కాంగ్రెస్​లో రేవంత్​ x​ సీనియర్లు.. సూర్యాపేట, తుంగతుర్తిపై సస్పెన్స్

కాంగ్రెస్​లో రేవంత్​ x​ సీనియర్లు.. సూర్యాపేట, తుంగతుర్తిపై సస్పెన్స్

సూర్యాపేట, వెలుగు : సూర్యాపేట, తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గాలకు కాంగ్రెస్ అభ్యర్థులు ఇంకా కన్ఫర్మ్ కాకపోవడంతో పార్టీ క్యాడర్ లో అయోమయం నెలకొంది. అధిష్టానం ఇప్పటివరకు మూడు లిస్టులు ప్రకటించినా ఈ రెండు నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లు మాత్రం ప్రకటించలేదు. 2018 ఎన్నికల్లో కూడా చివరి నిమిషంలో ప్రకటించడంతో సల్ప మెజార్టీతో ఓడిపోవాల్సి వచ్చింది. 

ఇప్పుడు నామినేషన్లకు మరో రెండు రోజులే గడువు ఉండడంతో ఉత్కంఠ నెలకొంది. సూర్యాపేట విషయానికి వస్తే మాజీమంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి, మరో నేత పటేల్ రమేశ్​ రెడ్డి మధ్య తీవ్ర పోటీ ఉంది. దామోదర్ రెడ్డికే సీటు కన్ఫమ్​ చేసినట్టు పార్టీ క్యాడర్ లో చర్చ జరుగుతుండగా, పటేల్ రమేశ్ రెడ్డి కోసం రేవంత్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. మరోపక్క తుంగతుర్తి నుంచి రెండు సార్లు పోటీ చేసి స్వల్ప మెజారిటీతో ఓడిపోయిన అద్దంకి దయాకర్, మరికొందరు నేతలు కూడా వారి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది.  

ఆశతో పటేల్..తనకే అంటున్న రాంరెడ్డి ​

సూర్యాపేట నియోజకవర్గంలో మాజీ మంత్రి, సీనియర్ నేత రాంరెడ్డి దామోదర్ రెడ్డి, రేవంత్ రెడ్డి ముఖ్య అనుచరుడు పటేల్ రమేశ్ రెడ్డి టికెట్ కోసం పోటీ పడుతున్నారు. 2015లో రేవంత్ రెడ్డితో పాటు పటేల్ రమేశ్ రెడ్డి టీడీపీ నుండి కాంగ్రెస్ లో చేరారు. 2018లో ఆయన సూర్యాపేట టికెట్ ఆశించగా దామోదర్ రెడ్డికే దక్కింది. 

ఇది ఇద్దరి మధ్య దూరాన్ని పెంచింది. ఆ ఎన్నికల్లో పటేల్ రమేశ్ రెడ్డి సహకరించకపోవడంతోనే దామోదర్ రెడ్డి మంత్రి జగదీశ్​రెడ్డి చేతిలో 5వేల ఓట్ల తేడాతో ఓడిపోయాడన్న ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో ఇప్పుడు ఎలాగైనా సూర్యాపేట టికెట్ దక్కించుకొని గెలుపొందాలని దామోదర్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. దీని కోసం నెల రోజులుగా హైదరాబాద్​లోనే ఉంటూ సీనియర్లతో చర్చలు జరుపుతున్నారు. దామోదర్ రెడ్డి కోసం సీనియర్లయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, జానారెడ్డి పట్టుబడుతున్నారు. 

మరోపక్క ఈసారైనా టికెట్ తనకే వచ్చేలా చూడాలని పటేల్ రమేశ్ రెడ్డి..రేవంత్ రెడ్డిని కోరుతున్నారు. మూడో జాబితాకు ముందు టికెట్ తనకే వస్తుందని రమేశ్​రెడ్డి ప్రచార రథాలను కూడా రెడీ చేసుకున్నా పేరు లేకపోవడంతో నిరాశకు గురయ్యారు. దీంతో నాలుగో లిస్టులో అయినా ఇస్తారనే ఆశతో ఉన్నారు. 

అద్దంకికి సీనియర్ అడ్డుపుల్ల 

2014, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్​ తరఫున తుంగతుర్తి నుంచి అద్దంకి దయాకర్ పోటీ చేసి తక్కువ ఓట్ల తేడాతా ఓడిపోయారు. మూడోసారి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నా పార్టీలోని ఓ సీనియర్ లీడర్ అడ్డు కుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ కారణం వల్లే తుంగతుర్తి సీటును ప్రకటించలేదంటున్నారు. దయాకర్​కు పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి మద్దతు ఉండగా.. మరో నేత, ఉద్యమకారుడు మందుల సామేల్, సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు కూడా టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. 

మోత్కుపల్లికి ఉమ్మడి జిల్లా సీనియర్ ​లీడర్ ​కోమటిరెడ్డి వెంకటరెడ్డి సపోర్ట్​ ఉందని చెప్పుకుంటున్నారు. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో కోమటిరెడ్డికి..దయాకర్​కు మధ్య మాటల యుద్ధం జరిగింది. దీంతో ఆయన ఇటీవల పార్టీలో చేరిన మోత్కుపల్లికే టికెట్​ఇవ్వాలని పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. దీంతో ఈ సీటుపై అధిష్టానం ఎటూ తేల్చుకోలేపోతుంది.

బుజ్జగిస్తున్న అధిష్టానం

సూర్యాపేట, తుంగతుర్తి టికెట్లు పెండింగ్ లోనే ఉంచడంతో క్యాడర్ అయోమయంలో పడింది. దామోదర్ రెడ్డికి టికెట్ ఇవ్వకపోతే సూర్యాపేట, తుంగతుర్తి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని ప్రకటించారు. తుంగతుర్తి నియోజకవర్గ ఇన్​చార్జి గుడిపాటి నర్సయ్య కూడా దామోదర్ రెడ్డికి టికెట్​ఇవ్వాలని, లేకపోతే రిజైన్​ చేస్తామని హెచ్చరించారు. 

దీంతో రంగంలోకి దిగిన అధిష్టానం అటు ఆశావాహులతో పాటు ఇటు లీడర్లను, కార్యకర్తలను బుజ్జగిస్తోంది. టికెట్ ఎవరికి ఇచ్చినా కలిసి కట్టుగా పని చేయాలని నచ్చజెప్తోంది.