
- రాజకీయ పార్టీల ర్యాలీలకు అనుమతి తప్పనిసరి
- రూ. 50 వేలకు మించి తీసుకెళితే సంబంధిత పత్రాలు చూపాల్సిందే
- పెయిడ్ ఆర్టికల్స్ పై పర్యవేక్షణ
సూర్యాపేట, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికలు సక్రమంగా నిర్వహించేందుకు ఆఫీసర్లు రెడీ అవుతున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఎంపీటీసీ, జడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించడంతో సోమవారం నుంచి జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందని జిల్లా సూర్యాపేట కలెక్టర్ తేజస్ నందులాల్ పవార్ తెలిపారు. మంగళవారం జిల్లా కలెక్టర్ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై మీడియా తో చిట్ చాట్ నిర్వహించారు.
జిల్లాలో ఉన్న మూడు డివిజన్లలో ని 23 మండలాల జడ్పీటీసీలకు, 235 ఎంపీటీసీలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు చెప్పారు. 486 గ్రామపంచాయతీలకు, 4388 వార్డు సభ్యులకు ఎన్నికలు ఉంటాయన్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు రెండు విడతల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. మొదటి విడత సూర్యాపేట డివిజన్ సంబంధించి అక్టోబర్ 9న ,2 వ విడత కోదాడ, హుజూర్‌నగర్ కు సంబంధించిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇస్తామన్నారు.
మొత్తం 6,94,815 మంది ఓటర్లు
సూర్యాపేట జిల్లాలో మొత్తం 6,94,815 మంది ఓటర్లు ఉన్నారని ఇందులో 3,40743 మంది పురుష ఓటర్లు ,354050 మంది మహిళా ఓటర్లు ఉన్నట్లు చెప్పారు. జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలకు 4403 పోలింగ్ కేంద్రాలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు 1272 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. 541 పోలింగ్ లొకేషన్లు ఉన్నట్లు వెల్లడించారు. ఎన్నికల నిర్వహణకు బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ సిబ్బంది స్టేజీ వన్, స్టేజ్ 2 అధికారులకు శిక్షణ కార్యక్రమాలను పూర్తి చేశామన్నారు.
ఆర్ఓ, పిఓ శిక్షణ కార్యక్రమాలు మండలాల వారీగా పూర్తి చేయనున్నట్లు తెలిపారు. మండల స్థాయిలో పీవో ట్రైనింగ్స్ పూర్తి చేస్తామన్నారు. ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీని పకడ్బందీగా అమలు చేస్తామని, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా పాటించాలని ఆయన కోరారు. ఎన్నికలకు సంబంధించిన సామాగ్రి ప్రచురించే విషయంలో ప్రింటింగ్ ప్రెస్ లు పూర్తి వివరాలను ప్రదర్శించాలన్నారు.
కొత్త పనులకు బ్రేక్
స్ధానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటనతో జిల్లాలో కొత్త పనులు అమలు నిలిపివేస్తున్నట్లు చెప్పారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వపరంగా ఎలాంటి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించడానికి వీలు లేదని తేల్చి చెప్పారు. ఇప్పటికే అమలులో ఉన్న పాత పథకాలు, పనులు మాత్రం యథావిధిగా కొనసాగుతాయన్నారు. రూ. 50 వేల కు మించి తీసుకెళితే కచ్చితంగా సంబంధిత పత్రాలు చూపాలన్నారు.
రాజకీయ పార్టీల సమావేశాలు, ర్యాలీలకు అనుమతి తప్పనిసరి
జిల్లాలో ఎన్నికల కోడ్ నేపథ్యంలో రాజకీయ పార్టీలు నిర్వహించే ఏ సమావేశం, ర్యాలీకైనా ఎన్నికల సంఘం అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉందన్నారు. రాజకీయ పార్టీల మీటింగ్‌లు, ర్యాలీలు, ముందస్తు అనుమతి తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. మీడియాలో వచ్చే పెయిడ్ ఆర్టికల్స్ పై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉంటుందన్నారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ కె. సీతారామారావు, జడ్పీ సీఈ అప్పారావు, డీపీఓ యాదగిరి, నల్గొండ అసిస్టెంట్ డైరెక్టర్, సూర్యాపేట డీపీఆర్‌ఓ వెంకటేశ్వర్లు, జిల్లా సమాచార ఇంజినీర్ మల్లేశం, డిప్యూటీ సీఈఓ శిరీష, డివిజనల్ పంచాయతీ అధికారి నారాయణరెడ్డి, తదితరులు ఉన్నారు.
యాదాద్రి, వెలుగు : లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లలో ఆఫీసర్లు బిజీ బిజీగా ఉన్నారు. ఈ ఎన్నికలకు సంబంధించి కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్‌ను అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి ప్రారంభించారు. దీనికి 89789 28637 నెంబర్‌ను కేటాయించారు. ఆలేరులోని స్ట్రాంగ్ రూమ్‌ను అడిషనల్ కలెక్టర్ ఏ భాస్కరరావు పరిశీలించారు. ఇప్పటికే సిద్ధంగా ఉంచిన బ్యాలెట్ బాక్స్‌లను ఆయన పరిశీలించారు.