
- నిందితుల వద్ద 14 కిలోలకుపైగా గంజాయి స్వాధీనం
సూర్యాపేట, వెలుగు : ఏపీలోని వైజాగ్, అరకు ప్రాంతాల నుంచి గంజాయి కొనితెచ్చి సూర్యాపేటలో అమ్ముతున్న ముఠాను జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఏడుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించగా, నలుగురు నిందితులు పరారీలో ఉన్నారు. వీరి వద్ద రూ.2.95 లక్షల విలువైన12 కేజీల గంజాయి, 6 సెల్ ఫోన్లు, 1 స్కూటీ స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ నరసింహ శుక్రవారం మీడియాకు వివరాలు తెలిపారు. సూర్యాపేట టౌన్ కు చెందిన పిట్టల నాగరాజు, ఆది వంశీ మరో ఎనిమిది మందితో ముఠాగా ఏర్పడ్డారు. తలా కొంచెం డబ్బులు వేసుకుని గంజాయి తెచ్చి అమ్మేందుకు ప్లాన్ చేశారు. నాగరాజు, వంశీని అరకు ప్రాంతానికి పంపి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి రూ.24 వేలకు 13కేజీల గంజాయి కొని తెచ్చారు.
సూర్యాపేట శివారు నల్ల చెరువు వద్ద ముఠా చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి పంచుకుని ఒక్కటి రూ.500కు అమ్మాలనుకుంది. సమాచారం అందడంతో పోలీసులు వెళ్లి వారిని అదుపులోకి తీసుకున్నారు. పది మంది సభ్యుల ముఠాలో పిట్టల నాగరాజు, అంగోతు వంశీ, రెడ్డి పల్లి మధుసూదన్, కూతురు ఆకాశ్, శూర శ్రవణ్ కుమార్, గుండారపు శివను పట్టుకొని విచారించగా నేరం ఒప్పుకున్నారు. ఆది వంశీ, విశ్వనాథుల సాయికుమార్, దోసపాటి వంశీ, సారగండ్ల శివకార్తీక్ పరారీలో ఉన్నారు. వీరి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ సమావేశంలో డీఎస్పీ ప్రసన్నకుమార్, సీఐ వెంకటయ్య, సీసీఎస్ ఇన్ స్పెక్టర్ శివకుమార్, సిబ్బంది ఉన్నారు.
ప్యాకెట్లను పంచుకుంటూ పట్టుబడ్డారు..
హుజూర్ నగర్ : గంజాయి అమ్ముతున్న ముఠాను సూర్యాపేట జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి శుక్రవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. గరిడేపల్లి మండలం రాయినిగూడెం శివారులోని కాల్వపల్లి కి వెళ్లే రోడ్డులో డంపింగ్ యార్డ్ పక్కన గంజాయి అమ్ముతున్నారని పోలీసులకు సమాచారం అందింది. గరిడేపల్లి ఎస్ఐ నరేశ్ సిబ్బందితో నిఘాపెట్టారు. హుజూర్ నగర్ కు చెందిన బొల్ల బాలకృష్ణ, షేక్ నజీర్, కొప్పుల శ్రీకాంత్ పల్సర్ బైక్ పై వచ్చి గంజాయి ప్యాకెట్లను పంచుకుంటూ దొరికారు.
నిందితుల వద్ద 330 గ్రాముల గంజాయి, పల్సర్ బైక్ ను స్వాధీనం చేసుకుని విచారించారు. చిలుకూరు మండలం బేతవోలుకు చెందిన గణపారపు శ్రీకాంత్ వద్ద కొనుగోలు చేసినట్టు తెలిపారు. శ్రీకాంత్ ను అదుపులోకి తీసుకుని ఎంక్వైరీ చేయగా ఏపీలోని సీలేరు ప్రాంతంలో 4 కేజీల గంజాయిని కొనుగోలు చేసి తెచ్చినట్టు.. తను కొంత ఉంచుకుని మిగతాది అమ్ముతున్నట్టు చెప్పాడు. అతని వద్ద ఉన్న 2 కేజీల 350 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని కేసును నమోదు చేశారు. నలుగురు నిందితులను కోర్టులో రిమాండ్ చేయనున్నట్లు డీఎస్పీ
తెలిపారు.