మంచిర్యాల జిల్లాలోని దండేపల్లిలో ఉపాధి హామీ పనుల కోసం వెళ్లిన కూలీలపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ దాడిలో పలువురు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. గురువారం(మార్చి26) ఉదయం దండేపల్లి మండల కేంద్ర సమీపంలోని దండేపల్లి ఫారెస్ట్ బీట్ పరిధిలో ఉపాధి హామీ పథకం కింద కూలీలు పనులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సమీపంలోని చెట్టుపై ఉన్న తేనెటీగలు ఒక్కసారిగా కూలీలపై దాడి చేశాయి.
ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే తేనెటీగలు గుంపులుగా వచ్చి కూలీలను కుట్టడంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. ప్రాణాలు కాపాడుకోవడానికి కూలీలు పరుగులు తీసినప్పటికీ, అప్పటికే పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.
గాయపడిన కూలీలను తోటి సిబ్బంది వెంటనే దండేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రస్తుతం వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రులలో కొందరి పరిస్థితి నిలకడగానే ఉన్నప్పటికీ, తేనెటీగలు ఎక్కువగా కుట్టిన వారు తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది.
