స్విస్‌ బ్యాంకు సీక్రెట్లు చెప్పేస్తున్రు

స్విస్‌ బ్యాంకు సీక్రెట్లు చెప్పేస్తున్రు

న్యూఢిల్లీ/బెర్నె : బ్లాక్‌‌మనీ మీద ఇండియా గవర్నమెంట్‌‌ చేస్తున్న పోరాటానికి త్వరలో ఊపు రానుంది. స్విట్జర్లాండ్‌‌ బ్యాంకులలోని ఇండియన్స్‌‌ అకౌంట్ల వివరాలు సెప్టెంబర్‌‌ నుంచి ఇండియాకు రానున్నాయి. కిందటేడాది (2018) నుంచి మూసేసిన అకౌంట్ల వివరాలు కూడా అందించనున్నారు. ఆటోమేటిక్‌‌ ఎక్స్చేంజ్‌‌ ఆఫ్‌‌ ఇన్ఫర్మేషన్‌‌ (ఏఈఓఐ) ఫ్రేమ్‌‌వర్క్‌‌ కింద స్విట్జర్లాండ్‌‌ ఈ సమాచారాన్ని ఇండియా టాక్స్‌‌ అథారిటీకి అందించనుంది. స్విట్జర్లాండ్‌‌లోని బ్యాంకులలో అకౌంట్లున్న ప్రతి ఇండియన్‌‌ అకౌంట్‌‌ వివరాలనూ ఇవ్వనున్నారు. మొదటిదఫా అకౌంట్ల వివరాలు ఈ ఏడాది సెప్టెంబర్‌‌లో ఇండియా టాక్స్‌‌ అథారిటీ చేతికి రానున్నాయి.

సెప్టెంబర్‌‌ నుంచి వివరాలు ఇవ్వడం మొదలవుతుందని, ఆ తర్వాత దఫదఫాలుగా సమాచారం ఇస్తామని ఫెడరల్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌ ఆఫ్‌‌ ఫైనాన్స్‌‌ (ఎఫ్‌‌డీఎఫ్‌‌) స్విట్జర్లాండ్‌‌ తెలిపింది. ఇండియాకు చెందిన 100 సంస్థల అకౌంట్ల వివరాలు ఇప్పటికే వచ్చాయి. ఈ 100 అకౌంట్‌‌ హోల్డర్లలో వ్యక్తులతోపాటు సంస్థలూ ఉన్నాయి. ఆ వ్యక్తులూ లేదా సంస్థలు చేసిన ఆర్థిక నేరాల రుజువులను ఇండియా ఇవ్వడంతో ఆ సంస్థలు లేదా వ్యక్తుల అకౌంట్ల వివరాలను స్విట్జర్లాండ్ బ్యాంకులు ద్వైపాక్షిక ఒప్పందం కింద ఇచ్చాయి. ఆటోమేటిక్‌‌ రూట్లో స్విట్జర్లాండ్‌‌ నుంచి అకౌంట్ల వివరాలు సెప్టెంబర్‌‌ నుంచి రావడం మొదలవుతుందని లోక్‌‌సభలో కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి వీ మురళీధరన్‌‌ రాతపూర్వకంగా తెలిపారు. దర్యాప్తులో ఉన్న కేసులలో వివరాలను ఇచ్చి, పుచ్చుకోవడానికి రెండు దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయని మంత్రి తెలిపారు. అవినీతికి పాల్పడిన వ్యక్తుల ఆర్థిక వివరాలు కూడా ఆటోమేటిక్‌‌ రూట్‌‌ లేదా ప్రత్యేక రిక్వెస్ట్‌‌  మీద స్విట్జర్లాండ్‌‌ ప్రభుత్వం అందించనున్నట్లు వెల్లడించారు. స్విట్జర్లాండ్‌‌ నుంచి వచ్చే అకౌంట్ల వివరాలను బహిర్గతం చేస్తారా అనే ప్రశ్నకు, కాన్ఫిడెన్షియాలిటీ ప్రొవిజన్లపై అది ఆధారపడి ఉంటుందని బదులిచ్చారు.

అవినీతి, పన్ను మోసాలపై ఇండియా చేస్తున్న పోరాటానికి స్విట్జర్లాండ్‌‌ ఇప్పటికే మద్దతు ప్రకటించింది. ఏఈఓఐ ఫ్రేమ్‌‌ వర్క్‌‌ కింద స్విట్జర్లాండ్‌‌లోని ఆర్థిక సంస్థలలో అకౌంట్లున్న ఇండియన్స్‌‌కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇచ్చేందుకు అంగీకరించింది. సెప్టెంబర్‌‌ 2019లో మొదటి దఫా సమాచారం ఇవ్వనుండగా, ఆ తర్వాత నుంచి ప్రతీ ఏడాదీ ఈ సమాచారాన్ని అందిస్తారు. వివరాలు వచ్చాక, వాటిని పరిశీలించి పన్నుల ఎగవేత మీద చర్యలను కేంద్ర ప్రభుత్వం తీసుకోనుంది. మూడు కేటగిరీలుగా ఇండియన్స్‌‌ అకౌంట్ల వివరాలను ఇవ్వనున్నారు. అకౌంట్‌‌ హోల్డర్‌‌ పేరు, అడ్రస్‌‌, పుట్టిన తేదీ, సంస్థ ఐడెంటిఫికేషన్‌‌ నెంబర్‌‌లతోపాటు ఆర్థికపరమైన వివరాలనూ స్విట్జర్లాండ్‌‌ ప్రభుత్వం పంపించనుంది. వడ్డీ ఆదాయం, డివిడెండ్లు ఇతర రెవెన్యూ, ఇన్సూరెన్స్‌‌ పాలసీల ద్వారా వచ్చిన సొమ్ము, క్రెడిట్‌‌ బ్యాలెన్సులు, ఆర్థిక ఆస్థుల వివరాలను ఇవ్వనుంది. ఏఈఓఐ కింద స్విట్జర్లాండ్‌‌ ఇప్పటికే గ్లోబల్‌‌గా 36 దేశాలకు తమ దేశంలోని బ్యాంకులలో అకౌంట్లున్న వారి వివరాలను అందచేసింది. ఇండియాకు మాత్రం తొలిసారిగా ఈ ఏడాది సెప్టెంబర్‌‌ నుంచి ఇవ్వనున్నారు. ఈ ఫ్రేమ్‌‌ వర్క్‌‌లో భాగంగా ఉన్న 58 దేశాలకు ఇండియా సమాచారాన్ని ఇచ్చిందని, ఇండియాలో ఉన్న డేటా ప్రొటెక్షన్‌‌ చట్టాల మీద తమకు విశ్వాసం ఉందని స్విట్జర్లాండ్‌‌ స్టేట్‌‌ సెక్రటేరియట్‌‌ ఫర్‌‌ ఇంటర్నేషనల్‌‌ ఫైనాన్స్‌‌ (ఎస్‌‌ఐఎఫ్‌‌) తెలిపింది. ఒకరికొకరు సాయం చేసుకునే పద్ధతిలో 100 కి పైగా దేశాలతో ఇండియా కలిసి పనిచేస్తోందని పేర్కొంది.