మీడియాలో రోత రాతలు : జగదీశ్​ రెడ్డి

మీడియాలో రోత రాతలు : జగదీశ్​ రెడ్డి

 యాదాద్రి, వెలుగు: అధికార పార్టీకి అనుకూలంగా మీడియాలో ఒకరిద్దరు తీటగాండ్లు రోత రాతలు రాస్తున్నారని సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్​ రెడ్డి అన్నారు. యాదాద్రి జిల్లా భువనగిరిలో జరిగిన పార్లమెంట్​ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నా, పంటలు ఎండిపోతున్నా ఆ సమస్యలను ప్రధాన పత్రికలు, టీవీల్లో రాకుండా చేస్తున్నారని ఆరోపించారు. కాళేశ్వరం, కరెంట్​, ఫోన్​ ట్యాపింగ్​ అంటూ లేని సమస్యలను మరీ ఫస్ట్​ పేజీల్లో రాయిస్తున్నారని ఫైర్​ అయ్యారు.

20, 30 ఏండ్ల కిందే ఫోన్​ ట్యాపింగ్ మొదలైనా, ఏదో​ ఇవ్వాళే మొదలైనట్లు రాస్తున్నారన్నారు. ‘దమ్ముంటే ఫోన్​ ట్యాపింగ్​ మొదలు పెట్టిన వాడిని పట్టుకొని రమ్మనండి’ అని సవాల్​ విసిరారు. ప్రజలను తప్పుదోవ పట్టించడానికే ఫోన్ ట్యాపింగ్ డ్రామా ఆడుతున్నారని విమర్శించారు.  ఎన్ని కేసులు పెట్టినా కేసీఆర్​ వెంట్రుక కూడా పీకలేరన్నారు. కేసీఆర్​ బయటకు వచ్చి ప్రశ్నించగానే బీజేపీ లాగు తడిచిపోయిందని, వెంటనే ధర్నా చేశారని ఎద్దేవా చేశారు. ‘ప్రజలకు ఇచ్చిన 429 హామీలను అమలు చేయని కాంగ్రెస్​ నేతలు రండలు.. ఆ రండల లాగులను ప్రజలే ఉడబీకుతురు’ అంటూ తిట్ల పురాణం అందుకున్నారు.

జిల్లాలో పంటలు ఎండుతుంటే వీధికుక్కలాంటి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్​, బీజేపీ ఇద్దరు దొంగలేనని, వీరిద్దరూ  ఒక్కటై కేసీఆర్​, కేజ్రీవాల్​ను లేకుండా చేయాలని కుట్ర పన్నుతున్నారని జగదీశ్​రెడ్డి ఆరోపించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్​రెడ్డి అధ్యక్షతన జరిగిన మీటింగ్​లో బీఆర్​ఎస్​ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశ్​, మాజీ  ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్​, కంచర్ల రామకృష్ణారెడ్డి, చింతల వెంకటేశ్వర్​రెడ్డి, కొలుపుల అమరేందర్​ ఉన్నారు.