సిటీలోని స్లమ్ ఏరియాల్లో కనిపించని స్వచ్ఛ సర్వేక్షణ్

సిటీలోని స్లమ్ ఏరియాల్లో కనిపించని స్వచ్ఛ సర్వేక్షణ్
  •   కనీసం చెత్త తరలించేందుకు రాని స్వచ్ఛ వెహికల్స్
  •  సుమారు 2 వేలకుపైగా బస్తీల్లో ఇదే పరిస్థితి

ఎల్ బీ నగర్, వెలుగు: సిటీలోని స్లమ్స్ ​కంపుకొడుతున్నాయి. ప్రాపర్టీ ట్యాక్స్​లు, ఇతర బిల్లులు వసూలు చేయడంలో ఫోకస్ పెడుతున్న అధికారులు..  స్లమ్ ఏరియాల్లో స్వచ్ఛతను మాత్రం పట్టించు కోవడంలేదు. బస్తీల్లో నిత్యం, చెత్త బురద ఉంటుండటంతో స్థానికులు, అక్కడ రాకపోకలు సాగించేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే ఇక్కడ పర్యటించి, అనేక హామీలిచ్చే లీడర్లు ఆ తర్వాత ఏ హామీ నెరవేర్చరని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బల్దియా పరిధిలో దాదాపు 2 వేలకు పైగానే బస్తీలుండగా.. చిన్న వర్షం పడినా లోతట్టులో ఉండే కొన్ని ప్రాంతాలు మురుగునీటితో నిండిపోతున్నాయి.

ఎన్ని ప్రోగ్రామ్స్ తీసుకొచ్చినా..

సిటీని విశ్వనగరంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛత కోసం స్వచ్ఛ హైదరాబాద్, స్వచ్ఛ్ సర్వేక్షణ్, షాందాన్ హైదరాబాద్ లాంటి కార్యక్రమాలు తీసుకువచ్చింది. అయినా బస్తీల్లో ఎలాంటి మార్పులు రాలేదు. బల్దియా అధికారులు బస్తీల్లో స్వచ్ఛ సర్వేక్షణ్​ పనులు చేపట్టకపోవడంతో అవి ఎప్పట్లాగే మురుగుతో నిండిపోయి ఉంటున్నాయి.  స్లమ్ ఏరియాల్లో క్లీనింగ్​  కోసం ఏ అధికారిని సంప్రదించినా ఎవరూ సరిగా స్పందించట్లేదనే ఆరోపణలున్నాయి.  ఫలానా బస్తీ నుంచి ఫోన్ చేస్తున్నాం.. అని చెప్పగానే అధికారులు కాల్ కట్ చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. చెత్త తరలించడానికి కూడా బండిని పంపించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రోడ్లు లేని బస్తీలు అనేకం

కనీసం సీసీ రోడ్డు కూడా లేని బస్తీలు వందల సంఖ్యలోనే ఉన్నాయి. శంకుస్థాపనలు చేసి శిలాఫలకం ఏర్పాటుచేసిన నేతలు ఏండ్లు గడుస్తున్నా రోడ్డు వేయడం లేదు. దీంతో కొన్ని రోడ్లు కబ్జాలకు గురవుతున్నాయి. నాగోల్​లోని హనుమాన్ నగర్ కాలనీ బతుకమ్మ చౌరస్తా వద్ద 2020 సెప్టెంబర్ లో రూ.25లక్షల నిధులతో జీహెచ్ఎంసీ సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేయగా ఇప్పటికీ ఆ బస్తీలో రోడ్డు వేయలేదు. ఇలాంటి  బస్తీలు సిటీలో అనేకం.

శంకుస్థాపన చేసి వదిలేసిన్రు

మా బస్తీలో కనీసం రోడ్డు కూడా లేదు. అధికారులు, పాలకులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా స్పందించడం లేదు. రెండేళ్ల కిందట రూ.25లక్షల నిధులతో సీసీ రోడ్డు శాంక్షన్ కాగా.. శంకుస్థాపన చేసి వదిలేశారు. ఇప్పటికీ రోడ్డు పనులు ప్రారంభం కాలేదు.
- నల్ల అశోక్, హనుమాన్ నగర్, బతుకమ్మ చౌరస్తా, నాగోల్

ఒక్క రోజు కూడా రోడ్లు ఊడ్వలే.. 

  బల్దియా సిబ్బంది ఒక్కరోజు కూడా వచ్చి రోడ్లు సాఫ్ చేయరు. చెత్త ఎత్తుకపోరు. వానకు మెయిన్ రోడ్ల నుండి వచ్చి బస్తీల్లో చేరిన వ్యర్థాలను మేమే క్లీన్​చేసుకోవాల్సి వస్తోంది. దోమల మందు కొట్టాలని బల్దియా ఎంటమాలజీ సిబ్బందికి  ఫోన్ చేసినా పట్టించుకోరు. ఎన్ని సార్లు కంప్లయింట్ చేసినా రెస్పాన్స్ లేదు.  - నవీన్, సీసల బస్తీ, సరూర్ నగర్