ఎస్‌‌వీబీ సంక్షోభం.. ఫెడ్‌‌ ఎమర్జెన్సీ మీటింగ్‌‌

 ఎస్‌‌వీబీ సంక్షోభం.. ఫెడ్‌‌ ఎమర్జెన్సీ మీటింగ్‌‌

న్యూఢిల్లీ: సిలికాన్ వ్యాలీ బ్యాంక్‌‌‌‌ (ఎస్‌‌‌‌వీబీ) సంక్షోభం నుంచి బయటపడేందుకు యూఎస్  ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది.  యూఎస్ ఫెడరల్ బ్యాంక్ సోమవారం ఎమెర్జెన్సీ మీటింగ్‌‌‌‌కు రెడీ అయ్యింది. బ్యాంక్ గవర్నర్‌‌‌‌‌‌‌‌లు క్లోజ్డ్‌‌‌‌ మీటింగ్‌‌‌‌  జరపనున్నారు. మరోవైపు ఎస్‌‌‌‌వీబీకి ప్రభుత్వం ఎటువంటి బెయిల్‌‌‌‌ అవుట్ ప్యాకేజి ఇవ్వదని ఆర్థిక మంత్రి జానెట్ యెల్లన్ ప్రకటించారు. కానీ, డిపాజిటర్లకు సపోర్ట్‌‌గా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.   ఫెడరల్ డిపాజిట్‌‌‌‌ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌‌‌‌ (ఎఫ్‌‌‌‌డీఐసీ), యూఎస్ ఫెడరల్ రిజర్వ్‌‌‌‌లు మరింత మంది డిపాజిటర్లకు సపోర్ట్‌‌‌‌గా నిలిచేందుకు సపరేట్‌‌‌‌గా ఒక ఫండ్‌‌‌‌ను ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నాయి. ఎస్‌‌‌‌వీబీ సంక్షోభంతో  ఇతర బ్యాంకులు కూడా దివాలా బాట పడితే యూఎస్ ఎకానమీ తీవ్ర ఇబ్బందుల్లోకి జారుకుంటుంది. 

ఇలాంటి పరిస్థితులే ఏర్పడితే డిపాజిటర్లకు సపోర్ట్‌‌‌‌గా ఉండేందుకు ఈ ఫండ్‌‌‌‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయనుందని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు.  ఎఫ్‌‌‌‌డీఐసీ రూల్స్ ప్రకారం, ఒక బ్యాంక్‌‌‌‌లో ఒక కస్టమర్‌‌‌‌‌‌‌‌ డిపాజిట్ల విలువ 2,50,000 డాలర్ల కంటే తక్కువగా ఉంటే ఆ డిపాజిట్లపై ఇన్సూరెన్స్‌‌‌‌ దక్కుతుంది. కానీ, ఎస్‌‌‌‌వీబీ డిపాజిటర్లలో 85 శాతం మంది ఈ లిమిట్‌‌‌‌ కంటే పైనే ఉన్నారు. దీంతో  గవర్నమెంట్ ఇన్సూరెన్స్ ఉన్న బ్యాంక్‌‌‌‌లో ఇన్సూరెన్స్‌‌‌‌ దక్కించుకోని డిపాజిటర్లే ఎక్కువంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెరుగుతున్నాయి. 2021 లో 180 బిలియన్ డాలర్లకు పెరిగిన ఈ బ్యాంక్‌‌‌‌ లిక్విడిటీ, టెక్ క్రైసిస్‌‌‌‌  వలన భారీగా తగ్గింది. శాలరీ ఇవ్వడంలో ఇబ్బంది పడుతున్న  స్టార్టప్‌‌‌‌లు తమ ఫండ్స్‌‌‌‌ను విత్‌‌‌‌డ్రా చేసుకోవడం పెంచాయి. ఈ ఎఫెక్ట్‌‌‌‌ బ్యాంక్‌‌‌‌పై పడింది. లిక్విడిటీ సమస్యలు తప్పించుకోవడానికి షార్ట్ టర్మ్‌‌‌‌ బాండ్లను లాస్‌లో అమ్మేసింది. ప్రస్తుతం ఎస్‌‌‌‌వీబీ నుంచి తమ ఫండ్స్‌‌‌‌ను తీసుకోవడానికి కస్టమర్లు బ్యాంక్ బ్రాంచుల చుట్టూ క్యూ కడుతున్నారు. 

ఫెడ్ వడ్డీ రేట్లను ఒక శాతం తగ్గిస్తుంది..

