
సూర్యాపేట, వెలుగు : జిల్లాలో నిరంతరం పోలీస్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్టు ఎస్పీ కె.నరసింహ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో నెలవారీ పోలీసు అధికారుల సమీక్షా సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంకేతికత సద్వినియోగం చేసుకుని ప్రజల భాగస్వామ్యంతో పటిష్టంగా పనిచేయాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలు, రౌడీ షీటర్లపై నిఘా పెట్టాలని చెప్పారు. ప్రతి అంశాన్ని రికార్డ్స్ లో నమోదు చేయాలని ఆదేశించారు. గణేశ్ నవరాత్రి ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. అనంతరం విధుల్లో బాగా పనిచేసిన పోలీస్ సిబ్బందికి రివార్డ్స్ అందజేశారు.
పర్యావరణాన్ని కాపాడుదాం..
ప్రతిఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ రక్షణకు ప్రకృతి పరిరక్షణకు పాటుపడాలని ఎస్పీ నరసింహ అన్నారు. సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఎస్పీ నరసింహ పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సామూహికంగా మొక్కలు నాటామన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ లు రవీందర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, డీఎస్పీలు ప్రసన్నకుమార్, నరసింహాచారి, శ్రీధర్ రెడ్డి, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.