ఉత్తగుండుడే ఉద్యోగం: నెలకు లక్షన్నర జీతం

ఉత్తగుండుడే ఉద్యోగం: నెలకు లక్షన్నర జీతం

అబ్బ.. ఈ జాబుల్లేకుండా, పని చేయకుండా జేబు నిండితే బాగుండు’.. ఏదో ఒక దశలో కొందరికైనా ఈ ఆలోచన వచ్చి ఉంటుంది. స్వీడన్ లోని ఓ కంపెనీ అలాంటి ఆఫరే ఇస్తోంది. ‘‘మీరు ఏ పనీ చేయాల్సిన పనిలేదు. మేం మాత్రం జీతమిస్తం” అంటూ ఆఫరిచ్చింది. నెలో.. ఏడాదో కాదు.. జీవితాంతం! కానీ, ఒక్కపని చేయాలండోయ్ .. వెళ్లేటప్పుడు ఇన్ , వచ్చేటప్పుడు అవుట్ పంచ్ కొట్టడం. అది కూడా కొట్టకపోతే ‘పని’ చేయనట్టే మరి. లోపలికెళ్లాక ఏం కావాలంటే అది చేసుకోవచ్చు. టీవీ చూడొచ్చు. ఆటాలాడొచ్చు. అటూ ఇటూ తిరగొచ్చు. నడుంవాల్చి హాయిగా కునుకేసేయొచ్చు. అదీ కాదు, బయటికెళ్లి వేరే జాబ్​ చేసుకుంటాం .. అని అన్నారనుకోం డి.. గ్యాప్ లో ఆ పనీ కానిచ్చేసే యొచ్చు.

ఎక్కడబ్బా ఆ పని… ఎంతిస్తారు ?
స్వీడన్ లోని గోథెన్ బర్గ్​ పట్టణం. ప్రభుత్వ సహకారంతో కడుతున్న కోర్స్ వాగెన్ రైల్వేస్టే షన్ అది. ఆ రైల్వే స్టేషన్ లోనే పని. నెల కాగానే 2,320 డాలర్లు (సుమారు ₹1.62 లక్షలు) అలా బ్యాం కులో పడిపోతాయి. అంతే కాదండోయ్ .. ఏడాదికోసారి ఇంక్రిమెంట్లూ ఉంటాయి. రిటైరయ్యాక పింఛనూ ఇస్తారు. ఒక్కసారి ఇన్ పంచ్ కొట్టగానే ప్లాట్ ఫాం పై ఉన్న లైట్లు వెలిగిపోతాయి. ఎందుకంటే పని లేని ఓ ఉద్యోగి పని చేస్తున్నారని ప్రయాణికులకు తెలియాలి కదా. పనయ్యాక అవుట్ పంచ్ కొట్టి బయటకెళ్లగానే ఆ లైట్లు బందవుతాయి. ఖాళీగా ఉన్న ఆ మధ్యలో కావాలంటే వేరే ఏదైనా జాబ్​ చేసు కో వచ్చు. ఉద్యోగి తనకు తానుగా వదిలేస్తే తప్ప.. జీవితాం తం ఆ పనిలేని ఆ జాబ్​ గ్యారంటీ. ఈ చదువే కావాలి.. అలాంటోళ్లే రావాలి అన్న రూలేం లేదు. ఎవరైనా.. ఎక్కడినుంచైనా రావొచ్చు. ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. జాబ్​ బాగా నచ్చేసిందా? ఆ జాబ్​ కేవలం ఒక్కటంటే ఒక్కటే ఉంది. అదీ 2026 వరకు ఆగాలి. ఎందుకంటే.. ఆ రైల్వే స్టేషన్ ను అప్పుడే ఓపెన్ చేస్తున్నారు కాబట్టి. పనిలేని ఉద్యోగం కదా.. చాలా మందే అప్లై చేసుకుం టారేమో. అందులో లక్కు పరీక్షించుకోవడమంటే కష్టమే మరి.

జోక్‌ లా ఉన్నా.. చాలా సీరియస్‌
దానికి ‘ఎటర్నల్ ఎంప్లాయ్ మెంట్ ’ అని పేరు పెట్టారు. ఇదొక సామాజిక, రాజకీయ ప్రయోగం. 2017 ప్రారంభంలో స్వీడన్ పబ్లిక్ ఆర్ట్​ ఏజెన్సీ, స్వీడన్ రవాణా శాఖ.. అంతర్జాతీయ ఆర్టిస్టులకు ఓ పోటీ పెట్టాయి. గెలిచినోళ్లకు 7.5 లక్షల డాలర్లు (సుమారు ₹5.24 కోట్లు) ప్రైజ్ మనీగా ఇస్తామని ప్రకటించాయి. కొత్త రైల్వే స్టేషన్ కు డిజైన్ చేయడమే పోటీ. సైమన్ గోల్డిన్ , జాకబ్​ సెన్నెబీ అనే ఇద్దరు ఆర్టిస్టుల కళానైపుణ్యం ఆ సంస్థలకు నచ్చింది. వెంటనే వాళ్లకే ఆ ప్రాజెక్టును అప్పగించారు.వచ్చిన ఆ ప్రైజ్ మనీని ఏ పనీ చేయని ఓ ఉద్యోగి జీతం కోసం వాడతామని వాళ్లిద్దరూ ప్రకటిం చారు. జీవితాం తం.. అంటే 120 ఏళ్ల పాటు ఫ్రీగా జీతమిచ్చేస్తా మన్నారు. ‘‘ఇప్పటికే మనుషులు చేసే పనిలో యంత్రాలు వచ్చేస్తుండడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కువైపోతుండడం వల్ల.. ఎప్పుడో ఒకప్పుడు అందరి పనులూ పోతాయి. అందుకే పని చేయాల్సిన అవసరం లేని ఓ ఉద్యోగి ని నియమిస్తాం” అని చెప్పారు. ఉద్యోగుల ఇంక్రిమెంట్లతో పోల్చినా ప్రపంచ సంపద కొందరి చేతుల్లోనే ఉండిపోతుందన్న ఫ్రాన్స్ ఆర్థికవేత్త థామస్ పికెటీ సిద్ధాంతాన్ని వారు గుర్తు చేశారు. ప్రైజ్ మనీని మార్కెట్ లో ఇన్వెస్ట్​ చేస్తామని తద్వారా ఆ ఒక్క ఉద్యోగికి జీవితాంతం జీతమిస్తామని చెప్పారు. ఏటా 3.2 శాతం చొప్పున ఇంక్రిమెంట్ ఇస్తామన్నారు. ఈ ఒక్క ఉద్యోగం కోసం ఎటర్నల్ ఎంప్లాయ్ మెంట్ ఫౌండేషన్ అనే ఓ బోర్డును కూడా ఏర్పాటు చేశారు. అయితే, వాళ్ల ఆఫర్ పై కొందరు పెదవి విరుస్తున్నారు.