ఆగ్రహం వ్యక్తం చేయడంతో ప్రారంభాన్ని రద్దు చేసినట్లు తెలిసింది. అప్పటి నుంచి పోలీస్ అధికారులు డీఎస్పీ ఆఫీస్ ఓపెనింగ్‌పై నోరు మెదపడం లేదన్న ఆరోపణలున్నాయి.