మరో నాలుగైదు సార్లయినా ఫెడ్ వడ్డీ రేట్లను పెంచుతుందని భావిస్తున్న మార్కెట్ వర్గాలు  ఎస్‌‌‌‌వీబీ సంక్షోభంతో తమ ఆలోచనలను మార్చుకుంటున్నాయి. ఇక ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించక తప్పదని చెబుతున్నాయి. ఈ నెల 21–22 తేదీల్లో ఫెడ్ పాలసీ మీటింగ్ ఉంది. ఈ మీటింగ్‌‌‌‌లో వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్లు పెంచుతారని ఇప్పటి వరకు అంచనావేశారు. తాజాగా ఎస్‌‌‌‌వీబీ సంక్షోభం బయటపడడంతో ఫెడ్ వైఖరీ ఎలా మారుతుందో చూడాల్సి ఉంది. ఎస్‌వీబీ సంక్షోభం వలన ఫెడ్ వడ్డీ రేట్లను 100 బేసిస్ పాయింట్ల వరకు  తగ్గిస్తుందని,  ఈ ఏడాది డిసెంబర్‌‌‌‌‌‌‌‌లోపు ఈ పని చేస్తుందని ఫైనాన్షియల్ ఎనలిస్ట్ ల్యారీ మెక్‌‌‌‌డొనాల్డ్‌‌‌‌ అన్నారు. ప్రస్తుతం ఉన్న ఫెడ్ వైఖరీకి ఇది పూర్తి విరుద్ధమని చెప్పారు. గత ఏడాది కాలంలోనే వడ్డీ రేట్లను 450 బేసిస్ పాయింట్లు పెంచిన ఫెడ్‌‌‌‌, వ్యవస్థలో లిక్విడిటీ  తగ్గడానికి కారణమయ్యిందని అన్నారు. ‘ ఇంకో రెండు నెలల్లో  ఎస్‌‌‌‌వీబీ ప్రభావం కనిపిస్తుంది. బాండ్‌‌‌‌ ఈల్డ్స్‌‌‌‌ ఎక్కువగా ఉండడం, సెక్యూరిటీ లేని అప్పులు పెరగడం బ్యాంకింగ్ ఎకోసిస్టమ్‌‌‌‌లో కనిపిస్తాయి. అప్పుడు ఫెడ్ కచ్చితంగా వడ్డీ రేట్లను తగ్గించాలి. ఇంకో 6–9 నెలల్లో వడ్డీ రేట్లు ఒక శాతం వరకు  తగ్గుతాయి’ అని అంచనావేశారు.


స్టార్టప్‌లతో ఐటీ మినిస్టర్ మీటింగ్‌..

దేశంలోని స్టార్టప్‌లపై ఎస్‌వీబీ సంక్షోభ ప్రభావాన్ని విశ్లేషించేందుకు స్టార్టప్‌ల ప్రతినిధులతో ఈ వారం కేంద్ర ఐటీ మినిస్టర్ రాజీవ్‌ చంద్రశేఖర్ సమావేశం కానున్నారు. కాగా,  యూఎస్‌‌లో సర్వీస్‌‌లు అందిస్తున్న, ఇంక్యూబేటర్ వై కాంబినేటర్‌‌‌‌తో లింక్‌‌లున్న ఇండియన్  స్టార్టప్‌‌లపై ఎస్‌‌వీబీ సంక్షోభ ప్రభావం కొంత మేర పడనుంది. స్టార్టప్‌‌ల ఎస్‌‌వీబీ  అకౌంట్‌‌లోనే  వై కాంబినేటర్‌‌‌‌  మనీ వేస్తోంది. కానీ,  మీషో, రేజర్‌‌‌‌పే వంటి స్టార్టప్‌‌లు ఇప్పటికే తమ ఫండ్స్‌‌ను ఎస్‌‌వీబీ నుంచి వేరే బ్యాంక్‌‌ అకౌంట్‌‌కు షిఫ్ట్ చేసేశాయి. ఖాతాబుక్‌‌, జెప్టో, ఓకేక్రెడిట్‌‌లు  తమ ఎస్‌‌వీబీ డిపాజిట్లపై మాట్లాడలేదు. తమ రెండు సబ్సిడరీ కంపెనీలకు ఎస్‌‌వీబీలో రూ.64 కోట్ల డిపాజిట్లు ఉన్నాయని నజారా టెక్నాలజీస్ ప్రకటించింది.