రక్తదానం ప్రాణదానంతో సమానం : ఎస్పీ కె. నరసింహ

రక్తదానం ప్రాణదానంతో సమానం :  ఎస్పీ కె. నరసింహ

సూర్యాపేట, వెలుగు: రక్తదానం ప్రాణదానంతో సమానమని ఎస్పీ కె. నరసింహ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమాల్లో భాగంగా పోలీసు అమరవీరుల త్యాగాలకు గుర్తుగా శుక్రవారం సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా రక్తదాన శిబిరాలు నిర్వహించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ నరసింహ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించగా  ఎస్పీ పాల్గొని మొదటగా రక్తదానం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

 ఎస్పీ వెంట అదనపు ఎస్పీ జనార్ధన్ రెడ్డి, డీఎస్పీ నరసింహ చారి, ఆర్ఎస్సైలు అశోక్, రాజశేఖర్ రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ నరసింహ మాట్లాడుతూ..  పోలీసు అమరవీరుల త్యాగాల స్మారకంగా ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామని, అత్యవసర సమయాల్లో ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామన్నారు. పోలీసు సిబ్బంది, ఆటో యూనియన్ కలిసి 100 మందికి పైగా రక్తదానం చేశారు.

నల్గొండ అర్బన్, వెలుగు: రక్త దానం చేయడం అంటే ప్రాణ దానం చేయడం లాంటిదని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయ‌న ప్రారంభించి మాట్లాడారు. పోలీస్‌ అమరవీరుల త్యాగాల స్మారకంగా ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపారు. 

పోలీసుల త్యాగాలు, బలిదానాలను ప్రజలు గుర్తించాలని కోరారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులతో భాగస్వామ్యం కావాలన్నారు. అవసరమైన వారికి సరైన సమయంలో రక్తం అందాలని రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన‌ట్లు చెప్పారు. 150 యూనిట్ల రక్తదానం చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఎస్పీ రమేష్, ఏ ఆర్ డిఎస్పీ శ్రీనివాస్,  సీఐలు రాఘవరావు, రాజశేఖర్ రెడ్డి, ఆర్ఐలు సంతోష్, శ్రీను, హరిబాబు తదితరులు పాల్గొన్నారు.