ఈ ఒక్క జవాబుతో మిస్ యూనివర్స్ కిరీటం నెగ్గింది

ఈ ఒక్క జవాబుతో మిస్ యూనివర్స్ కిరీటం నెగ్గింది

ముంబై: బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ సుస్మితా సేన్ గురించి తెలియని వారుండరు. నటి గాక ముందు 1994లో ఆమె మిస్ యూనివర్స్ కిరీటాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. గురువారం 45వ బర్త్ డేను జరుపుకుంటున్న సుస్మితా.. మిస్ యూనివర్స్ పోటీ నాటి రోజులను గుర్తు చేసుకుంది. 19 ఏళ్ల వయస్సులో అందరి ఫేవరెట్ అయిన ఐశ్వర్యారాయ్‌‌ను ఓడించి మిస్ ఇండియా కిరీటాన్ని సుస్మితా సొంతం చేసుకుంది. ఆ తర్వాత విశ్వ సుందరి కిరీటం కోసం ఫిలిప్పీన్స్‌‌లోని మనీలాలో నిర్వహించిన మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొంది.

ప్రిలిమినరీ ఇంటర్వ్యూలో జడ్జిలు అడిగిన ప్రశ్నలకు తన సమాధానాలతో సుస్మితా ఆకట్టుకుంది. అలా ఒక్కో రౌండ్‌‌ను దాటుతూ టాప్-6కు చేరింది. ఆ రౌండ్‌‌లో గ్రామీ అవార్డ్ విన్నర్ సింగర్, నటి ఫ్లోరెన్స్ లారే సుస్మితాను ఓ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ చేశారు. ఒకవేళ నీ దగ్గర డబ్బులు, సమయం ఉంటే అడ్వెంచర్‌‌కు వెళ్లాల్సి వస్తే నువ్వేం చేస్తావ్ అని సుస్మితాను లారే అడిగారు. దానికి జవాబుగా.. ‘నా దృష్టిలో సాహసం అంటే లోలోపల నేను సంతోషంగా ఉండటమే. పిల్లలు కూడా జీవితాన్ని అడ్వెంచరస్‌‌గా మార్చేస్తారు. ఒకవేళ నా దగ్గర తగిన సమయం, డబ్బులు ఉంటే.. నేను పిల్లలకు ఏదోటి చేస్తా. ముఖ్యంగా అణగారిన చిన్నారులకు నాతో అయినంత సాయం అందిస్తా. సాయం అందుకునేందుకు ప్రతి పిల్లాడు అర్హుడే. నేను చిన్నారులతో ఎక్కడికైనా వెళ్లి హుషారుగా గడుపుతా. ఓ మహిళగా ఉండటం అనేది దేవుడు ఇచ్చిన అద్భుత వరం. పిల్లలు పుట్టుకకు మహిళలే కారణం. మహిళలు నిస్వార్థ ప్రేమను పంచుతారు’ అని సుస్మితా సమాధానం ఇచ్చారు.